గుంతలో పడి వ్యక్తి మృతి

ABN , First Publish Date - 2022-11-12T00:45:50+05:30 IST

కేబుల్‌ కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంతో రోడ్డుపై గుంతను తవ్వి మట్టి పూడ్చకపోవడంతో గుంతలో పడి వ్యక్తి తీవ్ర గాయాలకు గురై మృతి చెందిన సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది.

గుంతలో పడి వ్యక్తి మృతి
వెంకటేష్‌(ఫైల్‌ ఫొటో)

భూదానపోచంపల్లి, నవంబరు 11: కేబుల్‌ కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యంతో రోడ్డుపై గుంతను తవ్వి మట్టి పూడ్చకపోవడంతో గుంతలో పడి వ్యక్తి తీవ్ర గాయాలకు గురై మృతి చెందిన సంఘటన పట్టణంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యులు, స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. భూదానపోచంపల్లి పట్టణం బీసీ కాలనీలో నివాసముంటున్న గోరుకంటి వెంకటేష్‌ (36) కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నాడు. గురువారం రాత్రి పదిన్నర గంటల సమయంలో తన స్నేహితుడు గోశిక శేఖర్‌తో కలిసి బైక్‌పై తను మరో స్నేహితుడైన కంటె రవి దగ్గరకి వెళ్లి వద్దామని భీమనపల్లికి వెళ్లాడు. అయితే తన మిత్రుడిని కలిసి ఇంటటికి తిరిగి వస్తున్న క్రమంలో భీమనపల్లి గ్రామశివారులో ఓ కేబుల్‌ కాంట్రాక్టర్‌ తవ్విన గుంతను గమనించక వెంకటేష్‌ ఒక్క సారిగా గుంతలో పడడంతో అతని తలకు తీవ్ర గాయాలై అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదం జరిగిన అరగంట వరకు వారిని ఎవ్వరూ గమనించలేదు. ఆ తర్వాత అటుగా వెళ్తున్న ఓ వ్యక్తి గుర్తించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు వచ్చి చూడగా, అప్పటికే అతడు మృతి చెంది ఉన్నాడు. అయితే గాయాలైన శేఖర్‌ను మెరుగైన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌ ఆస్పత్రికి తరలించారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్‌ఐ సైదిరెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వెంకటేష్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం భువనగిరి ఏరియా ఆస్పత్రికి తరలించారు. వెంకటే్‌షకు భార్య, కూతురు, కొడుకు ఉన్నారు. వెంకటేష్‌ మృతి పట్ల కాలనీ వాసులు, యువకులు, అధికారులు, ప్రజాప్రతినిధులు సంతాపం తెలిపారు.

Updated Date - 2022-11-12T00:45:50+05:30 IST

Read more