దత్తత ప్రాంతాల్లో అభివృద్ధి ఏదీ?

ABN , First Publish Date - 2022-10-17T09:05:12+05:30 IST

మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటున్నానని మంత్రి కేటీఆర్‌ ప్రకటించారని..

దత్తత ప్రాంతాల్లో అభివృద్ధి ఏదీ?

పథకాల పేరుతో టీఆర్‌ఎస్‌ దగా: వైఎస్‌ షర్మిల

నిజామాబాద్‌, అక్టోబరు 16(ఆంధ్రజ్యోతి ప్రతినిధి): మునుగోడు నియోజకవర్గాన్ని దత్తత తీసుకుంటున్నానని మంత్రి కేటీఆర్‌ ప్రకటించారని.. ఎన్నికలు వచ్చిన ప్రతి చోట ఇదే చెప్పి ప్రజలను మభ్యపెడుతున్నారని వైఎస్‌ఆర్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల విమర్శించారు. గతంలో కొడంగల్‌లోనూ ఇదే చెప్పారని, ఇప్పటి వరకు దత్తత తీసుకున్న చోట్ల ఎంత అభివృద్ధి జరిగిందని ప్రశ్నించారు. షర్మిల చేపట్టిన ప్రజాప్రస్థాన యాత్ర ఆదివారం నిజామాబాద్‌ జిల్లా బోధన్‌ నియోజకవర్గంలోని అమ్దాపూర్‌కు చేరుకుంది. ఈ సందర్భంగా బోధన్‌లో ఆమె మాట్లాడారు. హుజూరాబాద్‌ ఎన్నికలప్పుడు దళితబంధు, మునుగోడు ఎన్నికలప్పుడు గిరిజనబంధు అని మోసం చేస్తున్నారని మండిపడ్డారు. సిద్దిపేట, గజ్వేల్‌, సిరిసిల్ల నియోజకవర్గాలు తప్ప రాష్ట్రంలో మరెక్కడైనా అభివృద్ధి జరిగిందా..? అని ప్రశ్నించారు. పాలనపై నమ్మకం ఉన్న వారు మొత్తం మునుగోడులో మోహరించి ఎలా ప్రచారం చేస్తున్నారని ప్రశ్నించారు. అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో బోధన్‌ షుగర్‌ ఫ్యాక్టరీని తెరిపిస్తానని చెప్పిన సీఎం కేసీఆర్‌.. 8 ఏళ్లయినా ఆ ఊసే ఎత్తడంలేదని విమర్శించారు. 


కర్మాగారంపై ఆధారపడ్డ 2 వేల కుటుంబాలు రోడ్డున పడ్డాయని చెప్పారు. బోధన్‌ ప్రాంతంలో చెరకు పంట లేకుండా చేసిన ఘనత కేసీఆర్‌దేనన్నారు. వైఎ్‌సఆర్‌ బతికుంటే నిజాం షుగర్‌ ఫ్యాక్టరీ ఎప్పుడో తెరచుకునేదని అన్నారు. చంద్రబాబు ఫ్యాక్టరీని ప్రైవేటుపరం చేశారని ఆరోపించారు. బోధన్‌ ఎమ్మె ల్యే నియోజకవర్గ ప్రజలకు చిప్పచేతికిచ్చాడని, ఆయన హైదరాబాద్‌కే పరిమితమయ్యారని విమర్శించారు. మైనారిటీ ఎమ్మెల్యే అయిన షకీల్‌ ఏనాడైనా 12 శాతం రిజర్వేషన్‌ కోసం కొట్లాడాడా..? అని ప్రశ్నించారు. కమీషన్‌ కింగ్‌లా వ్యవహరిస్తున్న ఆయన కమీషన్‌ ఇవ్వనిదే ఏ పనిచేయరని అన్నారు. నియోజకవర్గంలో ఇసుక మాఫియాను యథేచ్ఛగా ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. పసుపు రైతులకు బాండ్‌ పేపర్‌ రాసిచ్చిన ఎంపీ అర్వింద్‌ పసుపు బోర్డు తేవడంలో విఫలమయ్యారని విమర్శించారు. తాము అధికారంలోకి వస్తే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చేందుకే మొదటి సంతకం పెడతామని చెప్పారు. వైఎ్‌సఆర్‌ పథకాలన్నింటినీ అమలు చేయడంతో పాటు ఇంట్లో ఉన్న వృద్ధులందరికీ రూ.3 వేలు తక్కువ కాకుండా పింఛన్‌ ఇస్తామని షర్మిల హామీ ఇచ్చారు. 

Updated Date - 2022-10-17T09:05:12+05:30 IST