‘అమ్మ’ అదరహో!
ABN , First Publish Date - 2022-04-10T09:12:40+05:30 IST
ఆరు నెలల క్రితమే ఇద్దరు కవలలకు జన్మనిచ్చినా.. తన ఆటలో ఏమాత్రం జోరు తగ్గలేదని నిరూపించింది భారత స్క్వాష్ స్టార్ దీపికా పళ్లికల్ కార్తీక్.

పళ్లికల్ ‘డబుల్’ ధమాకా
రెండు ప్రపంచ టైటిళ్లు కైవసం
వరల్డ్ స్క్వాష్ డబుల్స్ చాంపియన్‌షిప్
న్యూఢిల్లీ: ఆరు నెలల క్రితమే ఇద్దరు కవలలకు జన్మనిచ్చినా.. తన ఆటలో ఏమాత్రం జోరు తగ్గలేదని నిరూపించింది భారత స్క్వాష్ స్టార్ దీపికా పళ్లికల్ కార్తీక్. ప్రతిభకు అమ్మతనం ఏమాత్రం అడ్డు కాదని చాటుతూ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో రెండు పతకాలతో సత్త్తాచాటింది. డబ్ల్యూఎస్‌ఎఫ్ వరల్డ్ స్క్వాష్ డబుల్స్ చాంపియన్‌షిప్‌లో రెండు విభాగాల్లో విజేతగా నిలిచి సంతోషాన్ని ‘డబుల్’ చేసుకుంది. స్కాట్లాండ్లోని గ్లాస్గోలో శనివారం జరిగిన టోర్నీలో సహచరులు జోష్నా చినప్పతో కలిసి మహిళల డబుల్స్, సౌరవ్ ఘోషాల్ జతగా మిక్స్డ్ టైటిల్‌ను పళ్లికల్ సాధించింది. మిక్స్డ్ ఫైనల్లో పళ్లికల్-సౌరవ్ జోడీ 11-6, 11-8తో ఇంగ్లండ్ జంట వాలర్-అలిసన్‌ను చిత్తుచేసింది. మహిళల డబుల్స్ తుదిపోరులో పళ్లికల్-జోష్నా ద్వయం 11-9, 4-11, 11-8తో ఇంగ్లండ్‌కే చెందిన పెర్రీ-అలిసన్ జోడీపై గెలుపొంది స్వర్ణం అందుకుంది. ఈ టోర్నీ చరిత్రలో భారత్ స్వర్ణాలు నెగ్గడం ఇదే తొలిసారి కావడం విశేషం. కాగా పళ్లికల్.. టీమిండియా క్రికెటర్ దినేష్ కార్తీక్ భార్య.