250 కోట్లు వినియోగమయ్యేనా!

ABN , First Publish Date - 2022-03-07T09:03:12+05:30 IST

జిల్లా, మండల పరిషత్తుల పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టేందుకుగాను మంజూరైన రూ.250 కోట్ల నిధుల ఖర్చుపై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు

250 కోట్లు వినియోగమయ్యేనా!

  • ఆర్థిక సంవత్సరంలో మిగిలింది 23 రోజులే
  • పరిషత్‌ నిధుల ఖర్చుపై కొరవడిన స్పష్టత
  • జెడ్పీటీసీ, ఎంపీటీసీల్లో అయోమయం


హైదరాబాద్‌, మార్చి 6(ఆంధ్రజ్యోతి): జిల్లా, మండల పరిషత్తుల పరిధిలో అభివృద్ధి పనులు చేపట్టేందుకుగాను మంజూరైన రూ.250 కోట్ల నిధుల ఖర్చుపై ప్రభుత్వం స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయకపోవడంతో జెడ్పీటీసీలు, ఎంపీటీసీల్లో తీవ్ర అయోమయం నెలకొంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 23 రోజులు మాత్రమే మిగిలి ఉండటంతో ఈ నిధులు ఉంటాయా? వెనక్కి వెళతాయా? అనే సందేహం నెలకొంది. పరిషత్తుల పరిధిలో అభివృద్ది పనుల కోసం నిరుటి బడ్జెట్‌లో రాష్ట్ర ప్రభుత్వం రూ.500 కోట్లు ప్రత్యేకంగా కేటాయించింది. ఆ మేరకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యులు తమ ప్రాదేశిక నియోజకవ వర్గాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించుకున్నారు. కొందరైతే ప్రతిపాదనలు తయారు చేయించి అధికారులకు అందజేశారు. రాష్ట్ర బడ్జెట్‌ ప్రకారం జెడ్పీలకు రూ.252కోట్లు, మండల పరిషత్‌లకు రూ.248కోట్లు రావాల్సి ఉంది. అయితే బడ్జెట్లో పెట్టిన నిధుల్లో సగం మొత్తాన్నే ప్రభుత్వం మంజూరు చేసింది.


అయితే ఈ నిధులను ఖర్చు చేయడంపై ప్రభుత్వం నుంచి స్పష్టమైన మార్గదర్శకాలు జారీ చేయలేదు. దీంతో వచ్చిన నిధులు సద్వినియోగం చేసుకోలేకపోతున్నామని ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం.. మార్గదర్శకాలు రాగానే పనులు ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. అయితే, విడుదలైన మొత్తాన్ని సైతం ఖర్చుపెట్టే అవకాశం లేకుండా పోయిందని, వాటి వినియోగానికి మార్గదర్శకాలివ్వకుండా కాలయాపన చేస్తోందని జెడ్పీటీసీ, ఎంపీటీసీలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Updated Date - 2022-03-07T09:03:12+05:30 IST