12న మునుగోడులో వామపక్షాల బహిరంగ సభ

ABN , First Publish Date - 2022-10-07T09:41:30+05:30 IST

ఈ నెల 12వ తేదీన మునుగోడులో బహిరంగ సభను నిర్వహించాలని వామపక్షాలు నిర్ణయించినట్లు తెలిసింది.

12న మునుగోడులో వామపక్షాల బహిరంగ సభ

  • సమన్వయ కమిటీలు వేసిన టీఆర్‌ఎస్‌, సీపీఎం, సీపీఐ 
  • బీజేపీని ఓడించడమే టార్గెట్‌
  • మంత్రి జగదీ్‌షరెడ్డి కీలక సమావేశం

నల్లగొండ, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): ఈ నెల 12వ తేదీన మునుగోడులో బహిరంగ సభను నిర్వహించాలని వామపక్షాలు నిర్ణయించినట్లు తెలిసింది. ఈ సభ ద్వారా... టీఆర్‌ఎ్‌సకు మద్దతు ఇవ్వడానికి గల కారణాలను ప్రజలకు వివరించాలని వామపక్షాలు భావిస్తున్నాయి అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ అవినీతి, అక్రమాలకు పాల్పడిందని సీపీఎం, సీపీఐలు గతంలో ఆరోపించాయి. ప్రస్తుతం మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో టీఆర్‌ఎస్‌ పార్టీకి మద్దతు ప్రకటించడంతో ఆ పార్టీలపై పలు విమర్శలు, ఆరోపణలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో.. మునుగోడులో తమ వ్యూహాన్ని ప్రజలకు సవివరంగా తెలియజేసేందుకు వామపక్ష నేతలు సమాయత్తం అవుతున్నారు. తాము డబ్బుకు అమ్ముడుపోయి టీఆర్‌ఎ్‌సకు మద్దతు ప్రకటించామన్న ఆరోపణలు వస్తుండటంతో సీపీఎం, సీపీఐ నాయకత్వం అప్రమత్తమైనట్లు తెలిసింది. ఈ సభకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు హాజరుకానున్నారు. ప్రత్యర్థులు చేస్తున్న ఆరోపణలను వామపక్ష నేతలు ఈ సభ ద్వారా తిప్పికొట్టనున్నారు.


 కాగా.. మునుగోడు ఉపఎన్నిక పోలింగ్‌ దగ్గర పడుతుండటంతో విద్యుత్‌  శాఖ మంత్రి గుంటకండ్ల జగదీ్‌షరెడ్డి దసరా పండుగ మరుసటి రోజే నల్లగొండలో సీపీఎం, సీపీఐ నాయకులతో కీలక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా, నియోజకవర్గ స్థాయుల్లో మూడు పార్టీలతో కలిపి సమన్వయ కమిటీలను ఏర్పాటు చేసుకున్నారు. ఉప ఎన్నికలో బీజేపీని ఒంటరిని చేసి, డిపాజిట్లు గల్లంతు చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలని నేతలు నిర్ణయించారు. గతంలో మునుగోడులో ఏ ఎన్నికల్లోనూ బీజేపీకి 15వేలకు మించి ఓట్లు రాలేదని, ఈసారి కూడా డిపాజిట్లు రానివ్వొద్దని మూడు పార్టీలు నిర్ణయించాయి. అలాగే జిల్లా స్థాయి సమన్వయ కమిటీలో టీఆర్‌ఎస్‌ నుంచి మంత్రి జగదీ్‌షరెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్‌రావు, సీపీఎం నుంచి జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు, సీపీఐ నుంచి పల్లా వెంకట్‌రెడ్డి, ఉజ్జిని యాదగిరిరావు ఉన్నారు. ఇక నియోజకవర్గ స్థాయి సమన్వయ కమిటీలో.. సీపీఎం నుంచి ముదిరెడ్డి సుధాకర్‌రెడ్డి జహంగీర్‌, సీపీఐ నుంచి నెల్లికంటి సత్యం, శ్రీరాములు, టీఆర్‌ఎస్‌ నుంచి ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌, కంచర్ల రామకృష్ణారెడ్డిలను నియమించారు.

Updated Date - 2022-10-07T09:41:30+05:30 IST