బావ డైరెక్షన్.. బామ్మర్దుల యాక్షన్!
ABN , First Publish Date - 2022-05-22T08:32:21+05:30 IST
బేగంబజార్‌లో శుక్రవారం రాత్రి జరిగిన హత్య కేసులో నిందితులను పోలీసులు శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత అరెస్టు చేశారు.

- కత్తులతో పొడిచి.. రాడ్లతో కొట్టి.. గ్రానైట్‌తో మోది..
- నీరజ్‌ను దారుణంగా చంపిన సంజన పెదనాన్న కొడుకులు
- బేగంబజార్ హత్య కేసులో నలుగురు నిందితుల అరెస్టు
- 24 గంటల్లో కటకటాల్లోకి నెట్టిన పోలీసులు
- పరారీలో సూత్రధారి అభినందన్, మరొకరు
హైదరాబాద్ సిటీ/అఫ్జల్‌గంజ్, మే 21 (ఆంధ్రజ్యోతి): బేగంబజార్‌లో శుక్రవారం రాత్రి జరిగిన హత్య కేసులో నిందితులను పోలీసులు శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత అరెస్టు చేశారు. తమ ఇష్టానికి వ్యతిరేకంగా పెళ్లి చేసుకున్నందుకే అమ్మాయి బావ స్కెచ్ వేయగా, పెద్దనాన్న కొడుకులు కలిసి అబ్బాయిని దారుణంగా హత్య చేసినట్లు నిర్ధారించారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. వెస్ట్‌జోన్ డీసీపీ జోవియల్ డేవిస్ శనివారం రాత్రి విలేకరులకు వివరాలు వెల్లడించారు. బేగంబజార్ కోల్సావాడికి చెందిన నీరజ్ పన్వార్ (21), అదే ప్రాంతానికి చెందిన సంజన(19) రెండేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. 2021 ఏప్రిల్ 13న ఇద్దరూ కలిసి ఇంట్లోంచి పారిపోయి రిజిస్ట్రర్ మ్యారేజ్ చేసుకున్నారు. అనంతరం ఇద్దరూ తమకు రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకోగా, ఇరువురు కుటుంబసభ్యులను పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చి పంపారు. అయినా ‘నిన్ను నీ భర్తను చంపేస్తాం’ అంటూ సంజన పెదనాన్న కొడుకులు (అన్నయ్యలు) విజయ్ యాదవ్, సంజయ్ యాదవ్ బెదిరించారు. ఈలోగా గర్భం దాల్చిన సంజన నెలన్నర క్రితం మగబిడ్డకు జన్మనిచ్చింది. బాబు పుట్టిన తర్వాత సంజన తల్లి, సోదరి ఆమెతో ఫోన్లో మాట్లాడుతుండడంతో, మాపై కోపం పోయి ఉంటుందని భావించిన నీరజ్, సంజనలు నెలరోజుల క్రితం బేగంబజార్ కోల్సావాడికి వచ్చి నీరజ్ ఇంట్లోనే ఉంటున్నారు.
మాటేసి.. మర్డర్ !
నీరజ్ ఇంటికి సంజన తల్లిగారి ఇల్లు దగ్గరలోనే ఉండటం, తరచూ నీరజ్ ఎదురుపడుతుండడంతో విజయ్ యాదవ్, సంజయ్ యాదవ్‌లు పగతో రగిలిపోయారు. నీరజ్‌ను హత్య చేసి పగ తీర్చుకోవాలనుకున్నారు. విషయాన్ని మేనబావ అయిన అభినందన్ యాదవ్ అలియాస్ నందన్‌కు చెప్పారు. బామ్మర్దుల కోరిక మేరకు అభినందన్ పక్కాగా స్కెచ్ వేశాడు. నీరజ్‌పై వారం రోజులు రెక్కీ నిర్వహించాడు. విజయ్, సంజయ్‌లు తనతో పాటు మరో ముగ్గురు స్నేహితులు రోహిత్ యాదవ్, మహేష్ అహీర్ యాదవ్, ఓ మైనర్ బాలుడిని తమతో చేర్చుకున్నారు. శుక్రవారం రాత్రి 7.30 గంటలకు మేనమామ దుకాణానికి వెళ్లిన నీరజ్.. తన తాతయ్యతో స్కూటీపై తిరిగి వస్తున్న విషయాన్ని పసిగట్టిన అభినందన్.. ఫోన్లో విజయ్, సంజయ్‌ల బృందానికి సూచనలు చేశాడు. దీనికి అనుగుణంగా నీరజ్‌ను వెంబడించిన నిందితులు విజయ్, సంజయ్, రోహిత్, మహేశ్, మైనర్ బాలుడు కలిసి అతడి వాహనాన్ని ఢీకొట్టి కిందపడేశారు. కత్తులతో విచక్షణా రహితంగా పొడిచారు.
రాడ్లతో కొట్టారు. తీవ్ర గాయాలతో రక్తపు మడుగులో కొట్టుమిట్టాడుతున్న నీరజ్ చనిపోలేదన్న అనుమానంతో గ్రానైట్ రాయితో తలపై మోదారు. చనిపోయాడని నిర్ధారించుకుని అక్కడి నుంచి పరారయ్యారు. ఈ ఘటనపై వెస్ట్ట్జోన్ డీసీపీ ఆధ్వర్యంలో రంగంలోకి దిగిన 7 బృందాలు శుక్రవారం అర్థరాత్రి నలుగురు నిందితులు విజయ్, సంజయ్, రోహిత్, మరో బాలుడిని అదుపులోకి తీసుకున్నాయి. ప్రధాన నిందితుడు అభినందన్ యాదవ్, మరో నిందితుడు మహేష్ అహీర్ యాదవ్‌లు పరారీలో ఉన్నారు. నిందితులు విచారణలో నీరజ్‌ను హత్య చేసినట్లు ఒప్పుకున్నట్లు డీసీపీ జోవియల్ డేవిస్ తెలిపారు. కాగా, నీరజ్ కులోన్మాద హత్యపై మానవ హక్కుల సంఘఽం (హెచ్చార్సీ) ఆగ్రహం వ్యక్తం చేసింది. హత్యోదంతంపై మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా కేసును సుమోటోగా తీసుకుంది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి జూన్-30 లోగా నివేదిక అందించాలని హైదరాబాద్ సిటీ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది.