56 ఏళ్ల మహిళకు 47 కిలోల అండాశయ కణితి
ABN , First Publish Date - 2022-02-16T08:03:30+05:30 IST
ఓ 56 ఏళ్ల మహిళ అండాశయంలో ఉన్న 47 కిలోల భారీ కణితిని అహ్మదాబాద్ అపోలో ఆస్పత్రి వైద్యులు తొలగించారు.
- సర్జరీ చేసి తొలగించిన అహ్మదాబాద్ అపోలో ఆస్పత్రి వైద్యులు
- మన దేశంలో అతి పెద్ద అండాశయ కణితి ఇదేనని ప్రకటన
హైదరాబాద్ సిటీ, ఫిబ్రవరి 15 (ఆంధ్రజ్యోతి): ఓ 56 ఏళ్ల మహిళ అండాశయంలో ఉన్న 47 కిలోల భారీ కణితిని అహ్మదాబాద్ అపోలో ఆస్పత్రి వైద్యులు తొలగించారు. భారతదేశంలో తొలగించిన అతి పెద్ద అండాశయ కణితి ఇదేనని వెల్లడించారు. ఈ కణితి వల్ల 18 ఏళ్లుగా బాధపడుతున్న ఆ మహిళ ఇటీవల మంచానికి పరిమితమైంది. ఆమె శరీర బరువు కూడా అసాధారణ స్థాయికి చేరింది. అయితే, జనవరి 27న ఎనిమిది వైద్యుల బృందం సర్జరీ నిర్వహించి ఆ కణితితోపాటు కడుపులోని గోడ కణజాలం, 7కిలోల బరువున్న అదనపు చర్మాన్ని తొలగించింది. దీంతో ఆమె శరీర బరువు 49 కిలోలకు తగ్గిపోయింది. అప్పట్నించి వైద్యుల పర్యవేక్షణలో ఉన్న ఆ మహిళను సోమవారం(ఫిబ్రవరి 14)న ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేశారు.