గుంతల్లో రోడ్లు

ABN , First Publish Date - 2022-09-21T06:49:20+05:30 IST

Select pకారో.. బైకో ఎక్కి రోడ్డు మీదకొస్తే సౌకర్యవంతంగా ప్రయాణించే పరిస్థితులు లేవు. తారు అంతా కొట్టుకుపోయి..

గుంతల్లో రోడ్లు

  • రాష్ట్రవ్యాప్తంగా దారుణంగా దెబ్బతిన్న దారులు
  • వర్షాలకు గండ్లు.. కంకర తేలి గుంతలు.. నీళ్లతో బురదమయం 
  • తెగిన కల్వర్టులు.. ప్రయాణికుల పాట్లు.. పెరుగుతున్న ప్రమాదాలు
  • మరమ్మతులపై అధికారుల ప్రతిపాదనలు. సర్కారు మౌనం 
  • తాత్కాలిక మరమ్మతులకూ నిధులు మంజూరు చేయని వైనం
  • రాష్ట్రంలోని రహదారులపై ‘ఆంధ్రజ్యోతి’ క్షేత్ర స్థాయి పరిశీలన


(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): కారో.. బైకో ఎక్కి రోడ్డు మీదకొస్తే సౌకర్యవంతంగా ప్రయాణించే పరిస్థితులు లేవు. తారు అంతా కొట్టుకుపోయి.. పైకి తేలి చెల్లాచెదురైన కంకర.. ఎక్కడికక్కడ పెద్ద పెద్ద గుంతలు.. వాటిలో నీళ్లు నిండి.. బురదమయమై.. మనం ప్రయాణం చేస్తోంది రోడ్డు మీదేనా? అన్న అనుమానం వచ్చేలా చాలాచోట్ల రహదారులు ఘోరంగా మారాయి. పలుచోట్ల ద్విచక్రవాహనంపైనే కాదు.. కనీసం నడిచి వెళ్లే పరిస్థితి కూడా లేదు. ఓ రెండు, మూడు కిలోమీటర్లు ప్రయాణిస్తే వాహనానికే కాదు అందులో ప్రయాణిస్తున్నవారి ఆరోగ్యానికీ దెబ్బే అన్నంత ప్రమాదకరంగా రోడ్లు మారిపోయాయి. ఏళ్ల తరబడి మరమ్మతులు చేయకపోవడం, ఇటీవల ఎడతెరిపి లేకుండా కురిసిన వానలకు రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన రహదారులు దెబ్బతిన్నాయి. మండల, గ్రామ రహదారులైతే మరీ అధ్వానంగా తయారయ్యాయి. రాత్రివేళల్లో సరిగా కనిపించక గుంతల్లోపడి వాహనదారులు ప్రమాదాల బారినపడుతున్నారు. తాత్కాలిక మరమ్మతులకైనా నిధులు కేటాయించాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి జిల్లాల కలెక్టర్ల నుంచి ప్రతిపాదనలు వెళ్లినా సర్కారు పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితుల్లో రాష్ట్రవ్యాప్తంగా రహదారుల సమస్యలపై ‘ఆంధ్రజ్యోతి’ కథనం.


 ఆదిలాబాద్‌ జిల్లాలో ఉన్న 18 మండలాల్లో రోడ్లు దారుణంగా దెబ్బతిన్నాయి. మరమ్మతులకు రూ.5 కోట్లు అవసరం అని అధికారులు ప్రతిపాదనలు పంపారు. నిర్మల్‌ జిల్లాలో పెంబి, కడెం మండలాల పరిధిలో రోడ్లు తీవ్రంగా దెబ్బతినడంతో కొన్ని గ్రామాల ప్రజలకు ఊరు దాటి రావాలంటే సాహసమే అవుతోంది. చాలా గ్రామాల్లో ప్రమాదకర రీతిలో వాగులు, ఒర్రెలు దాటుకుంటూ బయట ప్రాంతాలకు వస్తున్నారు. ఈ జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు 300 కిలో మీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నట్లు, మరమ్మతులకు రూ.5 కోట్లు.. కొత్త రోడ్ల నిర్మాణానికి రూ.50 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపారు. నిజామాబాద్‌ జిల్లాలో వర్షాల కారణంగా రోడ్లు దెబ్బతినడంతో ఆర్‌ఎన్‌బీ శాఖకు రూ.40కోట్ల మేర నష్టం జరిగిందని అంచనా వేశారు. కామారెడ్డి జిల్లాలోని జుక్కల్‌, బిచ్కుంద, మద్నూర్‌, పిట్లం, నిజాంసాగర్‌, మాచారెడ్డి, రాజంపేట మండలాల పరిధిలో రోడ్లు కొట్టుకుపోయాయి. కామారెడ్డి, ఎల్లారెడ్డి, బాన్సువాడ పట్టణాల్లోని వర్షాలకు రోడ్లు గుంతలమయమయ్యాయి.


జిల్లా వ్యాప్తంగా 153 కిలోమీటర్లకుపైగానే రోడ్లు ధ్వంసమయ్యాయి. సుమారు రూ. 35 కోట్ల మేర నష్టం వాటిల్లింది. మహబూబ్‌నగర్‌ జిల్లాలో గంగాపురం నుంచి కేశంపేటకు వెళ్లే రోడ్డు గుంతలమయంగా మారింది. రూరల్‌ మండలంలోని మణికొండ గ్రామం నుంచి బొక్కలోనిపల్లికి మధ్య రెండు కిలోమీటర్ల బీటీ రోడ్డు వేయకపోవడంతో మహబూబ్‌నగర్‌ రావాలంటే చుట్టూ తిరిగి రావాల్సి వస్తోంది. నవాబుపేట మండలంలోని గురకుంట నుంచి షాద్‌నగర్‌ వెళ్లే రోడ్డు, హన్వాడ నుంచి కోయిలకొండ వెళ్లే రోడ్డు గుంతలమయంగా మారింది. నాగర్‌కర్నూల్‌ జిల్లాలో పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పనులకు మట్టి తరలించేందుకు భారీ వాహనాల రాకపోకలు సాగుతుండటంతో బీటీ రోడ్లన్నీ ధ్వంసమయ్యాయి. వంగూరు మండల కేంద్రం నుంచి జూపల్లి గ్రామానికి వెళ్లేందుకు బీటీ రోడ్డు లేకపోగా ఉన్న మట్టి రోడ్డు ఇటీవలే కురిసిన వర్షాలకు గోతులమయమై రోడ్డుపై వర్షపు నీరు చేరింది. తాడూరు మండల కేంద్రాన్ని కలిపే పలు బీటీ రోడ్డు పగిలిపోయి గుంతలు పడ్డాయి. 


బిజినేపల్లి మండలం పరిధిలో వనపర్తికి వెళ్లే ప్రధాన బీటీ రోడ్డు తారు కొట్టుకుపోయి మట్టి తేలడంతో వాహనాదారులపై దుమ్ము ధూళీ పడుతోంది. పెంట్లవెల్లి మండల కేంద్రం నుంచి మంచాలకట్టకు వెళ్లే దారిలో రోడ్డు ధ్వంసమై బురదమయమైంది. గద్వాల జిల్లా కేంద్రం నుంచి అయిజకు వెళ్లే రోడ్డు దారుణంగా దెబ్బతింది. గట్టు- మల్దకల్‌ రోడ్డు, అయిజ- మంత్రాలయం రోడ్డు వయా నాగల్‌దిన్నె రోడ్డు అధ్వానంగా తయారయ్యాయి. వనపర్తి జిల్లాలో మిషన్‌ భగీరథ పేరుతో అంతర్గత రోడ్లను ఇష్టారీతిన తవ్వడంతో మట్టిరోడ్లు ఘోరంగా తయ్యారయ్యాయి. జిల్లా కేంద్రం నుంచి నాలుగు కిలో మీటర్ల దూరంలో ఊరికి చివరగా కొత్తగా మాతా శిశు ఆరోగ్య కేంద్రాన్ని నిర్మించారు. రోడ్దు బాగా లేకపోవడంతో గర్భిణులు అక్కడికి చేరుకోవాలంటే ఇబ్బంది పడుతున్నారు. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 1,190 కిలోమీటర్ల మేర ఆర్‌అండ్‌బీ, పంచాయతీ రాజ్‌ శాఖ రోడ్లు, వంతెనలు దెబ్బతిన్నాయి. మరమ్మతులకు రూ. 59 కోట్లు అవసరం అని ప్రతిపాదనలు పంపారు. ఆసిఫాబాద్‌ జిల్లాలో బెజ్జూరు, దహెగాం, పెంచికలపేట మండలాల్లో రోడ్లు కోతకు గురయ్యాయి.  మంచిర్యాల జిల్లాలో చెన్నూర్‌, వేమనపల్లి మండలంలో రోడ్లు  ధ్వంసమయ్యాయి.


 చెన్నూర్‌ మండలంలోని బతుకమ్మ వాగు అప్రోచ్‌ రోడ్డు వాగు ఉధృతికి తెగిపోయింది. ఈ మండలంలో రెండు నెలల క్రితం వేసిన గంగారం బ్రిడ్జి అప్రోచ్‌ రోడ్డు పూర్తిగా దెబ్బతింది. వేమనపల్లి మండలం కల్లెంపల్లికి వెళ్లే రోడ్డు మద్యలో ఉన్న మత్తడి వాగు వంతెన కూడా వరద ఉధృతికి తెగిపోయింది. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్‌ మండలంలోని ఇదులాపూర్‌ నుంచి జాఫర్‌ఖాన్‌పేట శివారులో ఇటీవల కురిసిన వర్షాలకు గుంత ఏర్పడి ప్రమాదకరంగా మారింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఖమ్మం సత్తుపల్లి రోడ్డు, వైరా- మధిర, రహదారుల్లో పలు ప్రాంతాల్లో రోడ్లు అధ్వానంగా మారాయి. ఖమ్మం-కోదాడ ప్రధాన రహదారిపై గుంతలు ఏర్పడి ప్రమాదకరంగా మారాయి. కొత్తగూడెం జిల్లా కేంద్రం నుంచి ఇల్లెందు, పారిశ్రామక ప్రాంతమైన పాల్వంచ నుంచి ములకలపల్లి, సింగరేణి గడ్డ మణుగూరు నుంచి పినపాక మండలానికి వెళ్లే రోడ్లు అంత్యంత దారుణంగా తయారయ్యాయి. పారిశ్రామిక ప్రాంతమైన పాల్వంచలో కేటీపీఎస్‌ నుంచి అధికలోడ్‌తో యాష్‌ ట్యాంకర్లు నడవటంతో కేటీపీఎస్‌ కర్మాగారం నుంచి భద్రాచలం రోడ్డు వరకు పెద్ద పెద్ద గోతులు పడ్డాయి. అధికారిక లెక్కల ప్రకారం పంచాయతీరాజ్‌ శాఖకు చెందిన 10రోడ్లు, ఆర్‌అండ్‌బీ పరిధిలో మొత్తం 27రోడ్లు  పాడైనట్లు అధికారులు గుర్తించారు. నల్లగొండ జిల్లాలో ఆర్‌అండ్‌బీ పరిధిలో 320 కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నాయి. 


సూర్యాపేట జిల్లాలో 920 కిలోమీటర్లు ఉండ గా 177 కిలోమీటర్లు దెబ్బతినడంతో వాటిని తాత్కాలిక మరమ్మతులు చేశారు. పోలీసుశాఖ రికార్డుల ప్రకారం ఉమ్మడి నల్లగొండ జిల్లాలో రహదారులపై ఏర్పడిన గుంతల కారణంగా 66 ప్రమాదాలు జరిగాయని.. 236 మంది గాయపడ్డారు. వికారాబాద్‌ జిల్లాలో 200 కిలోమీటర్ల మేర ఆర్‌అండ్‌బీ రోడ్లు, 205 కిలోమీటర్ల మేర పంచాయతీరాజ్‌ రోడ్లకు నష్టం జరిగింది. వికారాబాద్‌, పరిగి, తాండూరు, కొడంగల్‌ నియోజకవర్గాల పరిధిలో   రోడ్ల మరమ్మతులకు రూ. 56 కోట్లు అవసరం అని ప్రతిపాదనలు పంపారు. మేడ్చల్‌ జిల్లా కేంద్రం నుంచి గడిమైసమ్మ రోడ్డుకు,  మేడ్చల్‌ - శామీర్‌పేట రోడ్డుకు గుంతలు పడ్డాయి.   రంగారెడ్డి జిల్లాల్లో చేవెళ్ల నుంచి శంషాబాద్‌ వెళ్లే రోడ్డు అధ్వాన్నంగా తయారైంది. 


స్పందించేందుకు అధికారుల నిరాకరణ 

రాష్ట్రవ్యాప్తంగా నెలకొన్న రహదారుల సమస్యపై అధికారుల నుంచి వివరణ కోసం ‘ఆంధ్రజ్యోతి’ ప్రయత్నించింది. తెలంగాణ రాష్ట్ర రోడ్డు విభాగం ఇంజినీరింగ్‌ చీఫ్‌ రవీందర్‌ రావు కార్యాలయం, డిప్యూటీ ఇంజినీరింగ్‌ చీఫ్‌ జయదేవ్‌ దివాకర్‌ కార్యాలయంలో సంప్రదించగా స్పందించేందుకు అక్కడి అధికారులు నిరాకరించారు. 

Read more