నవజాత శిశువుల్లో కామెర్లను పసిగట్టే పరికరం!

ABN , First Publish Date - 2022-10-07T09:47:54+05:30 IST

నవజాత శిశువుల్లో కామెర్ల వ్యాధిని పసిగట్టే పరికరంతోపాటు 5జీ...

నవజాత శిశువుల్లో కామెర్లను పసిగట్టే పరికరం!

‘ఐఐటీ-హెచ్‌ ఇన్నోవేటివ్‌’లో  ప్రదర్శన 

కంది, అక్టోబరు 6: నవజాత శిశువుల్లో కామెర్ల వ్యాధిని పసిగట్టే పరికరంతోపాటు 5జీ, 6జీ టెక్నాలజీ అభివృద్ధికి ఉపయోగపడే పలు ఆవిష్కరణలను ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ(ఐఐటీ), హైదరాబాద్‌ పరిశోధకులు చేశారు. ఐఐటీ-హెచ్‌ ఇన్నోవేటివ్‌ పేరిట గురువారం నిర్వహించిన కార్యక్రమంలో వీటిని ప్రదర్శించారు. వివిధ రంగాల వికాసానికి దోహదం చేసే ఆవిష్కరణలకు ఐఐటీ-హెచ్‌ వేదిక కావడం గర్వంగా ఉందని ఆ సంస్థ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ బీఎస్‌ మూర్తి ఈ సందర్భంగా అన్నారు. ప్రొఫెసర్‌ కిరణ్‌ కూచి సారథ్యంలోని ఐఐటీ-హెచ్‌ బృందం రూపొందించిన ఆరు ఆవిష్కరణలను ఈ ప్రదర్శనలో ఉంచామని తెలిపారు. దేశంలోని 23 ఐఐటీలకు చెందిన విద్యార్థులు అభివృద్ధి చేసిన ఆవిష్కరణలతో ఈ నెల 14, 15 తేదీల్లో ఢిల్లీలో నిర్వహించే టెక్నాలజీ ఫెయిర్‌లో వీటిని ప్రదర్శిస్తామని వెల్లడించారు. కాగా, మెదడు సమస్యలతో బాధపడే వారిలో చురుకుదనాన్ని పెంపొందించేందుకు ఐఐటీ-హెచ్‌ విద్యార్థులు అభివృద్ధి చేసిన పరికరాన్ని ఈ కార్యక్రమంలో ప్రదర్శించారు. అంతేకాక, ఆస్పత్రిలో ఉన్న రోగులు వివిధ ఇన్‌ఫెక్షన్ల బారిన పడకుండా ఉండేలా చేసే పరికరం, నవజాత శిశువుల్లో కామెర్ల వ్యాధిని పసిగట్టేందుకు అభివృద్ధి చేసిన పరికరాన్ని ప్రదర్శించారు. ఇక, రక్షణ రంగ అవసరాల కోసం అభివృద్ధి చేసిన పోర్టబుల్‌ బ్రిడ్జి నమూనాని ప్రదర్శనలో ఉంచారు. 1.5 టన్నుల సామర్థ్యం, 9 మీటర్ల పొడవు ఉండే ఈ పోర్టబుల్‌ బ్రిడ్జిని చాలా తక్కువ సమయంలో నిర్మించవచ్చని శాస్త్రవేత్తలు తెలిపారు. 

Updated Date - 2022-10-07T09:47:54+05:30 IST