తగ్గేది లేదు: బాసర Triple IT విద్యార్థులు

ABN , First Publish Date - 2022-06-21T00:58:47+05:30 IST

ప్రభుత్వం మెట్టు దిగడంలేదు.. డిమాండ్ల విషయంలో విద్యార్ధులూ తగ్గడం లేదు. బాసర అర్జీయూకేటి-ట్రిపుల్ ఐటీ (Triple IT)లో విద్యార్థుల

తగ్గేది లేదు: బాసర Triple IT విద్యార్థులు

నిర్మల్: ప్రభుత్వం మెట్టు దిగడంలేదు.. డిమాండ్ల విషయంలో విద్యార్ధులూ తగ్గడం లేదు. బాసర అర్జీయూకేటి-ట్రిపుల్ ఐటీ (Triple IT)లో విద్యార్థుల (Students) నిరసనలు మిన్నంటుతున్నాయి. ప్రభుత్వం స్పందించే వరకు ఆందోళన చేస్తామని స్పష్టం చేశారు. సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం నుంచి స్పష్టత రాకపోవడంతో ఐటీ విద్యార్థులు ఏడో రోజు కూడా తమ ఆందోళనను ఉధృతం చేశారు. ఆందోళన నిర్వహిస్తున్న విద్యార్థులు మీడియాతో మాట్లాడారు. ‘‘మావి గొంతెమ్మ కోరికలు కావు. న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలనే కోరుతున్నాం. 12 డిమాండ్ల విషయంలో తగ్గేది లేదు. ప్రభుత్వం కచ్చితమైన హామీ ఇస్తే ఆందోళన విరమిస్తాం. ల్యాప్‌టాప్, యూనిఫామ్‌లాంటి మౌలిక సదుపాయాల కల్పనకు.. వెంటనే టెండర్లు పిలవాలి. డిమాండ్లలో కొన్నింటిని వెంటనే పరిష్కరించాలి. ఎప్పటిలోగా మిగతా సమస్యలు పరిష్కరిస్తారో చెప్పాలి’’ అని విద్యార్థులు తేగేసి చెప్పారు.బాసర ట్రిపుల్‌ ఐటీలో విద్యార్థులు తలపెట్టిన ఆందోళన ఇప్పట్లో చల్లారేలేలా కనిపించడం లేదు. విద్యార్థులు తమ ఆందోళనను రోజురోజుకు తీవ్రతరం చేస్తున్నారు. విద్యార్థుల ఆందోళనను ఆపేందుకు ప్రభుత్వం చేస్తున్న చర్యలు సఫలం కావడం లేదు. అధికారులు, మంత్రులు ఇస్తున్న హామీలు విద్యార్థులను సంతృప్తి పరచడం లేదు. ప్రతీరోజు యూనివర్సిటీ అధికారులు విద్యార్థులతో చర్చిస్తూనే ఉన్నారు. నిరసనలు కొనసాగుతుండడం, తరగతులు జరగకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. పిల్లలను తీసుకెళ్తున్నారు. ఆదివారం 250 మంది వరకు వెళ్లిపోయారు. ఇలాంటివారికి యూనివర్సిటీ అధికారులు వెంటనే ఔట్‌ పాస్‌లు జారీ చేస్తున్నారు. విద్యార్థులు ఆందోళన విరమించకుంటే చివరి అస్త్రంగా కొన్ని రోజులు సెలవులు ప్రకటించే అవకాశం ఉంది. కాగా, వర్సిటీలోపల పరిస్థితి ప్రశాంతంగా ఉన్నప్పటికీ వెలుపల మాత్రం పోలీసుల భారీ బందోబస్తుతో గంభీర వాతావరణం కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులు సహా ట్రిపుల్‌ ఐటీ వైపు వెళ్లే ప్రతి వాహనాన్ని పోలీసులు మూడు చెక్‌ పోస్టుల్లో తనిఖీ చేసిన అనంతరమే అనుమతిస్తున్నారు. ఆందోళన కారులు, విద్యార్థి సంఘాల నాయకులు వెళ్లే అవకాశం లేకుండా చూస్తున్నారు.

Updated Date - 2022-06-21T00:58:47+05:30 IST