వికారాబాద్‌ డీఎంహెచ్‌వోపై వేటు

ABN , First Publish Date - 2022-09-10T08:25:35+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ఆరోగ్య ప్రమాణాలను అందుకోవడంలో కొన్ని జిల్లాలు విఫలం అవుతున్న నేపథ్యంలో ఆయా జిల్లాల వైద్యాధికారులపై వేటు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

వికారాబాద్‌ డీఎంహెచ్‌వోపై వేటు

ఆరోగ్య సూచీల్లో జిల్లా మెరుగుపడకపోవడమే కారణం

నిర్దేశించిన ఆరోగ్య ప్రమాణాలు అందుకోవడంలో విఫలమవుతున్న పలు జిల్లాలు.. సర్కారు సీరియస్‌

ఇప్పటికే పలుసార్లు హెచ్చరిక.. మారని పరిస్థితులు

మరో 2 జిల్లాల డీఎంహెచ్‌వోలపైనా త్వరలో వేటు? 


హైదరాబాద్‌, సెప్టెంబరు 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ఆరోగ్య ప్రమాణాలను అందుకోవడంలో కొన్ని జిల్లాలు విఫలం అవుతున్న నేపథ్యంలో ఆయా జిల్లాల వైద్యాధికారులపై వేటు వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వికారాబాద్‌ జిల్లా డీఎంహెచ్‌వో తుకారాంను ఆ పోస్టు నుంచి తొలగించింది. మెదక్‌ జిల్లా అడిషనల్‌ డీఎంహెచ్‌వోను వికారాబాద్‌ జిల్లా వైద్యాధికారిగా నియమించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. సర్కారు నిర్దేశించిన ఆరోగ్య ప్రమాణాల విషయంలో వికారాబాద్‌ జిల్లా అట్టడుగున ఉంది. పనితీరు మెరుగుపడాలని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌ రావు పలుమార్లు హెచ్చరించారు. అయినప్పటికీ జిల్లా ఆరోగ్య సూచీల్లో ఎలాంటి మార్పు లేదు. దీంతో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. ములుగు, నారాయణ్‌పేట్‌, వనపర్తి, కరీంనగర్‌, సూర్యాపేట జిల్లాల్లో కూడా ఆరోగ్య సూచీలు మెరుగుపడటం లేదు. హరీశ్‌ రావు ప్రతి నెలా జిల్లాల వారీ ఆరోగ్య సూచీలపై  సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రమాణాలు సరిగ్గా లేని జిల్లాల్లో పనితీరును మెరుగుపర్చుకోవాలని వైద్యాధికారులకు సూచిస్తున్నారు. అయినప్పటికీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో వైద్యాధికారులపై వేటు వేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే వికారాబాద్‌ డీఎంహెచ్‌వోపై వేటు వేశారు. ఈ ఇది మిగతా జిల్లాల అఽధికారులకు ఒక హెచ్చరిక అవుతుందని సర్కారు భావిస్తోంది. మరో రెండు జిల్లాల డీఎంహెచ్‌వోలపైన కూడా వేటు వేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తోంది. 


8 రకాల సూచీలపై నివేదికలు

సహజ ప్రసవాలను ప్రోత్సహించడం, అంటువ్యాధులు కాని రోగాల నిర్ధారణ పరీక్షలు, రక్తహీనత తగ్గించడం, వ్యాక్సినేషన్‌ లాంటి 8 రకాల ఆరోగ్య సూచీలకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం ప్రతి నెలా జిల్లాల నుంచి నివేదికలు తెప్పించుకుంటోంది. నిర్దేశించిన ప్రమాణాలను జిల్లాలు అందుకుంటున్నాయా.. లేవా.. అని పరిశీలిస్తోంది. 

Updated Date - 2022-09-10T08:25:35+05:30 IST