రూ.1500 కోట్లతో 1060 కొత్త బస్సులు!

ABN , First Publish Date - 2022-04-24T09:12:41+05:30 IST

రాజధాని హైదరాబాద్‌ నుంచి జిల్లా కేంద్రాలు, ముఖ్యపట్టణాలకు ప్రయాణికులను చేరవేయడానికి ఆర్టీసీ 1060 కొత్త బస్సులను సమకూర్చుకోనున్నది. గత నెల సుమారు 600లకు పైగా కాలం చెల్లిన బస్సులను తొలగించినందున సాద్యమైనంత త్వరలో

రూ.1500 కోట్లతో 1060 కొత్త బస్సులు!

  • నిర్వహణ వ్యయం తగ్గించుకోవడంపై దృష్టి పెట్టాలి
  • టీఎస్‌ఆర్టీసీ పాలక మండలి తొలి భేటీలో కీలక నిర్ణయాలు 

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 23 (ఆంధ్రజ్యోతి): రాజధాని హైదరాబాద్‌ నుంచి జిల్లా కేంద్రాలు, ముఖ్యపట్టణాలకు ప్రయాణికులను చేరవేయడానికి ఆర్టీసీ 1060 కొత్త బస్సులను సమకూర్చుకోనున్నది. గత నెల సుమారు 600లకు పైగా కాలం చెల్లిన బస్సులను తొలగించినందున సాద్యమైనంత త్వరలో ఏసీ స్లీపర్‌ కోచ్‌, లగ్జరీ బస్సులను కొనుగోలు చేయాలని.. సంస్థ చైర్మన్‌ బాజిరెడ్డి గోవర్ధన్‌ అధ్యక్షతన జరిగిన టీఎ్‌సఆర్టీసీ పాలకమండలి సమావేశం నిర్ణయించింది. డీజిల్‌ ధరలు విపరీతంగా పెరుగుతున్నందున నిర్వహణ వ్యయాన్ని తగ్గించుకోవడంతో పాటు, కేంద్రం ఇచ్చే సబ్సిడీలను సద్వినియోగం చేసుకునేందుకు ఎలక్ట్రిక్‌ బస్సులకు ప్రాధాన్యం ఇవ్వాలని ఈ భేటీలో నిర్ణయించినట్టు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్‌లో ఆర్టీసీకి ఈ ఏడాది కేటాయించిన రూ.1500 కోట్లతో కొత్త బస్సులను కొనుగోలు చేయనున్నారు. అయితే నిధుల విడుదల ఆలస్యమయ్యే అవకాశం ఉన్నందున జాతీయ బ్యాంకులు, లేదా కేంద్ర సంస్థల నుంచి రుణ సాయం పొంది కొత్త బస్సులు కొనుగోలు చేసి చార్జీల ఆదాయాన్ని పెంచుకోవాలని పాలక మండలి నిర్ణయించినట్టు తెలిసింది. తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి టీఎ్‌సఆర్టీసీ పాలక మండలి సమావేశం జరగని సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో.. 2014-15 నుంచి 2020-21 వరకు వార్షిక ఖాతాలను పాలకమండలి ఇప్పుడు పరిశీలించి ఆమోదించింది.

సమావేశంలో బోర్డు డైరెక్టర్లుగా కార్మిక, ఉపాధి శాఖ ప్రత్యేక కార్యదర్శి రాణి కుముదిని, ఆర్థిక శాఖ కార్యదర్శి కె.రామకృష్ణారావు, రవాణా, రోడ్లుభవనాల శాఖ కార్యదర్శి కెఎస్‌. శ్రీనివా్‌సరాజు, కేంద్ర ప్రభుత్వ  రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ ఐడీఎ్‌సఈ డైరెక్టర్‌ (ట్రాన్స్‌పోర్ట్‌ అండ్‌ ఐసీ) పరే్‌షకుమార్‌ గోయెల్‌, రహదారుల ఇంజనీర్‌ ఇన్‌ చీఫ్‌ పి.రవీందర్‌తో పాటు ఆర్టీసీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వీసీ సజ్జనార్‌ పాల్గొని సుమారు 67 అంశాలపై చర్చించారు. కార్గో పార్సిల్‌ సర్వీ్‌సతో దాదాపు రూ.100 కోట్ల ఆదాయాన్ని సంపాదించడం విశేషంగా పేర్కొన్నారు. తార్నాకలోని సూపర్‌ స్పెషాలిటీ ఆస్పత్రిలో ఆర్టీసీ ఉద్యోగులకే కాకుండా ఇతరులకు వైద్య సేవలు అందించి ఆదాయాన్ని పెంచుకునే ప్రతిపాదనకు సమావేశం ఆమోదం ప్రకటించింది.  


కారుణ్య నియామకాలపై..

ఆర్టీసీలో పని చేస్తూ మరణించిన, అనారోగ్య రీత్యా విధులు నిర్వహించలేని ఉద్యోగుల కుటుంబాల పిల్లల కారుణ్య నియామకాలపై వారం రోజుల్లో  మార్గదర్శకాలను రూపొందించాలని సమావేశం నిర్ణయించింది. మూడు, నాలుగేళ్లుగా నియామకాలు చేపట్టక పోవడంపై ఆందోళనల నేపథ్యంలో.. ప్రాధాన్య క్రమంలో నియామకాలు చేపట్టాలని ప్రతిపాదించినట్టు తెలిసింది.  నిబంధనల మేరకు వీఆర్‌ఎస్‌ అవకాశాన్ని వినియోగించుకోవడంలో ఉద్యోగులకు వెసులుబాటు కొనసాగించాలని తీర్మానించినట్టు తెలిసింది. ఇటీవల పెంచిన డీజిల్‌ సెస్‌, ప్రయాణికుల భద్రత సెస్‌, టోల్‌ సెస్‌, రిజర్వేషన్‌ చార్జీలు, బస్‌పాస్‌ ధరలను సమావేశంలో ఆమోదించినట్టు తెలిసింది. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచుకునే, ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించాలని భేటీలో నిర్ణయించారు. ఈ దిశగా కృషి చేస్తున్న వారిని ప్రోత్సహించాలని కూడా అధికారులకు సూచించారు. ఆర్టీసీ ఆధ్వర్యంలో నడుస్తున్న 22 పెట్రోల్‌ బంక్‌లకు తోడుగా మరో 55 బంక్‌ల ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించినట్టు సమాచారం. ఆర్టీసీ ఖాళీ స్థలాలు, బస్‌ స్టేషన్‌లు, డిపోల్లో ఖాళీ స్థలాలను వాణిజ్య అవసరాలకు వినియోగించేందుకు అభివృద్ధి చేసి ఆదాయం పెంపునకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. 


చైర్మన్‌-ఎండీ స్థాయిలోనే పరిశీలన?

ఆదాయ మార్గాల అన్వేషణ, అమలు అంశాలను బోర్డు దృష్టికి తీసుకురావాలనే నిబంధనలు మినహాయించి.. చైర్మన్‌, ఎండీ స్థాయిలోనే ఆమోదం పలికే అంశాలపై అధ్యయనం చేయాలని బోర్డు యాజమాన్యానికి సూచించినట్టు తెలిసింది. చైర్మన్‌, ఎండీలు కలిసి నిర్ణయం తీసుకునే అధికారాన్ని బోర్డు యాజమాన్యానికి అప్పగిస్తూ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది. దీంతో ఆర్టీసీలో తీవ్ర సమస్యగా మారిన సీసీఎస్‌, ఎస్‌ఆర్‌బీఎస్‌, ఎస్‌బీటి, వీఆర్‌ఎస్‌ వంటి విధానపరమైన నిర్ణయాలు  బోర్డుకు వెళ్లకుండానే ఆమోదం పొందే అవకాశం లభిస్తుందని ఉద్యోగ సంఘాల ప్రతినిధులు పేర్కొన్నారు.

Updated Date - 2022-04-24T09:12:41+05:30 IST