1.65 కోట్ల విలువైన రద్దయిన నోట్ల పట్టివేత
ABN , First Publish Date - 2022-10-07T09:48:39+05:30 IST
కొన్నేళ్ల క్రితం ఆర్బీఐ రద్దు చేసిన రూ.1.65 కోట్ల విలువైన పాత రూ.1000, రూ.500 కరెన్సీ నోట్లను ములుగు జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
ఎనిమిది మంది అరెస్టు
ములుగు, అక్టోబరు 6: కొన్నేళ్ల క్రితం ఆర్బీఐ రద్దు చేసిన రూ.1.65 కోట్ల విలువైన పాత రూ.1000, రూ.500 కరెన్సీ నోట్లను ములుగు జిల్లా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే వీటిని రవాణా చేస్తున్న ఎనిమిది మందిని అరెస్టు చేశారు. ములుగులోని జిల్లా పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో గురువారం విలేకరుల సమావేశంలో ఎస్పీ సంగ్రామ్‌సింగ్ జి.పాటిల్ ఈ వివరాలను వెల్లడించారు. వెంకటాపురం (నూగూరు) పోలీసులు సీఆర్పీఎఫ్ సిబ్బందితో కలిసి గురువారం ఉదయం వాహనాల తనిఖీ చేస్తున్న క్రమంలో రెండు కార్లలో వచ్చిన కొందరు వ్యక్తులు పోలీసులను గమనించి దూరం నుంచే వెనుదిరిగారు. అప్రమత్తమైన పోలీసులు కార్లను నిలిపి ఎనిమిది మందిని అదుపులోకి తీసుకున్నారు. వాహనాలను తనిఖీ చేయగా అందులో రూ.1.65 కోట్ల విలువ గల రద్దయినరూ.1000, రూ.500 కరెన్సీ నోట్లు లభ్యమయ్యాయి. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న సూర్యాపేట జిల్లాకు చెందిన పప్పు నాగేంద్రబాబు వ్యాపారం కలిసి రాక అప్పుల పాలయ్యాడు.
ఈ క్రమంలో సులభంగా డబ్బు సంపాదించేందుకు తన స్నేహితుడు నాగలింగేశ్వర్రావుతో కలిసి హైదరాబాద్‌కు చెందిన కొందరు వ్యక్తుల నుంచి రూ.1.65 కోట్ల విలువ గల రద్దయిన నోట్లు తీసుకున్నారు. వీటిలో కొన్ని నకిలీ నోట్లు కూడా ఉన్నాయి. మరికొందరితో కలిసి వీటిని మార్చే క్రమంలో అందిన సమాచారం మేరకు పట్టుకున్నట్టు ఎస్పీ తెలిపారు. కరెన్సీతోపాటు పది సెల్ఫోన్లు, రెండు వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ చేసిన నాగేంద్రబాబు, నాగలింగేశ్వర్‌రావు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఆరె సాంబశివరావు, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన రాజన్సింగ్, నారాయణపేట జిల్లాకు చెందిన శివరాజ్ పాటిల్, ఉప్పల్‌కు చెందిన గంట యాదగిరి, సైబరాబాద్‌కు చెందిన రాజాసింగ్, వెంకటాపురం(నూగూరు)కు చెందిన సత్యనారాయణను రిమాండ్‌కు తరలించినట్లు చెప్పారు. రద్దయిన కరెన్సీని ఎక్కడికి, ఎందుకు తరలిస్తున్నారో పోలీసులు వెల్లడించలేదు. విచారణ కొనసాగుతోందని చెప్పారు. సమావేశంలో ఏటూరునాగారం ఏఎస్పీ అశోక్‌కుమార్, వెంకటాపురం ఎస్సై జి.తిరుపతి పాల్గొన్నారు.