పండగ వేళ ప్రమాదం.. రెండు కుటుంబాల్లో విషాదం
ABN , First Publish Date - 2022-10-07T09:38:49+05:30 IST
దసరా రోజు జరిగిన ఓ రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. ఎదురెదురుగా వస్తున్న ద్విచక్రవాహనం, కారు ఢీకొన్న ఘటనలో వరసకు బావ, బావమరిది అయిన ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు.
- రోడ్డు ప్రమాదంలో బావ, బావమరిది మృతి
- మరో ఘటనలో రెండు బైక్లు ఢీ.. ఇద్దరు మృతి
ఆమనగల్లు, డిచ్పల్లి, అక్టోబరు 6: దసరా రోజు జరిగిన ఓ రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో విషాదం నింపింది. ఎదురెదురుగా వస్తున్న ద్విచక్రవాహనం, కారు ఢీకొన్న ఘటనలో వరసకు బావ, బావమరిది అయిన ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. రంగారెడ్డి జిల్లా ఆమనగల్లు మండలం చింతలపల్లి సమీపంలో షాద్నగర్-ఆమనగల్లు ప్రధాన రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. నాగర్కర్నూల్ జిల్లా బర్కత్పల్లికి చెందిన కోడెల రామకృష్ణ(22) దసరా సందర్భంగా అత్తగారి ఊరైన కేశంపేటకు వెళ్లాడు. వేడుకలు ముగించుకుని వరసకు బావ అయిన కడారి మల్లయ్య(32)తో కలిసి బుధవారం సాయంత్రం ద్విచక్రవాహనంపై బర్కత్పల్లికి బయలుదేరాడు. మల్లయ్యది మాడ్గుల మండలం ఇర్విన్ గ్రామం. అయితే, ఆమనగట్లు వైపు నుంచి వస్తున్న ఓ కారు.. చింతలపల్లి వద్ద వీరి బైక్ను ఢీకొట్టింది. దీంతో బైక్ నడుపుతున్న రామకృష్ణ అక్కడికక్కడే మరణించగా, గాయాలపాలైన మల్లయ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశాడు. కాగా, నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండలం సుద్దపల్లి వద్ద 44వ నంబర్ జాతీయ రహదారిపై గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మరణించారు. ఎదురెదురుగా వస్తున్న రెండు బైకులు ఒకదానిని మరొకటి ఢీకొనగా.. సుద్దపల్లికి చెందిన గుట్టమీది అజయ్(22), యానంపల్లికి చెందిన బంటు సాయిలు(52) అక్కడికక్కడే మరణించారు. సాయిలుతో కలిసి బైక్పై ఉన్న శ్రీకాంత్ తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలయ్యాడు.