అమెరికా, పాక్‌ అధ్యక్షులను కలిసినా.. బీజేపీ భయపడదు

ABN , First Publish Date - 2022-05-23T09:26:26+05:30 IST

‘‘సీఎం కేసీఆర్‌ తెలంగాణ రైతులను ఆదుకోవడం మానేసి..

అమెరికా, పాక్‌ అధ్యక్షులను కలిసినా.. బీజేపీ భయపడదు

  • కేసీఆర్‌ కుటుంబానికి చీదరింపు తప్పదు
  • పెట్రో ధరల తగ్గింపుపై ఆ వ్యాఖ్యలు సిగ్గుచేటు: కిషన్‌రెడ్డి


హైదరాబాద్‌ సిటీ/హిమాయత్‌నగర్‌, మే 22 (ఆంధ్రజ్యోతి): ‘‘సీఎం కేసీఆర్‌ తెలంగాణ రైతులను ఆదుకోవడం మానేసి.. పంజాబ్‌ రైతులను కలుస్తున్నారు. ఇంతకు ముందు కూడా ఎన్నో సందర్భాల్లో దేశవ్యాప్తంగా సంచలనాలు సృష్టిస్తానంటూ కేసీఆర్‌ ప్రకటనలు చేశారు. అవన్నీ ప్రగతి భవన్‌కే పరిమితం అయ్యాయి. కేసీఆర్‌ అమెరికా, పాక్‌ అధ్యక్షులను కలిసినా.. బీజేపీ భయపడేది లేదు. మీరెన్ని కుట్రలు చేసినా.. మోదీపై ఎంత విషప్రచారం చేసినా.. ప్రజలు నమ్మరు. రాష్ట్ర ప్రజల నుంచి కేసీఆర్‌ కుటుంబానికి చీదరింపులు తప్పవు’’ అంటూ సీఎం కేసీఆర్‌పై కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి మండిపడ్డారు. కేసీఆర్‌ను ఇక్కడి ప్రజలు నమ్మడం లేదని.. ఢిల్లీ, పంజాబ్‌ వెళ్లారని విమర్శించారు. తెలంగాణలో రైతుల ఆత్మహత్యలకు దిక్కులేదని.. పంజాబ్‌ రైతులను ఆదుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌ నారాయణగూడలోని కేశవ మెమోరియల్‌ స్కూల్‌లో అటల్‌ బిహారీ వాజపేయి ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘స్కిల్‌ డెవల్‌పమెంట్‌ శిక్షణ, సర్టిఫికెట్‌ల పంపిణీ’ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ఢిల్లీకి వెళ్లడం వల్లే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు తగ్గించారనడం సిగ్గుచేటన్నారు. ప్రజలపై భారం తగ్గించేందుకు కేంద్రం పెట్రోల్‌, డీజిల్‌ ధరలను తగ్గించిందని, దేశంలోనే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యధికంగా పెట్రోల్‌, డీజిల్‌పై పన్నులు వసూలు చేస్తోందని విమర్శించారు. 


రాష్ట్రంలో పెట్రోల్‌, డీజిల్‌పై పన్నులను తగ్గించాలని డిమాండ్‌ చేశారు. నూతన విద్యావిధానంపై కేసీఆర్‌ వ్యాఖ్యలను ఆయన తిప్పికొట్టారు. ‘‘నిరుపేదల కోసమే కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని తీసుకువచ్చింది. దానిపై కేసీఆర్‌కు కనీస అవగాహన కూడా లేదు. తెలంగాణలో కేజీ టు పీజీ ఉచిత విద్యను అందిస్తామన్న వాగ్దానం ఏమైంది?’’ అని ఆయన సీఎం కేసీఆర్‌ను ప్రశ్నించారు. కరోనా వల్ల రెండేళ్లుగా యోగా-డేను నిర్వహించడానికి వీలుపడలేదని.. జూన్‌ 21న ప్రపంచ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కిషన్‌రెడ్డి పిలుపునిచ్చారు. ఈ నెల 27న ఎల్‌బీ స్టేడియంలో 25 రోజుల యోగా డే కౌంట్‌డౌన్‌ ప్రారంభమవుతుందని వివరించారు. యోగా దినోత్సవాన్ని ట్యాంక్‌బండ్‌పై ఘనంగా నిర్వహిస్తామని, ఇద్దరు కేంద్ర మంత్రులు ఆ కార్యక్రమానికి హాజరవుతారని వెల్లడించారు. కేశవ మెమోరియల్‌ స్కూల్‌లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డిని విప్లవ గాయకుడు గద్దర్‌ కలిశారు. పాట అనేది ప్రతిపక్షం లాంటిదని.. తాను పాడిన పాటలపై పలు రాష్ట్రాల్లో నమోదైన కేసులను ఎత్తివేయాలంటూ కేంద్ర హోంమంత్రికి రాసిన లేఖ గురించి ఆయన ప్రస్తావించినట్లు తెలిసింది. ఆ లేఖను అమిత్‌షా పరిశీలించారో లేదోనన్న గద్దర్‌.. దానిపై ఆయనతో చర్చించాలని కిషన్‌రెడ్డిని కోరారు.

Updated Date - 2022-05-23T09:26:26+05:30 IST