500 ఏళ్ల నాటి పంచలోహ విగ్రహం చోరీ

ABN , First Publish Date - 2022-10-07T09:42:52+05:30 IST

మెదక్‌ జిల్లా శివ్వంపేట మండలం దొంతి గ్రామంలో రెండు ఆలయాల్లో దుండగులు చొరబడటం కలకలం రేపింది.

500 ఏళ్ల నాటి పంచలోహ విగ్రహం చోరీ

  • మహంకాళి అమ్మవారి విగ్రహ చేతులు ధ్వంసం
  • ఒకే గ్రామంలో రెండు ఆలయాల్లో ఘటనలు
  • మెదక్‌లో శివ్వంపేట మండలంలో కలకలం 
  • మండలకేంద్రంలోని కట్టమైసమ్మ ఆలయంలోనూ చోరీ
  • పోలీసుల గస్తీ లేకపోవడం వలనేనని గ్రామస్తుల మండిపాటు

శివ్వంపేట, అక్టోబరు 6: మెదక్‌ జిల్లా శివ్వంపేట మండలం దొంతి గ్రామంలో రెండు ఆలయాల్లో దుండగులు చొరబడటం కలకలం రేపింది. వేణుగోపాలస్వామి ఆలయంలో 500ఏళ్ల నాటి 20కిలోల ఆండాళమ్మ పంచలోహ విగ్రహం బుధవారం చోరీకి గురైంది. ఆ విగ్రహం విలువ సుమారు రూ.20లక్షల వరకు ఉంటుందని అంచనా. ఇక ఇదే గ్రామంలో మహంకాళి అమ్మవారి ఆలయం తలుపులు పగులగొట్టిన దుండగులు, విగ్రహం చేతులను ధ్వంసం చేశారు. ఒకే గ్రామంలో రెండు ఆలయాల్లో దొంగతనాలు జరగడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానద్వారం తలుపులకు తాళాలు అలాగే ఉన్నాయని, దుండగులు గోడ దూకి ఈ దారుణాలకు పాల్పడి ఉండొచ్చని స్థానికులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఘటనలపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. మరోవైపు..శివ్వంపేట మండల కేంద్రంలో కట్టమైసమ్మ ఆలయంలోనూ దొంగలుపడ్డారు. ఆలయంలోని వెండి ఆభరణాలను దొంగిలించారు. గతంలోనూ ఇదే మండలంలోని చింతల్‌లో ఆంజనేయస్వామి విగ్రహాన్ని ఎత్తుకెళ్లిన ఘటన జరిగి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు దొంగలను పట్టుకోలేదన్న విమర్శలు పోలీసులపై ఉన్నాయి. పోలీసులు పాట్రోలింగ్‌ నిర్వహించకపోవడం వలనే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - 2022-10-07T09:42:52+05:30 IST