మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి అరెస్టుకు యత్నం
ABN , First Publish Date - 2022-07-17T09:57:37+05:30 IST
భారీ వరదకు నీట మునిగిన కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ పంప్ హౌజ్ పరిశీలనకు యత్నించిన సోషల్ డెమొక్రటిక్ ఫ్రంట్ నాయకుడు, మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళిని అడ్డుకున్న పోలీసులు అరెస్టుకు యత్నించారు.
లక్ష్మీ పంప్‌హౌజ్ పరిశీలనకు వెళుతుండగా అడ్డగింత
మహదేవపూర్, జూలై 16: భారీ వరదకు నీట మునిగిన కాళేశ్వరం ప్రాజెక్టులోని లక్ష్మీ పంప్ హౌజ్ పరిశీలనకు యత్నించిన సోషల్ డెమొక్రటిక్ ఫ్రంట్ నాయకుడు, మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళిని అడ్డుకున్న పోలీసులు అరెస్టుకు యత్నించారు. పంప్‌హౌజ్‌కు బయలుదేరిన మురళిని జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలంలోని కాళేశ్వరం గ్రావిటీ కెనాల్ వద్ద పోలీసులు ఆపేశారు. దీంతో కాళేశ్వరంలోని హరితహోటల్ వద్ద ఆయన విలేకరులతో మాట్లాడారు. కాళేశ్వరం ప్రాజెక్టు రాష్ట్రానికి ఐరావతం లాంటిదని గతంలో తాను చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా గుర్తు చేశారు. ప్రాజెక్టు డిజైన్‌లో లోపాలు, నాసిరకం నిర్మాణాల వల్ల మోటార్లు ముంపునకు గురయ్యాయని దుయ్యబట్టారు. ఫోర్‌బేకు, పంపులకు మధ్య ఉండే గేర్‌వాల్ నాసిరకంగా ఉండడంతో అది కూలి నీరంతా పంప్‌హౌజ్‌లోకి ప్రవేశించిందన్నారు. లక్ష్మీ పంప్‌హౌజ్, సరస్వతీ పంప్‌హౌజ్‌లో నీట మునిగిన మోటార్ల మరమ్మతులకు తొమ్మిది నెలల సమయం పడుతుందని చెప్పారు. అంతేకాక రూ.400-500 కోట్లు దాకా ఖర్చు పెట్టాల్సి ఉంటుందన్నారు. వరద ముంపునకు గురి కావడంతో ఈ ఖరీఫ్ సీజన్‌లో నీటిని ఎత్తిపోసే పరిస్థితి ఉండదని చెప్పారు. అనంతరం పోలీసులు ఆయన్ను అరెస్టు చేసేందుకు యత్నించగా అక్కడి నుంచి తిరుగు ప్రయాణమయ్యారు. ఆయన వెంట సోషల్ డెమొక్రటిక్ ఫ్రంట్ కో కన్వీనర్లు డాక్టర్ పృథ్వీరాజ్, ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు. కాగా, మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళిని పోలీసులు అడ్డుకోవడాన్ని జాతీయ మాలల ఐక్యవేదిక సంఘం ఖండించింది. ప్రాజెక్టు సందర్శనకు పంపిస్తే ప్రభుత్వ అవినీతిని బయటపెడతారని భయపడే మురళిని అడ్డుకున్నారని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం రాష్ట్ర కార్యదర్శి టి. స్కైలాబ్ అన్నారు.