బడ్జెట్‌పై నియంత్రణేదీ?

ABN , First Publish Date - 2022-03-16T08:28:45+05:30 IST

రాష్ట్ర బడ్జెట్‌ అమలుపై సర్కారు నియంత్రణ, పర్యవేక్షణ కొరవడ్డాయని ‘కంపో్ట్రలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌)’ ఆక్షేపించింది.

బడ్జెట్‌పై నియంత్రణేదీ?

  • అసెంబ్లీ ఆమోదానికి మించి ఖర్చులు.. 
  • అనుబంధ కేటాయింపుల నిధులూ వాడేశారు
  • విద్య, వైద్య రంగాలపై తక్కువ వ్యయం..
  •  ద్రవ్య లోటులో 97% అప్పులతోనే భర్తీ
  • చెల్లించాల్సిన రుణాలు 19% పెరుగుదల..
  •  ఆరేళ్లలోనే 46% అప్పులు చెల్లించాలి
  • ఆస్తుల కల్పనపై దృష్టి సారించని సర్కారు.. 
  • ‘సాగు’ప్రాజెక్టుల్లో జాప్యంతో క్యాపిటల్‌ నిధుల బ్లాక్‌
  • రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్‌ అమలు తీరుపై కాగ్‌ ఆగ్రహం


హైదరాబాద్‌, మార్చి 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర బడ్జెట్‌ అమలుపై సర్కారు నియంత్రణ, పర్యవేక్షణ కొరవడ్డాయని ‘కంపో్ట్రలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌)’ ఆక్షేపించింది. శాసనసభ ఆమోదించకపోయినా కొన్ని అనుబంధ కేటాయింపుల నిధులను కూడా ఖర్చు చేసిందంటూ తప్పుపట్టింది. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే విద్య, వైద్య రంగాలపై తక్కువగా ఖర్చు చేసినట్లు తెలిపింది. 2019-20లో తెలంగాణ ప్రభుత్వం ఈ రెండిటిపై చాలా తక్కువగా వెచ్చించినట్లు వివరించింది. ద్రవ్య లోటును 97 శాతం మేరకు మార్కెట్‌ నుంచి తీసుకు న్న అప్పుల ద్వారానే భర్తీ చేశారని తెలిపింది. వడ్డీ చెల్లింపులు రూ.1800 కోట్ల (14.30ు)కు పెరిగాయని, ఇవి రెవెన్యూ రాబడిలో 14వ ఆర్థిక సంఘం నిర్ణయించిన 8.39 శాతం కన్నా చాలా ఎక్కువని వివరించింది. కేసీఆర్‌ సర్కారు ఆస్తుల కల్పనపై తగినంతగా దృష్టి సారించలేదని పేర్కొంది. మూలధన వ్యయం పడిపోయిందని తెలిపింది. సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో జరిగిన జాప్యం కారణంగా భారీ స్థాయిలో క్యాపిటల్‌ నిధులు స్తంభించిపోయాయని వెల్లడించింది. ఇక కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర డిస్కమ్‌లతో చేసుకున్న ఒప్పందం మేరకు ‘ఉదయ్‌’ పథకం కింద డిస్కమ్‌ల నష్టాలను పూడ్చే విషయమై 2020 మార్చి నాటికి చెల్లిం చాల్సిన రూ.4,063.65 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించలేదని గుర్తుచేసింది. 2021 మార్చి నాటికి ఈ మొత్తం రూ.7,091 కోట్లకు చేరిందని తెలిపింది. కరోనా మహమ్మారిని ఎదుర్కోవడానికి రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన నిధి నుంచి సొమ్ములను వినియోగించుకునే వెసులుబాటును కేంద్రం కల్పించినా.. వినియోగించుకోలేకపోయిందని ఆక్షేపించింది. రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాల్సిన మొత్తం అప్పులో దాదాపు సగ భాగం (46ు) ఆరేళ్లలోనే తిరిగి చెల్లించాల్సి ఉంటుందని విశ్లేషించింది. బడ్జెటేతర రుణాలను  ఎక్కువగా తీసుకోవడం ప్రభుత్వానికి భారంగా పరిణమించిందని వివరించింది. నిజానికి పెరిగిన జీఎస్‌డీపీ (12.61 శాతం)తో పోలిస్తే ప్రభుత్వ రుణ పెరుగుదల రేటు చాలా ఎక్కువని, ఇది ప్రమాదకరమని తెలిపింది.


 ప్రభుత్వ హామీలతో 2020 మార్చి నాటికి వివిధ ప్రభుత్వరంగ సంస్థలు రూ.71,131.63 కోట్ల అప్పులు చేశాయ ని.. ఇది ఒకరకంగా ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ సామర్థ్యాన్ని తక్కువ చేస్తుందని పేర్కొంది. ఈ సంస్థల దీర్ఘకాలిక అప్పు లు 2021 మార్చి నాటికి రూ.98,929 కోట్లకు చేరాయని తెలిపింది. ఈ మేరకు 2019-20, 2020-21 ఆర్థిక సంవత్సరాలకు ‘కాగ్‌’ నివేదికలను మంగళవారం శాసనసభకు సమర్పించింది. ఈ నివేదికల్లో రాష్ట్ర ఆర్థిక స్థితిగతులు, బడ్జెట్‌ నిర్వహణ, అప్పులు, ఆర్థికాంశాల నివేదన పద్ధతులను కాగ్‌ విశ్లేషించింది. గత ఐదేళ్లలో రూ.84,650.99 కోట్ల అధిక వ్యయాన్ని శాసనసభ క్రమబద్ధీకరించాల్సి ఉండగా, 2019-20 లో బడ్జెట్‌ కేటాయింపులు లేకుండానే రూ.2,084.03 కోట్లు ఖర్చు చేసిందని తప్పుపట్టింది. కేటాయింపులతో పోలిస్తే ఖర్చుల్లో వ్యత్యాసం ఉన్నప్పుడు అకౌంటెంట్‌ జనరల్‌ (ఏజీ) కార్యాలయానికి వివరణలు సమర్పించడం లేదని గుర్తించింది. పదేపదే మిగుళ్లు ఉంటున్న శాఖలను హెచ్చరించడం లేదని, కేటాయింపులను వినియోగించడంలో వాటి సామర్థ్యాన్ని అనుసరించి బడ్జెట్‌ నిధులను మార్చడం లేదని విమర్శించింది. 2016-19 మధ్య కాలంలో నాలుగు సామాజిక-ఆర్థిక గ్రాంట్ల విషయంలో కేటాయింపుల వినియోగం 50 శాతం కన్నా తక్కువగా ఉండడం రాష్ట్రంలో సామాజిక- ఆర్థికాభివృద్ధిని ప్రభావితం చేసిందని తెలిపింది. ఆకస్మిక వ్యయ నిధి (కాంటిజెన్సీ ఫండ్‌) నుంచి అడ్వాన్సులను తీసుకోవడంలో తగిన జాగ్రత్తలు పాటించలేదని ఆరోపించింది. 


2019-20లో రెవెన్యూ లోటు 

2019-20లో రాష్ట్ర రెవెన్యూ రాబడి స్వల్పంగా రూ.1,124 కోట్లు (1.11ు) పెరిగిందని కాగ్‌ తెలిపింది. రెవెన్యూ ఖర్చు లు రూ.11,715 కోట్లు (12.07ు) పెరిగాయని, ఫలితంగా 2015-20 మధ్య తొలిసారిగా 2019-20లో రెవెన్యూ లోటును నమోదు చేసిందని ఆక్షేపించింది. ఇక ప్రభుత్వం చెల్లించాల్సిన అప్పు 18.04 శాతం మేర పెరిగిందని తెలిపింది. ప్రభుత్వ సామాజిక, ఆర్థిక పథకాలకు అవసరమైన వనరుల సేకరణపై శాసనసభ నియంత్రణ దాటిపోయినట్లు కనిపిస్తోందని పేర్కొంది. ఎస్సీఏఎఫ్‌ (స్టేట్‌ కాంపెన్సేటరీ అఫోరెస్టేషన్‌ ఫండ్‌)కి సంబంధించిన సొమ్మును ప్రజాపద్దుల్లో నిర్వహించాల్సి ఉండగా, నిబంధనలకు విరుద్ధంగా బ్యాంకుల్లో నిల్వ చేస్తున్నారని కాగ్‌ ఆరోపించింది. రాష్ట్ర విపత్తు నిధిలో ఉన్న సొమ్ము విషయంలో ప్రభుత్వం వడ్డీ చెల్లింపు బాధ్యతను నెరవేర్చలేదని తెలిపింది. పీడీ (పర్సనల్‌ డిపాజిట్‌) ఖాతాల నుంచి భారీ మొత్తంలో నిధులను బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేసినట్లు గుర్తించింది. ‘ఆమాంబాపతు చిన్న పద్దు-800, ఇత ర రాబడి, ఇతర ఖర్చులు’ అనే పద్దులను విచక్షణారహితం గా ఉపయోగించడం వల్ల ఆర్థిక నివేదనలో పారదర్శకత లోపించిందని తెలిపింది. 


కేటాయింపు ప్రాధాన్యాలు, ఖర్చుల నాణ్యత విషయంలో సరైన విశ్లేషణకు ఇది ప్రతిబంధకంగా మారిందని ఆక్షేపించింది. నిర్ధిష్టమైన అభివృద్ధి కార్యక్రమాలు/ప్రాజెక్టుల కోసం తీసుకున్న నిధులకు వినియోగ ధ్రువపత్రాలు, వివరణాత్మక బిల్లులను సమర్పించకపోవడంతో ఆర్థి క నియమాలను ఉల్లంఘించినట్లయిందని తెలిపింది. శాఖల అవసరాలపై విశ్వసనీయ అంచనాలు, కేటాయించిన వనరులను వినియోగించే విషయంలో వాటి సామర్థ్యం ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం వాస్తవికమైన బడ్జెట్లకు రూపకల్పన చేయాలని సూచించింది. రాష్ట్ర ప్రభుత్వం రెవెన్యూ ఖర్చుల కోసం రుణాల మీద ఆధారపడకూడదని తెలిపింది. 


2020-21లోనూ రెవెన్యూ లోటు

2020-21లోనూ రూ.22,298 కోట్ల రెవెన్యూ లోటు ఏర్పడిందని కాగ్‌ తెలిపింది. మునుపటి సంవత్సరంతో పోలిస్తే 2020-21లో రాష్ట్ర సొంత పన్నుల రాబడి, పన్నేతర రాబడులు తగ్గాయని పేర్కొంది. రాష్ట్ర ప్రభుత్వం 2020-21 సంవత్సరానికి రూపొందించిన బడ్జెట్‌ వాస్తవికంగా లేదని, సంక్షేమ, అభివృద్ధి పథకాలకు ఎక్కువ కేటాయింపులు జరిపి, వ్యయాలను మాత్రం తక్కువ చేసిందని ఆరోపించింది. శాఖల వాస్తవ వ్యయాలు, సామర్థ్యాలను సమీక్షించకుండానే కేటాయింపులు జరిపిందని గుర్తించింది. రెవెన్యూ మిగులును కొనసాగించడం, జీఎస్‌డీపీ ద్రవ్యలోటు శాతం, జీఎస్‌డీపీలో ఇంకా తీర్చాల్సి ఉన్న చెలింపు బాధ్యతల మొత్తం శాతం లక్ష్యాల్లో దేన్నీ రాష్ట్ర ప్రభుత్వం సాధించలేకపోయిందని కాగ్‌ ఆరోపించింది. జీఎస్టీ అమలు కారణంగా ఏర్పడిన నష్టాలను పూడ్చుకోవడానికి రాష్ట్రం కొంత గ్రాంట్ల రూపంలో, కొంత రుణాల రూపంలో పొందిందని గుర్తించింది. 15వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన కొన్ని ప్రత్యేక గ్రాంట్లు రాష్ట్రానికి అందలేదని, రెవెన్యూ వ్యయం పెరగగా, క్యాపిటల్‌ వ్యయం తగ్గిందని తెలిపింది. చెల్లించాల్సిన అప్పులు 19 శాతానికి పెరిగాయని తెలిపింది. 


అప్పుల ఊబిలో ప్రభుత్వ రంగ సంస్థలు

రాష్ట్ర ప్రభుత్వ రంగ సంస్థలు(ఎ్‌సపీఎ్‌సయూ) అప్పుల ఊబిలో కూరుకుపోతున్నాయని కాగ్‌ హెచ్చరించింది. 2021 మార్చి నాటికి తెలంగాణలో 82 ప్రభుత్వ రంగ సంస్థలుండగా.. 16 సంస్థలు నిష్ర్కియంగా ఉన్నాయని వివరించింది. పని చేస్తున్న మిగతా 66 ఎస్‌పీఎ్‌సయూల్లో 8 సంస్థలు విద్యుత్తు రంగానికి సంబంధించినవి కాగా, 58 సంస్థలు ఇతర రంగాలవని తెలిపింది. ఈ 66 సంస్థల్లో 30 మాత్రమే తమ ఆర్థిక పద్దులను ఆడిటింగ్‌ కోసం సమర్పించాయని, వీటి ఆధారంగా ఆడిట్‌ను నిర్వహించామని వెల్లడించింది. 2020-21 మార్చి 31 నాటికి ఈ 30 సంస్థల్లో రూ.1,20,070.67 కోట్ల పెట్టుబడులున్నాయని.. వీటిలో రాష్ట్ర ప్రభుత్వ మూలధనం వాటాగా, దీర్ఘకాలిక రుణాలుగా పెట్టిన పెట్టుబడి రూ.38,512.85 కోట్లు ఉన్నాయంది. 

Read more