సర్పంచ్‌కి 20 లక్షలు

ABN , First Publish Date - 2022-08-18T08:28:16+05:30 IST

మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గంలో పార్టీ ఫిరాయింపులు జోరుగా సాగుతున్నాయి.

సర్పంచ్‌కి 20 లక్షలు

అడ్వాన్సుగా రూ.10 లక్షలు

ఎంపీటీసీ సభ్యులకూ అదే రేటు

మునుగోడులో ప్రజాప్రతినిధుల కొనుగోలు

టీఆర్‌ఎస్‌ నుంచి 10 మంది బీజేపీకి జంప్‌

కోటి అడ్వాన్సుగా ఇచ్చిన కమలం నేతలు? 

కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎ్‌సకూ వలసలు 

తలా 10 లక్షలు, 2 దళితబంధు యూనిట్లు 

బేరసారాల దెబ్బకు కాంగ్రెస్‌ విలవిల


నల్లగొండ, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో నియోజకవర్గంలో పార్టీ ఫిరాయింపులు జోరుగా సాగుతున్నాయి. స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో నిరంతరం బేరసారాలు, బేరం కుదరగానే అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా కీలక నేతల ఇళ్లకు తీసుకెళ్లడం, కండువాలు కప్పడం రివాజుగా మారింది. దీంతో రోజురోజుకూ ప్రజాప్రతినిధుల డిమాండ్‌ ఆకాశాన్నంటుతోంది. ప్రధాన పార్టీలకు ఉప ఎన్నిక ప్రతిష్ఠాత్మకంగా మారడంతో ఆయా పార్టీల నేతలు విధిలేక డిమాండ్‌ను అంగీకరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీఆర్‌ఎ్‌సకు గండికొట్టి

పెద్దసంఖ్యలో ప్రజాప్రతినిధులను బీజేపీలో చేర్చేందుకు తాజా మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి పకడ్బందీ వ్యూహం రచించారు.


ఈ నెల 21న కేంద్ర మంత్రి అమిత్‌షా సమక్షంలో చేరికలు చేపట్టాలని భావించారు. అయితే చండూరు మండలానికి చెందిన టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు బీజేపీలో చేరుతున్నారని అధికార పార్టీ నేతలకు సమాచారం అందడం, సొంత పార్టీ నుంచి వారిపై ఒత్తిడి పెరగడంతో అమిత్‌షా సభ వరకు ఎదురుచూడకుండా బుధవారమే చేరికల కమిటీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ ఆధ్వర్యంలో కమలం కండువాలు కప్పుకొన్నారు. వారికి ఒక్కొక్కరికి రూ.20 లక్షలకు ఒప్పందం కుదిరినట్లు తెలిసింది. టీఆర్‌ఎస్‌ నుంచి వచ్చిన 10 మంది ప్రజాప్రతినిధులు కండువా కప్పుకున్న వెంటనే బీజేపీ నేతలు నిర్దేశించిన ప్రాంతానికి వారు చేరుకున్నారు. అక్కడ వారికి తలా రూ.10 లక్షల చొప్పున రూ.కోటి అడ్వాన్సుగా అందజేసినట్లు సమాచారం. 


రాజగోపాల్‌ ప్రయత్నాలకు టీఆర్‌ఎస్‌ గండి..

పార్టీలో చేరికలు ఉండడం లేదని స్వయంగా సీఎం కేసీఆర్‌ జిల్లా నేతలను పదేపదే ప్రశ్నిస్తుండడంతో ప్రజాప్రతినిధుల వేటకు కొందరు టీఆర్‌ఎస్‌ నేతలకు ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించారు. వారు.. ఇప్పటిదాకా కాంగ్రెస్‌ ప్రజాప్రతినిధులను పూర్తిస్థాయిలో తన అదుపులో పెట్టుకునేందుకు తాజా మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి చేస్తున్న ప్రయత్నాలకు గండి కొడుతున్నారు. రోజుకు ఇద్దరు, ముగ్గురు చొప్పున తమ వైపునకు లాక్కుంటున్నారు. జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి నియోజకవర్గంలోనే మకాం వేసి వచ్చినవారిని వచ్చినట్టుగా టీఆర్‌ఎ్‌సలోకి ఆహ్వానిస్తున్నారు. మరోవైపు తమ పార్టీ నుంచి వలసలు లేకుండా అసంతృప్తులతో చర్చలు జరుపుతున్నారు. ఈ పరిస్థితిని చూసి సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు బేరానికి దిగుతున్నారు. ‘‘పార్టీ మారాలంటే రూ.50 లక్షలు కావాల్సిందే, అటువైపు నుంచి ఇప్పటికే ఆఫర్‌ ఉంది’’ అని నిర్మొహమాటంగా చెబుతున్నారు. తాజాగా, కాంగ్రెస్‌ నుంచి టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకొన్న సర్పంచ్‌, ఎంపీటీసీలకు తలా రూ.10 లక్షలు, రెండు దళితబంధు యూనిట్లు అందించేందుకు  ఒప్పందం కుదిరినట్లు తెలిసింది. గత పది రోజుల వ్యవధిలో కాంగ్రె్‌సకు చెందిన 10 మంది సర్పంచ్‌లు, ఏడుగురు ఎంపీటీసీలు టీఆర్‌ఎస్‌ కండువా కప్పుకోగా, ఆరుగురు సర్పంచ్‌లు టీఆర్‌ఎస్‌ నుంచి బీజేపీకి వెళ్లారు. రానున్న రెండు రోజుల్లో మరిన్ని చేరికలు ఉన్నట్లు తెలిసింది.


విలవిలలాడుతున్న కాంగ్రెస్‌

అభ్యర్థి ఖరారులో జాప్యం, పెట్టుబడి విషయంలో దిక్కులు చూసే పరిస్థితి నెలకొనడం, రెండు అధికార పార్టీలు ప్రజాప్రతినిధుల వేట ముమ్మరం చేయడంతో వలసల్లో 90 శాతం కాంగ్రెస్‌ నుంచే జరుగుతున్నాయి. గడచిన పది రోజుల్లో కాంగ్రె్‌సకు చెందిన 10మంది సర్పంచ్‌లు, ఏడుగురు ఎంపీటీసీలు పార్టీని వీడిపోగా ఇతర పార్టీల నుంచి ఒక్కరు కూడా కాంగ్రెస్‌ కండువా కప్పుకోకపోవడం స్థానిక పరిస్థితిని తెలియజేస్తోంది. ‘‘అంతటా ప్యాకేజీల వ్యవహారం నడుస్తుండడంతో తల పట్టుకోవడం తప్ప ఏం చేయాలో అర్థం కావడం లేదు’’ అని రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జితో స్థానికంగా పనిచేస్తున్న ఓ కాంగ్రెస్‌ నేత బుధవారం తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు తెలిసింది. ‘‘ఎదుటి పార్టీ నుంచి ఆఫర్‌ ఉంది, మన పరిస్థితి ఏంటి? అంటూ సర్పంచ్‌లు అడుగుతున్నారు.. అలా అడిగిన మరుసటి రోజే టీఆర్‌ఎస్‌ లేదంటే బీజేపీలో చేరిపోతున్నారు, చండూరు మండలంలోని ఓ పంచాయతీకి సర్పంచ్‌గా పోటీ చేసిన మన పార్టీ నేత 25 ఓట్లతో ఓటమి పాలయ్యాడు.. ఎదుటి పార్టీ వారు సర్పంచ్‌కి రూ.20లక్షలు ఇస్తున్నారు. నేను స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యాను. అందులో సగం రూ.10లక్షలు ఇప్పించండి.. లేదంటే అవతలి నుంచి ఒత్తిడి ఉంది’’ అంటూ ఇన్‌చార్జి వద్ద మరో నేత ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘మండల సమావేశానికి 20 మంది రావాలంటే కనీసం తలా రూ.500 చొప్పున రూ.10వేలు ఇవ్వండని, అవతలి పార్టీ వారు మండల సమావేశానికి వెళ్తే ఒక్కొక్కరికి రూ.2వేల నుంచి రూ.3వేలు ఇస్తున్నారంటూ కార్యకర్తలు సైతం డిమాండ్‌ చేస్తున్నారు’’ అని ఓ మండల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌ ఎదుట తనకు ఎదురైన అనుభవాన్ని వివరించినట్లు సమాచారం.

Read more