ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసి.. చిల్లర రాజకీయాలు చేస్తున్నారు..

ABN , First Publish Date - 2022-06-22T00:57:21+05:30 IST

సీఎం కేసీఆర్ ప్రజల ఆరోగ్యాన్ని గాలికొదిలేసి, చిల్లర రాజకీయాలు చేస్తున్నారని జేపీ నేత విజయశాంతి విమర్శించారు. వర్షాకాలం వచ్చినా గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుకు ప్రభుత్వం..

ప్రజారోగ్యాన్ని గాలికొదిలేసి.. చిల్లర రాజకీయాలు చేస్తున్నారు..

హైదరాబాద్:  సీఎం కేసీఆర్ ప్రజల ఆరోగ్యాన్ని గాలికొదిలేసి, చిల్లర రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ నేత విజయశాంతి విమర్శించారు. వర్షాకాలం వచ్చినా గ్రామాల్లో పారిశుధ్యం మెరుగుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోలేదన్నారు. ఇప్పటికే పారిశుధ్యం అధ్వానంగా ఉందని, వర్షాలు ప్రారంభమైనందున.. మరింత అధ్వానంగా తయారయ్యే అవకాశం ఉందన్నారు. మరోవైపు ఆస్పత్రుల్లో వివిధ పోస్టుల భర్తీపై ప్రభుత్వం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సోషల్ మీడియా వేదికగా ఆమె టీఆర్ఎస్‌పై పలు విమర్శలు చేశారు. అవి ఆమె మాటల్లోనే.. 


‘‘సీఎం కేసీఆర్ ప్ర‌జ‌ల ఆరోగ్యాన్ని గాలికొదిలేసి చిల్ల‌ర రాజ‌కీయాలు చేస్తుండు. రాష్ట్రంలో వానాకాలం ప్రారంభమైంది. కానీ, ఎక్కడికక్కడ పారిశుద్ధ్యం లోపించింది. పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి ముగిసినా శివారు ప్రాంతాల పరిస్థితి మారలేదు. హాస్పిటల్స్‌లో డాక్టర్లు, సిబ్బంది కొరత వేధిస్తోంది. ఏళ్లకేళ్లుగా వైద్యుల పోస్టులు భర్తీ చేయకపోవడంతో జనం ఇబ్బంది పడుతున్నరు. ఒక్క ఆదిలాబాద్ జిల్లానే చూసుకుంటే.. గత ఏడాది డయేరియా కేసులు 16,089 నమోదు కాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 6,452 కేసులు నమోదయ్యాయి. గతేడాది మలేరియా రెండు, డెంగీ 231 కేసులు నమోదు కాగా... ఈ ఏడాది ఇప్పటి వరకే 38 కేసులు రికార్డ్ ​అయ్యాయి.


‘‘ఆదిలాబాద్ జిల్లాలో 22  పీహెచ్​సీలు, ఏరియా హాస్పిటల్, ఐదు అర్బన్ హెల్త్ సెంటర్లు, 126 సబ్ సెంటర్లు ఉండగా...  పీహెచ్​సీల్లో 13 డాక్టర్​ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. అర్బన్​ సెంటర్లలో ఏడు డాక్టర్ ​పోస్టులు ఖాళీగా ఉన్నయి. ఫార్మసిస్ట్ పోస్టులు ఆరు, ల్యాబ్ టెక్నిషియన్ పోస్టులు ఐదు, మిగతావి 94 పోస్టులు ఖాళీగా ఉన్నయి. ఈ ఒక్క‌ జిల్లానే కాదు.... రాష్ట్రం మొత్తం ఇదే ప‌రిస్థితి ఉంది. వైద్యులు లేక.. సిబ్బంది లేక.. ప్ర‌జ‌ల‌కు వైద్యం ఎట్లా అందుతుందో ఈ స‌ర్కార్‌కే తెలియాలి. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు గ్రామాల్లో వ్యాధుల నియంత్రణకు చర్యలు తీసుకోలేదు, అవగాహన కార్యక్రమాలు చేపట్టలేదు, ఫీవర్ సర్వే నిర్వహించలేదు. 


‘‘దోమ తెరల పంపిణీ, మురికి గుంతల్లో గంబూజియ చేపల పెంపకం, యాంటీ లార్వా, ఆయిల్ బాల్స్, క్లోరినేషన్ ప్రక్రియ, ఫాగింగ్, గిరిజన ప్రాంతాల్లో ప్రత్యేక ప్రణాళిక వంటి కార్యక్రమాలు ఇంకా మొదలుకాలేదు. కేసీఆర్ స‌ర్కార్ ఇవన్నీ గాలికొదిలేసి చోద్యం చూస్తోంది. ప్ర‌జల ప్రాణాల‌తో చెలగాటమాడుతున్న కేసీఆర్ స‌ర్కార్‌కు తెలంగాణ ప్ర‌జానీకం కచ్చితంగా త‌గిన శాస్తి చేస్తుంది’’. అని విజయశాంతి పేర్కొన్నారు.Updated Date - 2022-06-22T00:57:21+05:30 IST