అడ్డా ఏదీ..!?
ABN , First Publish Date - 2022-10-17T05:38:14+05:30 IST
అడ్డా ఏదీ..!?
పని కోసం మానుకోట రోడ్డు మీదే పడిగాపులు
ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ ఇబ్బందులు
జిల్లా కేంద్రంలో ప్రత్యేకంగా స్థలం కేటాయించాలని కార్మికులు, మేస్త్రీల డిమాండ్
మహబూబాబాద్ టౌన్, అక్టోబరు 16 : రోజూ పని చేస్తేనే.. వాళ్ల కుటుంబాలు గడుస్తా యి. ఒక్క దినం కూలి దొరక్కపోతే ఆ పూట ఇబ్బందులే.. తెల్లవారుతే చాలు.. పని కోసం పరుగెత్తాల్సిందే.. వారే నిరుపేద భవన నిర్మాణ మేస్త్రీలు, కూలీలు. మానుకోట పట్టణానికి చెం దిన కూలీలే కాదు.. సమీప గ్రామాల భవన నిర్మాణ కార్మికులూ సైతం ప్రతీ దినం ఉదయా న్నే జిల్లా కేంద్రానికి చేరుకుంటారు. వారికి ఎక్క డా అడ్డా లేకపోవడంతో మహబూబాబాద్‌లోని కొత్తబజారు వైపు రైల్వేస్టేషన్‌కు వెళ్లే రహదారిలోని శ్రీనివాస సెంటర్‌లో నిల్చుంటారు. పని కోసం కూలీలు, మేస్త్రీలు పొద్దునే సద్ది చేతపట్టుకుని అక్కడకు చేరుకుని ఎండకు ఎండుతూ.. వానకు తడుస్తూ రోడ్డుమీదనే పడిగాపులు కాస్తుంటారు. అవసరం ఉన్నవారు అక్కడకు వచ్చి, వారిని భవన నిర్మాణ పనులకు తీసుకువెళ్తుంటారు.
వెయ్యి మందికి పైగా కార్మికులు..
మహబూబాబాద్ పట్టణంలో రోజూపని కోసం సుమారు 1000 మందికి పైగానే కూలీలు శ్రీనివాస సెంటర్ వద్దకు చేరుకోవడంతో ఆ కూడలి అంతా వారితో నిండిపోతోంది. మరోపక్క అక్కడే కూరగాయాల మార్కెట్, దుకాణ సముదాయాలు, ముఖ్యంగా టిఫిన్ సెంటర్లు ఉం డటంతో వందలాది మంది వివిధ పనుల నిమిత్తం వస్తుంటారు. ఇలా భవననిర్మాణ కార్మికులతో పాటు వివిధ పనుల నిమిత్తం వచ్చే వారితో ఆ ప్రాంతమంతా జనసందోహంగా మారుతోంది. అదే దారివెంట రైల్వేస్టేషన్‌కు, గాంధీ పార్కులో తాత్కాలికంగా ఏర్పాటు కూరగాయల మార్కెట్, ఆర్యూబీ గుండా పాత, కొత్త బజారులకు వాహన రాకపోకలు కొనసాగుతాయి. దీంతో ఆ ప్రాంతం లో అక్కడ ఇసుక పోస్తే రాలనంత కూలీలుండటంతో ట్రాఫిక్ జామ్ అయి వాహన రాకపోకలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఉదయం వేళల్లో దాదాపు రెండు గంటలకు పైగానే అక్కడ కూలీలు ఉంటారు. దీంతో ఆ సమయంలో రైళ్లకు వెళ్లే ప్రయాణికులు అక్కడ నుంచి వాహనాల్లో వెళ్లలేక రైళ్లు మిస్ అయిన సంఘటనలు కూడా ఉన్నాయి.
మరోపక్క ట్రాఫిక్‌కు అంతరాయం కలుగడంతో ఇటీవల కాలంలో మేస్త్రీపై పోలీస్ కానిస్టేబుల్ లాఠీని ఝులిపించిన సంఘటన వెలుగు చూసింది. ఇక అక్కడ దుకాణాలకు వచ్చి కొనుగోలు చేసే వినియోగదారులు పడరాని పాట్లు పడుతున్నారు. అయితే గతంలో ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ప్రస్తుతం కూరగయాల మార్కెట్ నిర్వహిస్తున్న గాంధీపార్కును కూలీలకు అడ్డాగా కేటాయించారు. ఇటీవల కాలం లో తొర్రూరు బస్డాండ్ సమీపంలో పాత కూరగాయాల మార్కెట్ స్థలంలో ఇంటిగ్రెటేడ్ మోడల్ మార్కెట్ నిర్మాణం జరుగుతుండగా, దానిని గాంధీ పార్కుకు మర్చారు. దీంతో కూలీల అడ్డాకాస్త మళ్లీ పాత శ్రీనివాస సెంటర్‌లోని రోడ్డుమీదకు వచ్చింది.
జిల్లా కేంద్రమైనా కూలీలకు అడ్డాకు స్థలం కరువు...?
మహబూబాబాద్ మేజర్ గ్రామ పంచాయతీ స్థాయి నుంచి రైల్వేస్టేషన్ సెంటరే అడ్డాగా మలుచుకుని కూలీలు అక్కడే ఉంటూ పనులకు వెళ్తున్నారు. దినదినాభివృద్ధి చెంది మునిసిపాలిటీగా, జిల్లా కేంద్రంగా అప్‌గ్రేడ్ అయునప్పటికి మానుకోటలో మాత్రం భవన నిర్మాణ కార్మికుల అడ్డాకు స్థలం కరువైంది. రోడ్డుపైనే ఉండి కూలీ పనులు ఎతుక్కొవాల్సిన దైన్యస్థితి నెలకొంది. పని కోసం పాట్లు పడడం ఒక ఎత్తు అయితే... రోడ్డుపైన నిల్చుంటే అటు పోలీసులు, ఇటు వాహనదారుల నుంచి ఇబ్బందులను అధిగమించడం మరోఎత్తు అవుతోంది. తమకు అనువైన ప్రభుత్వ స్థలం కేటాయించి, ప్రత్యేక అడ్డాను ఏర్పాటు చేసి అందులో షేడ్‌ను ఏర్పాటు చేయాలని భవన నిర్మాణ కార్మికులు వేడుకుంటున్నారు.
అడ్డా కోసం స్థలం కేటాయించాలి : ఆకుల రాజు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి, మానుకోట
మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వేలాది మంది భవన నిర్మాణకార్మికులు, మేస్త్రీలున్నారు. వారు పని కోసం పట్టణంలోని శ్రీనివాస సెంటర్‌లో రోడ్డుపైనే నిల్చోవడంతో అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పొద్దునే లేచివచ్చి పని దొరికేంత వరకు అక్కడే నిలుచుంటారు. వానకు తడుస్తూ, ఎండకు ఎండుతూ అక్కడే ఉండి పని కోసం వెళ్లాల్సి వస్తోంది. వారికి అనువైన స్ధలాన్ని కేటాయించి షేడ్‌ను ఏర్పాటు చేయాలి.
అనేక ఇబ్బందులు పడుతున్నాం : దబ్బెటి శ్రీనివాస్, సుతారి మేస్త్రీ, మానుకోట
దినదినాభివృద్ధి చెంది మానుకోట జిల్లా కేంద్రంగా ఎదిగినప్పటికి భవన నిర్మాణ కార్మికుల అడ్డాకు మాత్రం స్థలం కరువైంది. పని కోసం వచ్చిన వాళ్లంతా రోడ్డుపైనే ఉండడం తో ఇటు కార్మికులకు, అటు ప్రజలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయి. కార్మికుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని రైల్వేస్టేషన్ సమీపంలో ప్రభు త్వ స్థలం కేటాయించి షేడ్‌ను ఏర్పాటు చేసి మౌళిక వసతులు కల్పించాలి.