నాన్న కల నెరవేరింది..

ABN , First Publish Date - 2022-05-18T09:24:06+05:30 IST

ప్రపంచ బ్యాడ్మింటన్‌ డబుల్స్‌లో అప్రతిహతంగా దూసుకుపోతున్న యువ కెరటం రంకిరెడ్డి సాత్విక్‌ సాయిరాజ్‌. తాజాగా భారత్‌కు థామస్‌ కప్‌ కల సాకారమవడంలో ముఖ్య భూమిక పోషించిన సాత్విక్‌తో ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూ..

నాన్న కల నెరవేరింది..

ప్రపంచ బ్యాడ్మింటన్‌ డబుల్స్‌లో అప్రతిహతంగా దూసుకుపోతున్న యువ కెరటం రంకిరెడ్డి సాత్విక్‌ సాయిరాజ్‌. తాజాగా భారత్‌కు థామస్‌ కప్‌ కల సాకారమవడంలో ముఖ్య భూమిక పోషించిన సాత్విక్‌తో ఆంధ్రజ్యోతి ఇంటర్వ్యూ..


(ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి-హైదరాబాద్‌)

థామస్‌ కప్‌ విజయాన్ని ఎలా ఆస్వాదిస్తున్నావు?

ఒక చారిత్రక ఘట్టంలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. అంతా ఏదో మాయలా ఉంది. రెండ్రోజులు గడుస్తున్నా ఇంకా హోటల్‌ గదిలోనే కూర్చొని స్వర్ణ పతకాన్ని, కప్‌ను తదేకంగా చూస్తున్నా. నా కెరీర్‌లో సాధించిన విజయాల న్నింటిలో ఇదే గొప్పది. నా ఆటను చూసి యావద్దేశమూ గర్వపడేలా చేయాలన్న మా నాన్న (విశ్వనాథం) కల నెరవేర్చినందుకు ఆనందంగా ఉంది. ట్రోఫీ సాధించిన అనంతరం హోటల్‌ గదికి చేరుకున్నాక ఒక్కసారి గతాన్ని తలుచుకుంటే కన్నీరు ఆగలేదు. చాలా ఉద్వేగానికి లోనై ఏడ్చేశా. అమలాపురం అనే చిన్న పట్టణంలో సిమెంట్‌ కోర్టుపై ఆడిన నేను బ్యాంకాక్‌లో ఒక పెద్ద అంతర్జాతీయ టోర్నీలో హేమాహేమీ ప్లేయర్లతో తలపడడం, ఈ పదేళ్ల ప్రయాణమంతా ఒక మాయలా అనిపిస్తోంది.


గతంలో నువ్వు ఆడిన డబుల్స్‌ భాగస్వామి కృష్ణ ప్రసాద్‌తో కాకుండా ఇప్పుడు చిరాగ్‌తో ఆడడం ఎలా ఉంది?

నా జీవితంలో కృష్ణ ప్రసాద్‌ అనేవాడు లేకపోతే నేను మీ ముందు ఇలా ఉండేవాడిని కాదేమో. కృష్ణ తల్లిదండ్రులు నాకు కూడా అమ్మానాన్నలాంటి వారే. వాళ్లకి ఎప్పటికీ రుణపడి ఉంటా. ఇక, చిరాగ్‌ విషయానికొస్తే అతను నాకు పెద్దన్నలాంటి వాడు. చాలా తక్కువ సమయంలోనే మా మధ్య విడదీయరాని బంధం ఏర్పడింది. వరల్డ్‌ ర్యాంకింగ్స్‌లో ప్రస్తుతం 8వ స్థానంలో ఉన్నాం. త్వరలోనే టాప్‌-5లోకి అడుగుపెట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఈ ఏడాది జరగబోయే కామన్వెల్త్‌ గేమ్స్‌, వరల్డ్‌ చాంపియన్‌షి్‌పలో సత్తా చాటేందుకు ఎదురు చూస్తున్నాం. థామస్‌ కప్‌ విజయం ఆరంభం మాత్రమే. ఇంకా మేము సాధించాల్సింది చాలా ఉంది.


టోర్నీలో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి?

గతంలో థామస్‌ కప్‌లో క్వార్టర్‌ ఫైనల్స్‌కు చేరినప్పుడే ట్రోఫీ సాధిస్తామని అనుకున్నాం. అయితే, చిన్నచిన్న తప్పిదాలతో ఆ మిషన్‌ విఫలమైంది. ఈసారి నూతనోత్తేజం, కొత్త టీమ్‌తో బరిలోకి దిగాం. కెప్టెన్‌ శ్రీకాంత్‌, విదేశీ కోచ్‌ మథియాస్‌ బో కూడా ఎప్పటి కప్పుడు మా తప్పులను సమీక్షిస్తూ ముందుకు నడిపించారు.


    భవిష్యత్‌ లక్ష్యాలేంటి?

ఒలింపిక్స్‌లో పతకం సాధించడమే నా జీవిత లక్ష్యం. అందుకోసం ఎంతైనా కష్టపడతా.  నేను ప్రాక్టీస్‌ చేసిన సిమెంట్‌ కోర్టు ప్రాంగణాన్ని ఉడెన్‌ కోర్టుగా ఆధునీకరించేందుకు సహాయం చేయాలని స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ పెద్దలను కలిసి పలుమార్లు విన్నవించా. కానీ, ఇప్పటివరకు ఆశించిన స్పందనైతే లేదు. దీంతో నేను ఇప్పటివరకు సంపాదించిన మొత్తంలో సగం దాని అభివృద్ధికే ఖర్చు చేశా. ఎలాగైనా సరే త్వరలో దానిని అభివృద్ధి చేసి స్థానిక పిల్లలందరికి ఉచితంగా మంచి కోచింగ్‌ ఇవ్వాలనే మా నాన్న ఆకాంక్షను నెరవేర్చాలి.      

Read more