సెహ్వాగ్ వడాపావ్ ట్వీట్‌‌పై రోహిత్ అభిమానుల ఆగ్రహం

ABN , First Publish Date - 2022-04-08T01:00:57+05:30 IST

టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో ఎంత చురుగ్గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు...

సెహ్వాగ్ వడాపావ్ ట్వీట్‌‌పై రోహిత్ అభిమానుల ఆగ్రహం

పూణె: టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ సోషల్ మీడియాలో ఎంత చురుగ్గా ఉంటాడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అతడి ట్వీట్లు విపరీతంగా వైరల్ అవుతుంటాయి. అయితే, తాజాగా అతడు చేసిన ట్వీట్ మాత్రం తీవ్ర విమర్శలకు కారణమైంది. కోల్‌కతా చేతిలో ముంబై ఓటమి నేపథ్యంలో ‘వడా పావ్’ అంటూ చేసిన ట్వీట్ వివాదాస్పదమైంది. బుధవారం ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌‌లో పెను విధ్వంసం సృష్టించిన కేకేఆర్ ఆటగాడు పాట్ కమిన్స్‌ను, ఆ జట్టును అభినందిస్తూ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. 


ముంబైవాసులు ‘వడాపావ్’ను ఎంతగానో ఇష్టపడతారు. ఈ నేపథ్యంలో దానిని ఉదహరిస్తూ.. ముంబై ఆటగాళ్ల నుంచి వడా పావ్‌ను లాగేసుకున్నట్టుగా ఉందని సెహ్వాగ్ పేర్కొన్నాడు. ‘‘నోటి దగ్గర ముద్ద లాగేసుకున్నట్టు ఉంది.. క్షమించండి, వడాపావ్‌ను లాగేసుకున్నట్టుగా ఉంది. క్లీన్ హిట్టింగ్‌లో అత్యంత గొప్ప ప్రదర్శనల్లో ఇదొకటి, 15 బంతుల్లో 56’’ అని సెహ్వాగ్ ఆ ట్వీట్‌లో పేర్కొన్నాడు. 

 

సెహ్వాగ్ ఈ ట్వీట్ చేశాడో, లేదో అలా వివాదాస్పదమైంది. ముఖ్యంగా రోహిత్ శర్మ అభిమానులు ఆ పోలికను జీర్ణించుకోలేకపోతున్నారు. సెహ్వాగ్‌పై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. దీంతో దిగొచ్చిన సెహ్వాగ్.. తన ట్వీట్‌పై క్లారిటీ ఇస్తూ మరో ట్వీట్ చేశాడు. శాంతించాలంటూ రోహిత్ అభిమానులను కోరాడు. ముంబైని ఉద్దేశించి వడా పావ్‌ను వాడానని చెప్పుకొచ్చాడు. రోహిత్‌శర్మ బ్యాటింగ్‌కు తాను చాలా మంది కంటే పెద్ద అభిమానినని సెహ్వాగ్ వివరణ ఇచ్చాడు. 

Read more