70% బస్సులు డొక్కువే
ABN , First Publish Date - 2022-04-14T07:34:25+05:30 IST
‘ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడం సురక్షితం.. సుఖవంతం.. శుభప్రదం’
- కండిషన్ లేనివే బస్సులు
- హైదరాబాద్‌లో 30 శాతం!
- అయినా రోడ్ల మీద పరుగులు
- అందుకే తరచూ యాక్సిడెంట్లు
- మూడేళ్లలో 1742 ప్రమాదాలు
- డ్రైవర్ల నిర్లక్ష్యమూ కారణమే
- స్టీరింగ్ పట్టి ఫోన్ సంభాషణ, మద్యం మత్తు
- 480 మంది డ్రైవర్ల తొలగింపు
(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్)
‘ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేయడం సురక్షితం.. సుఖవంతం.. శుభప్రదం’ అని బస్సులపై రాసి ఉంటుంది. మరి.. ప్రయాణికులు అలా ఫీలవుతున్నారో లేదో గానీ.. రోడ్డు మీద వెళ్లే ఇతర వాహనదారులు, పాదచారులు మాత్రం ఆ బస్సులను వెంటాడే మృత్యువుగా భావించి హడలిపోతున్నారు. రోడ్డు మీద వెళుతున్నప్పుడు వెనుక నుంచి ఆర్టీసీ బస్సు వస్తోందంటేనే బెంబేలెత్తిపోతున్నారు. ‘ప్రగతి రథ చక్రాలు’ ప్రాణాలు నలిపేస్తున్నాయి.
ఆర్టీసీ బస్సులు ఉన్నట్టుండి అదుపు తప్పి.. ఆ వేగంలోనే ఎదురుగా వెళుతున్న వాహనాలపైకి దూసుకెళుతున్నాయి. ఆ భారీ వాహనాల కింద నిండు ప్రాణాలు నలిగిపోతున్నాయి. కొన్నిచోట్ల రోడ్ల మీద నుంచి పొలాల్లోకి దూసుకెళ్లి ప్రయాణికులను గాయాలపాల్జేస్తున్నాయి. బస్టాండ్‌లలోనూ ప్రయాణికులను ఢీకొడుతున్నాయి. ప్లాట్‌ఫాం మీద ఉన్నవారిపైకీ దూసుకెళుతున్నాయి. ఇటీవల బస్సు ప్రమాదాలు పెరుగుతుండటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. కారణం ఏమిటి? అన్న ప్రశ్నించుకుంటే కారణాలు ఎన్నో కనిపిస్తున్నాయి.
కొత్త బస్సుల్లేవు.. డొక్కువే దిక్కు
సీటింగ్ సామర్థ్యం మేరకు అయితే ఓ ఆర్టీసీ బస్సులో గరిష్టంగా 55 మంది ప్రయాణించవచ్చు. రద్దీ ఉన్నప్పుడు నిల్చుని ప్రయాణించే వారిని కలుపుకొంటే ఆ సంఖ్య 75 నుంచి 90 దాకా ఉంటుంది. ఇంత మందితో రోడ్డెక్కే బస్సులో సాంకేతికంగా ఏ చిన్న లోపం ఉన్నా.. అది అందులోని ప్రయాణికులకు, బయట వాహనదారులకు ఎంత ప్రమాదం!? అయితే ఓ ట్రేడ్ యూనియన్ నేత వివరాల ప్రకారం ప్రస్తుతం రోడ్డెక్కుతున్న బస్సుల్లో దాదాపు 70 శాతం స్ర్కాపింగ్ కండిషన్‌లో ఉన్నవే! వీటివల్లే ప్రమాదాలు జరుగుతున్నాయి. జిల్లాల్లోని పల్లె వెలుగు బస్సులు ట్రిప్పునకు గరిష్ఠంగా 40-50 కిలోమీటర్ల లోపు తిరిగేవే ఉండటంతో బస్సుల కండిషన్‌ను పట్టించుకోవడం లేదని.. ఏవో కొన్ని రిపేర్లు చేసి ఏదో ఒకరకంగా రోడ్డెక్కిస్తే చాలు అన్నట్లుగా సంస్థ వ్యవహరిస్తోందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
ఓ లెక్క ప్రకా రం.. 2019లో రాష్ట్రవ్యాప్తంగా మొత్తం బస్సుల్లో 1690 బస్సులను కాలం చెల్లినవిగా గుర్తించి పక్కనబెట్టారు. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 97 డిపోల్లో 6450 బస్సులు నడుస్తున్నాయి. వీటిలో 2675 బస్సులను తొలగించాల్సి ఉంది. అంటే.. పనికిరాని బస్సులు 41శాతం అన్నమాట. కొన్నిచోట్ల గ్యారేజ్‌లో మూలన పడేసిన పాత బస్సులనూ రోడ్డెక్కిస్తున్నారనే ఆరోపణలున్నాయి.
విశ్రాంతి లేక.. ఏకాగ్రత లోపించి..
డైవర్ల నిర్లక్ష్యంతోనూ బస్సు ప్రమాదాలు జరుగుతున్నాయి. బస్సు నడిపేటప్పుడు సెల్‌ఫోన్‌లో మాట్లాడే ధోరణి డ్రైవర్లలో పెరిగిపోయింది.
చాలా మంది డ్రైవర్ల మెడలో ఇయర్ ఫోన్లు కనిపిస్తున్నాయి. ఎప్పుడూ ధ్యాసంతా ఫోన్ సంభాషణపైనే ఉండటంతో డ్రైవింగ్ మీద ఏకాగ్రత కోల్పోతున్నారు. కొందరు మద్యం మత్తులో స్టీరింగ్ పడుతున్నారు. ఇంకొందరికి డ్యూటీ పరంగా సరైన విశ్రాంతి దొరక్క.. నిద్రలేక ఏకాగ్రత లోపిస్తోంది. మరికొందరు వేగ నియంత్రణను పాటించడం లేదు. సిగ్నల్స్ వద్ద నిబంధనలు పాటించడం లేదు. డ్రైవర్లకు సరైన శిక్షణనూ ఇవ్వడం లేదు. కొన్నిరూట్లలో ప్రయాణికులకు టికెట్ ఇచ్చే బాధ్యత మీద పడటంతో డ్రైవర్లపై ఒత్తిడి పెరుగుతోంది. గత మూడేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా చిన్నాపెద్దవి కలిపి 1742 ఆర్టీసీ బస్సులు ప్రమాదాలు బారిన పడ్డాయి. ఇదే కాలంలో తీవ్ర ప్రమాదాలకు కారణమయ్యారనే ఆరోపణలతో 480 మంది డ్రైవర్లను ఆర్టీసీ విధుల నుంచి తొలగించింది.

కొంపముంచుతున్న రన్నింగ్ టైమ్
నిర్ణీత సమయంలోనే బస్సులు గమ్యస్థానానికి చేరుకోవాలని (రన్నింగ్ టైమ్ టార్గెట్లు) నిర్దేశించడం, ఆలోపే గమ్యస్థానాలను చేరుకోవాలనే ఆత్రంలో డ్రైవర్లు వాహనాన్ని మితిమీరిన వేగంతో నడుపుతున్నారనే అభిప్రాయాలున్నాయి. ట్రాఫిక్ సమస్య ఎక్కువగా హైదరాబాద్‌లో ఇది ప్రమాదాలకు కారణభూతమవుతోందన్న ఆరోపణలున్నాయి.
ఉదాహరణకు అబిడ్స్ నుంచి సికింద్రాబాద్‌కు 20 నిమిషాల్లో చేరుకోవాలని, అయితే ట్రాఫిక్ ఎక్కువగా ఉన్నప్పుడు 35నిమిషాల కన్నా ఎక్కు వ సమయమే పడుతుందని ఓ ఆర్టీసీ డ్రైవర్ చెప్పారు. అలాంటప్పుడు తాము మితిమీరిన వేగంతో బస్సు నడుపుతామని.. వాహనాలను ఓవర్‌టేక్ చేస్తామని.. చాలా స్టాప్‌లలో అర నిమిషానికి మంచి ఆపబోమని చెప్పారు.
జిల్లాల్లో పల్లెవెలుగు బస్సులకు అనుమతించిన రన్నింగ్ టైమ్ గంటలకు 35 కిలోమీటర్లు. ఎక్స్‌ప్రెస్‌కైతే గంటకు 45 కిలోమీటర్లు ఉండగా ఏసీ బస్సులకు (అంతర్ రాష్ట్ర) గంటకు 55 కిలోమీటర్లుగా ఉంది. హైదరాబాద్‌లో ఆర్డినరీ బస్సులకు అనుమతించిన రన్నింగ్ టైమ్ గంటకు 20 కిలోమీటర్లు. అంటే మూడు నిమిషాలకు ఒక కిలోమీటర్ దూరం చొప్పున అన్నమాట. ఎక్స్‌ప్రెస్ బస్సుల విషయం లో ఇది గంటకు 24 కిలోమీటర్లుగా ఉంది. అంటే 2.5 నిమిషాలకు ఒక కిలోమీటర్ దూరం చొప్పున ఉన్నమాట.
ప్రమాదాల్లో కొన్ని
కామారెడ్డి జిల్లా మాచారెడ్డి మండలం ఘన్‌పూర్ వద్ద సోమవారం ఓ కారును బస్సును ఢీనగా కారులో ప్రయాణిస్తున్న వారిలో ఐదుగురు మృతిచెందారు. తాడ్వాయి మండల కేంద్రంలో బైక్‌పై వెళ్తున్న వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఆ వ్యక్తి మృతి చెందాడు. మాచారెడ్డి చౌరస్తాలో రెండు నెలల క్రితం బైక్‌ను డ్రైవర్ నిర్లక్ష్యంతో బస్సు ఢీకొట్టడంతో ఆ వాహనంపై వెళ్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యాడు. 2020-21లో హనుమకొండ జిల్లా వ్యాప్తగా 36 ప్రమాదాలు జరగ్గా 38 మంది మృతిచెందారు.
చాదర్‌ఘాట్‌లో మెట్రోపిల్లర్‌ను ఢీకొన్న బస్సు
బుధవారం హైదరాబాద్‌లోని చాదర్‌ఘాట్‌లో ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. ఆటోను డ్రైవర్ అకస్మాత్తుగా యూటర్న్ తీసి, ఎదురుగా రావడంతో ఆ వాహనాన్ని తప్పించే క్రమంలో డ్రైవర్ స్టీరింగ్ ఓ పక్కకు తిప్పడంతో బస్సు మెట్రో డివైడర్‌ను ఢీకొట్టాడు.
నగరంలో 30% బస్సులు వేస్ట్
హైదరాబాద్‌లో ప్రస్తుతం రోడ్డెక్కుతున్న బస్సుల్లో 30శాతం కాలంచెల్లినవే ఉన్నాయని, ఆ డొక్కు బస్సులకు మరమ్మతులు చేసి రోడ్డు మీదకు తెస్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని ఉద్యోగ విరమణ చేసిన ఓ ఆర్టీసీ అధికారి తెలిపారు. వాహనాల వెనుకవైపు లైట్లు (టెయిల్ ల్యాంప్స్) కండిషన్‌లో ఉంటే సడన్ బ్రేక్ వేసినప్పుడు, మలుపు వద్ద ఇండికేటర్ వేసినప్పుడు ఇతర వాహనదారులు అప్రమత్తంగా ఉంటారు కాబట్టి ప్రమాదాలు జరిగే అవకాశం ఉండదు. అయితే నగరంలో తిరుగుతున్న 2800 బస్సుల్లో 40 వాహనాలకు టెయిల్ ల్యాంప్సే లేవు. ఉన్న బస్సుల్లోనేమో వాటిని డ్రైవర్లు ఉపయోగించడం లేదు. దీంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. నగరంలో నడిచే ఆర్టీసీ బస్సుల విషయంలో వేగ నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, బస్సుల ఫిట్‌నె్‌సపై ఆర్టీఏ అధికారులు తరచూ తనిఖీ చేయాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.
బైకర్ల నిర్లక్ష్యం కూడా
బస్సు ప్రమాదాల్లో ఎక్కువ మంది ద్విచక్రవాహనదారులే మరణిస్తున్నారు. ఈ ప్రమాదాలకు బైకర్ల నిర్లక్ష్యమూ కారణమవుతోందనే అభిప్రాయాలున్నాయి. ఏమాత్రం భయం లేకుండా బైక్‌లను ఇష్టారీతిన నిర్లక్ష్యంగా నడుపుతుండటం, బైక్‌పై పరిమితికి మించి ముగ్గురు కూర్చోవడం, ఫోన్ మాట్లాడుతూ నడుపుతుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రధానంగా గ్రామీణ రహదారుల నుంచి మెయిన్ రోడ్డుకు ఎక్కేటప్పుడు కుడి ఎడమలు ఏమాత్రం చూసుకోకుడా బైక్‌ను దూకించి ప్రమాదాల బారినపడుతున్నారు.
రోడ్డుపై అవగాహన లేకపోవడం
వాహనం నడుపుతున్న డ్రైవర్లలో కొందరికి రూట్లలో కీలక ప్రదేశాల మీద అవగాహన ఉండటం లేదని ఆ కారణంగానూ ప్రమాదాలు జరుగుతున్నాయనే అభిప్రాయాలున్నాయి. రోడ్డు నిర్మాణం, మరమ్మతు పనులు జరుగుతున్న చోట్ల.. మూలమలుపుల వద్ద.. ప్రధానంగా గుబురు చెట్లు, ముళ్లపొదలతో నిండివున్న టర్నింగ్‌ల వద్ద... చౌరస్తాల వద్ద బస్సు డ్రైవర్లు నిర్లక్ష్యంగా నడుపుతున్నారనే ఆరోపణలున్నాయి. గత మార్చి 6న యాదాద్రి జిల్లాలోని ఆలేరు వద్ద నలుగురిని బలిగొన్న బస్సు ప్రమాదం ఇదే కోవలోకి వస్తుంది.