Virat Kohli: బంగ్లాపై సెంచరీతో విరాట్ కోహ్లీ సొంతమైన సంచలన రికార్డ్.. చాన్నాళ్ల తర్వాత కోహ్లీ కళ్లలో సంతోషం !
ABN , First Publish Date - 2022-12-10T16:48:52+05:30 IST
బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా (Bangladesh Vs India) మధ్య మూడో వన్డేలో కింగ్ విరాట్ కోహ్లీ (Virat kohli) వన్డే కెరియర్‌లో 44వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేవలం 85 బంతుల్లోనే శతకాన్ని బాదాడు.
చట్టొగ్రామ్: బంగ్లాదేశ్ వర్సెస్ ఇండియా (Bangladesh Vs India) మధ్య మూడో వన్డేలో కింగ్ విరాట్ కోహ్లీ (Virat kohli) వన్డే కెరియర్‌లో 44వ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కేవలం 85 బంతుల్లోనే శతకాన్ని బాదాడు. మొత్తం 91 బంతులు ఎదుర్కొని 11 ఫోర్లు, 2 భారీ సిక్సర్ల సాయంతో 113 పరుగుల వద్ద వెనుదిరిగాడు. ఫలితంగా అంతర్జాతీయ క్రికెట్ కెరియర్‌లో 72వ సెంచరీని నమోదు చేశాడు. దీంతో ఇంటర్నేషనల్ క్రికెట్ చరిత్రలో అత్యధిక సెంచరీలు సాధించిన ఆటగాళ్ల జాబితాలో ఆసిస్ మాజీ దిగ్గజం రికీ పాంటింగ్‌ను (71 సెంచరీలు) అధిమించాడు. మొత్తం 100 సెంచరీలతో అగ్రస్థానంలో ఉన్న సచిన్ తెందుల్కర్ తర్వాతి స్థానానికి కోహ్లీ చేరుకున్నాడు.
వన్డే క్రికెట్‌లో సచిన్ పేరిట 49 సెంచరీలు ఉన్నాయి. సచిన్‌ను చేరువయ్యేందుకు కోహ్లీ ఇంకా 5 శతకాలు వెనుకబడి ఉన్నాడు. కోహ్లీ రికార్డును బీసీసీఐ ట్విటర్ వేదికగా వెల్లడించింది. బంగ్లాదేశ్‌పై మూడవ వన్డేల్లో 85 బంతుల్లోనే కోహ్లీ సెంచరీ కొట్టాడని, వన్డేల్లో అతడికిది 44వ శతకమని వెల్లడించింది. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు కొట్టిన వ్యక్తుల్లో రికీ పాంటింగ్‌ను అధిగమించాడని బీసీసీఐ వెల్లడించింది. మరోవైపు 50కిపైగా సెంచరీలతో మూడు క్రికెట్ ఫార్మాట్లలోనూ 50కిపైగా సగటు కలిగివున్న ఏకైక క్రికెటర్‌గా విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు. ఆస్ట్రేలియా క్రికెటర్ స్టీవ్ స్మిత్‌కు 50కిపైగా సగటు ఉన్నప్పటికీ అంతర్జాతీయ క్రికెట్‌లో అతడికి 41 సెంచరీలు మాత్రమే ఉన్నాయి.
చాన్నాళ్ల తర్వాత కోహ్లీ కళ్లలో సంతోషం..
బంగ్లాదేశ్‌పై సాధించిన సెంచరీ విరాట్ కోహ్లీకి ఎంతో ప్రత్యేకమైనది. ఎందుకంటే దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత మళ్లీ ఇప్పుడే శతకం చేశాడు. చివరిగా ఆగస్టు 2019లో వెస్టిండీస్‌పై వన్డే సెంచరీ నమోదు చేశాడు. ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు సెంచరీ నమోదు చేశాడు. 10 సార్లు 50కిపైగా రన్స్ కొట్టాడు. కానీ సెంచరీ నమోదు చేయలేకపోయాడు. కాగా ఈ ఏడాది ఆఫ్ఘానిస్తాన్‌పై సెంచరీ కొట్టినప్పటికీ.. అది ట్వీ20 ఫార్మాట్‌లో జరిగిన ఆసియా కప్‌లో సాధించింది. దీంతో చాలాకాలం తర్వాత వన్డేల్లో బంగ్లాదేశ్‌పై సెంచరీ తర్వాత కోహ్లీ ఆనందంతో మురిసిపోయాడు. చాన్నాళ్ల తర్వాత కళ్లలో సంతోషం కనిపించింది.