121 జీవోపై వీఆర్వోల ఆందోళన
ABN , First Publish Date - 2022-08-04T09:58:35+05:30 IST
జీవో 121 ద్వారా తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, సీనియారిటీని కోల్పోతున్నామని నిరసన వ్యక్తం చేస్తూ వీఆర్వోలు ఆందోళనకు దిగారు.
రంగారెడ్డి కలెక్టరేట్ ముట్టడి
రంగారెడ్డి అర్బన్, ఆగస్టు 3 : జీవో 121 ద్వారా తమకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, సీనియారిటీని కోల్పోతున్నామని నిరసన వ్యక్తం చేస్తూ వీఆర్వోలు ఆందోళనకు దిగారు. తమను ఇతర శాఖలకు కేటాయించడం తగదని, న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ.. బుధవారం రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్‌ను ముట్టడించారు. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై మండిపడ్డారు. న్యాయం జరిగేంత వరకు విశ్రమించేది లేదని ప్రకటించారు. వీఆర్వో వ్యవస్థను రద్దు చేసి 23 నెలల పాటు పోస్టులు, శాఖలు కేటాయించకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన సర్కారు ఇప్పుడు తమ హక్కులను కాల రాసేలా 121 జీవోను విడుదల చేయడం దారుణమని వీఆర్వో సంఘం నాయకులు మండి పడ్డారు. 121 జీవోను సవరించి శాఖలు కేటాయిస్తేనే విధుల్లో చేరతామని, ప్రభుత్వం వినకుండా మొండికేస్తే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని అన్నారు. వీఆర్వోల ఆందోళనకు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మద్దతు పలికారు. వీఆర్వోలపై సర్కార్ వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నిరసన కార్యక్రమంలో కొంత మంది వీఆర్వో లు ప్రభుత్వానికి అనుకూలంగా ఉండగా మరికొద్ది మంది సర్కారుకు వ్యతిరేకంగా వ్యవహరించారు.