ప్రకటనలు, అనుమతులతో సరి.. కొలువుల భర్తీ ఎప్పుడు?

ABN , First Publish Date - 2022-08-14T08:00:27+05:30 IST

91,142.. ఇదీ.. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తమ ప్రభుత్వం భర్తీ చేస్తుందని ప్రకటించిన ప్రభుత్వోద్యోగాల సంఖ్య.

ప్రకటనలు, అనుమతులతో సరి.. కొలువుల భర్తీ ఎప్పుడు?

నోటిఫికేషన్ల జారీలో తీవ్ర జాప్యం


ఆర్థికశాఖ అనుమతించినవి 49,428 కొలువులు

ఇంకా అనుమతించాల్సినవి 30,611 పోస్టులు

ఇప్పటి వరకు 17,090 పోస్టులకే నోటిఫికేషన్లు

టీఎస్‌పీఎస్సీ నుంచి 503 గ్రూప్‌-1 పోస్టులు

సర్కారు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడంలో తాత్సారం

ఆర్థిక భారాన్ని బేరీజు వేసుకోవడమే కారణమా?

మొత్తం 80,039 పోస్టుల భర్తీతో 

రూ.7000 కోట్ల మేర అదనపు భారం


హైదరాబాద్‌, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): 91,142.. ఇదీ.. అసెంబ్లీ సాక్షిగా ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తమ ప్రభుత్వం భర్తీ చేస్తుందని ప్రకటించిన ప్రభుత్వోద్యోగాల సంఖ్య..! ఈ ప్రకటన వచ్చి ఐదు నెలలు గడుస్తున్నా.. కొలువుల భర్తీ ప్రక్రియ ఓ అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కి.. అన్నట్లుగా సాగుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా.. యుద్ధప్రాతిపదికన వీటిని భర్తీ చేయాలని అప్పట్లో సర్కారు కంకణబద్ధమై ఉన్నా.. ముందున్న జోరు క్రమంగా తగ్గుతూ వస్తోంది. ప్రభుత్వ యంత్రాంగం అడపాదడపా ‘కొలువుల మేళా’.. అంటూ ఊరించడం.. ఆర్థిక శాఖ అనుమతులు అంటూ ప్రకటనలు చేయడం తప్ప.. నియామక మండళ్లు నోటిఫికేషన్లు జారీ చేసే అంకానికి మాత్రం చేరడం లేదు..! టీఎ్‌సపీఎస్సీ 503 గ్రూప్‌-1 పోస్టులు.. పోలీసు కొలువులు.. ఇలా 17 వేల పోస్టుల నోటిఫికేషన్లను మించి.. ఇప్పటివరకు తీసుకున్న చర్యలు పెద్దగా కనిపించడం లేదు. ఈ పరిణామాలన్నీ నిరుద్యోగులను ఆందోళనకు 

గురిచేస్తున్నాయి. నోటిఫికేషన్ల జారీలో తాత్సారం జరిగితే.. అప్పటికి ఎన్నికల షెడ్యూల్‌ జారీ అయితే.. సర్కారీ కొలువులు తీరని కలేనని వాపోతున్నారు. పైగా.. ఇప్పుడు ప్రకటించిన వయోపరిమితి పెంపు భవిష్యత్‌లో ఉంటుందనే నమ్మకం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.


అంతటా మందకొడితనమే!

ప్రభుత్వ కొలువుల భర్తీ విషయంలో ఆర్థికశాఖ అనుమతించాల్సిన పోస్టుల్లో జాప్యం చోటు చేసుకుంటుండగా.. ఇప్పటికే అనుమతించిన పోస్టులకు నోటిఫికేషన్లు జారీ కాకపోవడం నిరుద్యోగులను నిరుత్సాహపరుస్తోంది. నోటిఫికేషన్లు జారీ అయితే.. తదనుగుణంగా తమ అధ్యయన, శిక్షణ షెడ్యూలును రూపొందించామనుకుంటున్న అభ్యర్థులకు నిరాశ ఎదురవుతోంది. కొలువుల నోటిఫికేషన్లలోపు ఎన్నికల నోటిఫికేషన్లు వస్తే పరిస్థితి ఏంటని ఆందోళన చెందుతున్నారు. కొత్తగా వచ్చే ప్రభుత్వ విధానం ఎలా ఉంటుందో, ఎన్ని పోస్టులను భర్తీ చేస్తుందో, ఎలాంటి మార్పులు చేస్తుందోనన్న అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వ గడువు ముగిసేనాటికైనా ప్రకటిత పోస్టుల్లో సింహభాగం భర్తీ చేస్తే బాగుంటుందని అభిలషిస్తున్నారు. 


ముఖ్యమంత్రి ప్రకటన ఇలా..

తాము అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 1,56,254 ఖాళీ పోస్టులను గుర్తించామని, ఇందులో 1,33,942 కొలువులను భర్తీ చేశామని మార్చి 9న సీఎం కేసీఆర్‌ అసెంబ్లీలో ప్రకటించారు. ప్రత్యక్ష ఎంపిక విధానంలో భర్తీ చేయాల్సిన పోస్టులు మరో 91,142 వరకు ఉన్నాయని వెల్లడించారు. ఇప్పటికే పనిచేస్తున్న 11,103 మంది కాంట్రాక్టు సిబ్బందిని రెగ్యులరైజ్‌ చేయాల్సి ఉందని, మిగతా 80,039 పోస్టులను ప్రత్యక్ష ఎంపిక విధానంలో భర్తీ చేస్తామని ప్రకటించారు. వీటిని భర్తీ చేసే ప్రక్రియ వెంటనే ప్రారంభమవుతుందని అదే ప్రకటించారు. కానీ.. భర్తీ ప్రక్రియలో వేగం లేదు. సీఎం ప్రకటన వెలువడిన పక్షం రోజుల తర్వాత(మార్చి 23న) ఆర్థిక శాఖ అనుమతులు మంజూరు చేసింది. 80,039 పోస్టుల్లో 30,453 కొలువులకు ఒకేసారి అనుమతులిచ్చింది. ఆ తర్వాత విడతల వారీగా జారీ చేసిన అనుమతులను కలుపుకొంటే మొత్తం పోస్టుల సంఖ్య 49,428. ఇందులో గ్రూప్‌-1 పోస్టులు 503 కాగా, ఇతర పోస్టులు హోం, వైద్య ఆరోగ్యం, రవాణా శాఖలకు సంబంధించినవి. ఆర్థికశాఖ ముందుగానే ఖాళీల వివరాలను తెప్పించుకున్నా.. వెనువెంటనే అనుమతులివ్వడం లేదు. ఇంకా 30,611 పోస్టులకు అనుమతులు ఇవ్వాల్సి ఉంది. ఆ తంతును ముగిస్తే.. నియామక బోర్డులు తదుపరి ప్రక్రియలను ప్రారంభిస్తాయి. ముఖ్యమైన పోస్టులవారీగా నోటిఫికేషన్ల షెడ్యూళ్లను రూపొందించుకుంటాయి. అభ్యర్థులకు తదనుగుణంగా శిక్షణ పొందడానికి/సన్నద్ధమవ్వడానికి వీలు దొరుకుతుంది.


నోటిఫికేషన్ల జారీలో జాప్యం

ఆర్థిక శాఖ అనుమతించిన పోస్టులకు కూడా నోటిఫికేషన్లు సకాలంలో వెలువడడం లేదు. ఇప్పటివరకు అనుమతించిన 49,428 పోస్టుల్లో 17,090కి మాత్రమే నోటిఫికేషన్లు వెలువడ్డాయి. టీఎ్‌సపీఎస్సీ, తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్‌ నియామక మండలి(టీఎ్‌సఎల్‌పీఆర్‌బీ), వైద్య ఆరోగ్య సేవల నియామక మండలి(ఎంహెచ్‌ఎ్‌సఆర్‌బీ), తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామక మండలి(టీఆర్‌ఈఐఆర్‌బీ)లకు ప్రభుత్వం వివిధ పోస్టుల భర్తీ బాధ్యతలను అప్పగించింది. వాస్తవానికి టీఎ్‌సపీఎస్సీ భర్తీ చేయాల్సిన 11,966 పోస్టులకు ఆర్థిక శాఖ అనుమతులున్నాయి. ఇందులో 503 గ్రూప్‌-1 పోస్టులకు మాత్రమే నోటిఫికేషన్‌ను జారీ చేసింది. మిగతా పోస్టులకు సంబంధించి ఆయా శాఖల నుంచి రిజర్వేషన్లు, రోస్టర్‌ పాయింట్లు, విద్యార్హతలు వంటి వివరాలు అందుబాటులో ఉన్నాయి. సిలబస్‌, పరీక్షల నిర్వహణ, పరీక్ష కేంద్రాలు తదితర మౌలిక సదుపాయాలపై కూడా ఒక అవగాహన ఉంది. అయినా.. నోటిఫికేషన్ల విడుదలకు ప్రభుత్వం పచ్చజెండా ఊపాల్సి ఉంటుంది. ఇక్కడే ఆలస్యం జరుగుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. గురుకుల విద్యాలయాల సంస్థ పోస్టుల భర్తీ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాకపోవడం గమనార్హం.


ఖజానాపై రూ.7,000 కోట్ల అదనపు భారం

ఆర్థిక శాఖ అనుమతించిన 80వేల పోస్టుల భర్తీ పూర్తయితే.. వేతనాల రూపంలో ప్రభుత్వంపై ఏటా రూ. 7,000 కోట్ల మేర అదనపు భారం పడుతుంది. ఇప్పటికే ఉద్యోగులు, పెన్షనర్లకు నెలకు రూ.4,500 కోట్ల మేర వేతనాలు, పెన్షన్లను చెల్లించాల్సి వస్తోంది. అంటే ఏటా రూ.50 వేల కోట్ల వరకు ఈ పద్దు కింద ఉంటుంది. కొత్త పోస్టుల భర్తీతో మరో రూ.7000 కోట్లను అదనంగా సర్దాలి. ఈ ఆర్థిక సంవత్సరంలో కొత్త పోస్టుల కోసం పెద్దగా నిధులను కేటాయించలేదు. అదనపు ఆర్థిక భారం కారణంగానే ప్రభుత్వం పోస్టుల భర్తీలో జాప్యం చేస్తోందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఎన్నికలు ప్రారంభమయ్యే నాటికి భర్తీ ప్రక్రియను ఇలాగే సాగదీస్తారన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Updated Date - 2022-08-14T08:00:27+05:30 IST