నేటి అర్ధరాత్రి నుంచి ఆటో, క్యాబ్‌, లారీల ఒకరోజు బంద్‌

ABN , First Publish Date - 2022-05-18T08:35:12+05:30 IST

ఆటో, క్యాబ్‌, లారీల ఒకరోజు రవాణా బంద్‌ను బుధవారం అర్ధరాత్రి నుంచి విజయవంతం చేయాలని ఆయా డ్రైవర్ల సంఘాల జేఏసీ విజ్ఞప్తి చేసింది.

నేటి అర్ధరాత్రి నుంచి ఆటో, క్యాబ్‌, లారీల ఒకరోజు బంద్‌

రేపు ట్రాన్స్‌పోర్టు భవన్‌ ముట్టడికి డ్రైవర్ల జేఏసీ పిలుపు

హైదరాబాద్‌, మే 17 (ఆంధ్రజ్యోతి): ఆటో, క్యాబ్‌, లారీల ఒకరోజు  రవాణా బంద్‌ను బుధవారం అర్ధరాత్రి నుంచి విజయవంతం చేయాలని ఆయా డ్రైవర్ల సంఘాల జేఏసీ విజ్ఞప్తి చేసింది. ఖైరతాబాద్‌ నుంచి వేలాది మంది ఆటో, క్యాబ్‌, లారీ డ్రైవర్లతో  గురువారం ప్రదర్శనగా వెళ్లి  ట్రాన్స్‌పోర్టు భవన్‌ ముట్టడించాలని జేఏసీ పిలుపునిచ్చింది.  వాహనాల ఫిట్‌నెస్‌ ఆలస్యమైతే రోజుకు రూ.50 జరిమానా విధానం రద్దు,  నూతన మోటారు వాహనాల చట్టం-2019 అమలు నిలిపివేయాలని డిమాండ్‌ చేస్తోంది. ఇష్టానుసారంగా పెంచుతున్న ఇంధన ధరలను జీఎ్‌సటీ పరిధిలోకి తీసుకురావాలని  కేంద్రప్రభుత్వాన్ని కోరింది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చిన కార్మిక వ్యతిరేక న్యూ ఎంవీ యాక్ట్‌ -2019ను రాష్ట్రప్రభుత్వం అమలు చేస్తూ మితిమీరిన జరిమానాలు విధిస్తోందని జేఏసీ ప్రతినిధులు బి.వెంకటేశం(ఎఐటీయూసీ),  ఎ.సత్తిరెడ్డి(టీఎడీఎస్‌), ఎండీ.అమానుల్లాఖాన్‌ (టీఎడీ-జెఎసీ), రాష్ట్ర లారీ డ్రైవర్ల సంఘాల జేఏసీ అధ్యక్షుడు రాజేందర్‌రెడ్డి ఆరోపించారు.


పన్నులు, బీమా ప్రీమియంలను విపరీతంగా పెంచి రవాణా రంగ కార్మికుల నడ్డి విరుస్తున్నారని వాపోయారు. వాహనాల ఫిట్‌నెస్‌ ఆలస్యానికి రోజుకు రూ.50 అపరాధ రుసుం పేరుతో ఆన్‌లైన్‌లో వేలాది రూపాయలు బకాయిలుగా చూపడం దారుణమన్నారు. కరోనా కల్లోలంతో  డ్రైవర్లు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు. ఈ తరుణంలో వేలాది రూపాయలు జరిమానా ఎలా చెల్లించగలరని  ప్రశ్నించారు.  గడిచిన ఎనిమిదేళ్లలో పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసర వస్తువుల ధరలు వంద శాతం పెరిగాయని, పెరిగిన ధరలకు అనుగుణంగా ఆటో మీటర్‌ చార్జీలు పెంచలేదని తెలిపారు.


Read more