అమాత్యుల హామీకే దిక్కులేదా..?
ABN , First Publish Date - 2022-09-23T05:51:56+05:30 IST
అమాత్యుల హామీకే దిక్కులేదా..?

ఐదేళ్ల క్రితం రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన పారిశుధ్య కార్మికులు
ఇద్దరికి రూ.5లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా..
ఒకరికి ఉద్యోగం ప్రకటించిన మంత్రి కేటీఆర్.. నేటికీ నెరవేరని హామీ
రూ. 50 లక్షలు ఇస్తామన్న అప్పటి మేయర్
అయినా ఇంతవరకు అతీగతీ లేదు
రూ.10 వేలు ఇచ్చి చేతులు దులుపుకున్న గ్రేటర్ అధికారులు
ఓరుగల్లు, సెప్టెంబరు 22, (ఆంధ్రజ్యోతి-ప్రతినిధి) : గ్రేటర్ వరంగల్ అధికారులు మానవత్వం మరిచారు. తమ కార్మికులపట్ల నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. విధినిర్వహణలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను పట్టించుకోవడం లేదు. రోడ్డు ప్రమాదంలో అర్థాంతరంగా తనువులు చాలించిన పారిశుధ్య కార్మికుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చి మరీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఐదేండ్లుగా గ్రేటర్ వరంగల్ అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేసినా ఫలితం లేకుండా పోయింది. ఎమ్మెల్యేలు తమను కలువడానికే ఇష్టపడడం లేదని కార్మికుల కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. వివరాల్లోకి వెళితే.. 2017 డిసెంబరు 15 తేదీన ఎప్పటిలాగే గ్రేటర్ వరంగల్ పారిశుధ్య మహిళా కార్మికులు ఉదయం 5 గంటలకే ఖిలా వరంగల్ మండలంలోని మామునూర్ ప్రాంతంలో బయోమెట్రిక్ హాజరు వేసి తిరిగి తమకు కేటాయించిన ప్రాంతంలో పారిశుధ్య పనులు చేసేందుకు ఆటోలో బయలు దేరారు. ఇంతలో వెనుక నుంచి వస్తున్న లారీ వేగంగా ఆటోను ఢీ కొట్టింది. దీంతో ఆటోలో ఉన్న ఆరుగురు కార్మికులకు తీవ్ర గాయాలయ్యాయి. ఇందులో కలకోట్ల సులోచన అక్కడికక్కడే మృతి చెందగా, సింగారపు మరియమ్మ ఎంజీఎం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయింది. బరిగెల రాజమణి అనే కార్మికురాలు ఒక చేయి తెగి పడడంతో అపస్మారక స్థితిలోకి వెళ్ళి పోయింది. హుటాహుటిన హైదరాబాద్ నిమ్స్ ఆస్పత్రిలో చేర్పించి మెరుగైన చికిత్స అందించారు. చాలా రోజుల తర్వాత కోలుకొంది. మాదారపు రమ, ఎర్ర భిక్షపతి, ఆరూరి లీలావతి, ఆటో డ్రైవర్ మాదారపు రాజులకు ఎంజీఎం ఆస్పత్రిలోనే చికిత్స అందించారు. ప్రమాద సంఘటన సమాచారం తెలుసుకున్న అప్పటి గ్రేటర్ వరంగల్ నగర మేయర్ నన్నపునేని నరేందర్, కమిషనర్ శృతి ఓజా, ఎంహెచ్వో హుటాహుటిన ఎంజీఎం చేరుకుని మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ప్రమాదంలో మృతి చెందిన కార్మికుల కుటుంబాలతో పాటు, గాయపడిన కార్మికుల కుటుంబాలను సైతం ఆదుకుంటామని హామీ ఇచ్చారు. మంత్రి కేటీఆర్‌తో మాట్లాడి మేయర్ నన్నపునేని నరేందర్ మృతుల కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు.
అదే విధంగా మృతి చెందిన కుటుంబాల్లో ఇద్దరికీ ఉద్యోగావకాశాలు ఒక్కరికీ ప్రభుత్వ, మరొకరికి ఔట్ సోర్సింగ్ ఉద్యోగావకాశాలు కల్పిస్తామని అధికారులు , ప్రజా ప్రతినిధులు హామీ ఇచ్చారు. మంత్రి ప్రకటించిన ఐదు లక్షలతో పాటు, గ్రేటర్ వరంగల్ తరపున మృతుల కుటుంబాలకు రూ. 50 వేలు, క్షతగాత్రులకు రూ.25 వేలు అందజేస్తామని ప్రకటించారు. మంత్రి ప్రకటించిన ఎక్స్‌గ్రేషియాతో మేయర్ నన్నపునేని నరేందర్ ప్రకటించిన ఆర్థిక సాయం అందలేదని కార్మికులు చెబుతున్నారు. అంత్యక్రియల సమయంలో కేవలం రూ. 10 వేలు అందజేశారు తప్ప ఆ తర్వాత ఎలాంటి ఆర్థిక చేయూత తమకు అందలేదని కార్మికులు స్పష్టంగా చెబుతున్నారు. కుటుంబంలో ఇద్దరికీ ఉద్యోగ అవకాశాలు అని వాగ్దానం చేసిన గ్రేటర్ వరంగల్ అధికారులు, ప్రజా ప్రతినిధులు మాట నిలబెట్టుకోలేక పోయారు. మృతి చెందిన కుటుంబాలకు సంబంధించిన కుటుంబాల్లో కేవలం ఒక్కరికీ మాత్రమే ఔట్ సోర్సింగ్ ఉద్యోగావకాశం కల్పించారు. కుటుంబంలో మరొకరికీ ఉద్యోగావకాశం ఇస్తామన్నారు కదా అని బాధిత కుటుంబాలు గ్రేటర్ వరంగల్ అధికారులను ప్రశ్నిస్తే.. ఒక్కటి ఇవ్వడమే మీకు ఎక్కువ ఇంకా రెండో ఉద్యోగమా అంటూ బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.. రూ. 5 లక్షల ఎక్స్‌గ్రేషియా సంగతేందని ప్రశ్నిస్తే.. మేము ఇవ్వలేమని .. ఏం చేసుకుంటారో చేసుకోమని బెదిరిస్తున్నారని కన్నీటి పర్యంతమవుతున్నారు.
బరిగెల రాజమణి పరిస్థితి హృదయ విదారకం..
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు కార్మికులతో పాటు బరిగెల రాజమణి తీవ్రంగా గాయపడింది. ఒక చేయి ప్రమాద స్థలంలోనే తెగిపడగా, రెండు కాళ్ళు విరిగాయి. నాలుగు పక్కటెముకలు సైతం విరిగిపోయాయి. నెలల తరబడి చికిత్స అనంతరం రాజమణి కోలుకున్నది. కుటుంబానికి తానే దిక్కు కావడంతో తిరిగి ఉద్యోగంలో చేరింది. తన ఆనారోగ్యం దృష్ట్యా రోడ్లు ఊడ్చే పని కాకుండా ఏదైనా కార్యాలయంలో ఉపాధి అవకాశం కల్పిస్తే చేసుకుంటానని అధికారులకు ఎన్నో సార్లు విన్న వించుకుంది. పట్టించుకున్న నాధుడే లేడు.. ఒక్క చేయితో చీపురు పట్టి ఊడ్వడం అంటే నరకం అనుభవిస్తున్నానని బరిగెల రాజమణి ఆవేదన వ్యక్తం చేస్తోంది. సర్కార్ ఇస్తానన్న సాయం అందలేదు.. అధికారుల కనికరం కూడా తనమీద లేదని కన్నీటి పర్యంతం అవుతోంది. రోడ్డు ప్రమాదంలో ఆనాడే మావోళ్ళతో చనిపోయినా బావుండేదని , ఇపుడు నరకం అనుభవిస్తున్నానని రాజమణి అంటోంది..
మంత్రి కేటీఆర్ ప్రకటించినా .. ఖాతరు చేయని అధికారులు
విధి నిర్వహణలో చనిపోయిన మహిళా కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షలు ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన మంత్రి కేటీఆర్ వాగ్దానాన్ని కూడా గ్రేటర్ వరంగల్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు ఖాతరు చేయడం లేదు. చనిపోయిన వాళ్ళందరికీ ఇవ్వడం మొదలు పెడితే.. చాలా మందికి గతంలోనూ.. ముందు.. ముందు కూడా చాలా మందికి ఇవ్వాల్సి వస్తుంది.. మేము ఇవ్వలేం.. ఈ విషయాన్ని మేము కాదు.. స్వయంగా ప్రజా ప్రతినిధులే చెప్పారని గతంలో ఎంహెచ్‌వోగా పనిచేసిన అధికారి ఒకరు తమతో చెప్పారని మృతి చెందిన కార్మికుల కుటుంబాలకు చెందిన కలకోట్ల వికాస్, సింగారపు రవిలు చెప్పారు. ఇదే విషయాన్ని జిల్లాలోని ఎమ్మెల్యేలకు ఇతర ప్రజా ప్రతినిధులందరికీ చెప్పినా ఫలితం లేకుండా పోయిందన్నారు. ఇప్పటికైనా మంత్రి కేటీఆర్ చొరవ తీసుకుని తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.