విరాట్‌ కాదు రాహుల్‌

ABN , First Publish Date - 2022-09-19T09:40:04+05:30 IST

ఇటీవలి ఆసియాకప్‌లో స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ ఓపెనర్‌గా బరిలోకి దిగి అదరగొట్టాడు. చాన్నాళ్లుగా వేధిస్తున్న సెంచరీ కొరతను కూడా ఇదే టోర్నీలో తీర్చేసుకున్నాడు.

విరాట్‌ కాదు రాహుల్‌

2022 వరల్డ్‌కప్‌ ఓపెనింగ్‌పై రోహిత్‌ శర్మ


మొహాలీ: ఇటీవలి ఆసియాకప్‌లో స్టార్‌ బ్యాటర్‌ విరాట్‌ కోహ్లీ ఓపెనర్‌గా బరిలోకి దిగి అదరగొట్టాడు. చాన్నాళ్లుగా వేధిస్తున్న సెంచరీ కొరతను కూడా ఇదే టోర్నీలో తీర్చేసుకున్నాడు. దీంతో వచ్చే నెలలో జరిగే టీ20 ప్రపంచక్‌పలోనూ అతడితోనే ఇన్నింగ్స్‌ ఆరంభించాలన్న డిమాండ్‌ ఊపందుకుంది. ఆ మధ్య కేఎల్‌ రాహుల్‌కు సైతం ఇదే ప్రశ్న ఎదురైంది. అయితే కెప్టెన్‌ రోహిత్‌ శర్మ మాత్రం మెగా టోర్నీలో తనతోపాటు రాహులే ఓపెనింగ్‌ చేస్తాడని ప్రకటించాడు. కోహ్లీ తమకు మూడో ఓపెనర్‌గా అందుబాటులో ఉంటాడని తేల్చాడు. జట్టులోని ప్రతీ ఆటగాడి పాత్రపై టీమ్‌ మేనేజ్‌మెంట్‌కు స్పష్టత ఉందని చెప్పాడు. మంగళవారం మొహాలీలో ఆసీ్‌సతో మూడు టీ20ల సిరీస్‌ ఆరంభం కానుంది. ఈ నేపథ్యంలో అతడు విలేకరుల సమావేశంలో పాల్గొన్నాడు.


‘మన ఎదుట చాలా ఆప్షన్లు ఉండడం మంచిదే. ప్రపంచక్‌పలాంటి పెద్ద టోర్నీకి ముందు ఇలా ఏ స్థానంలోనైనా బరిలోకి దిగే ఆటగాళ్లతో జట్టుకు ప్రయోజనమే. అంతేకానీ మేం ప్రయోగాలకు దిగితే జట్టులో ఏదో సమస్య ఉందని అనుకోకూడదు. ఇక విరాట్‌ రూపంలో మాకు మూడో ఓపెనర్‌ అందుబాటులో ఉన్నాడు. కొన్ని మ్యాచ్‌ల్లో అతడు ఇన్నింగ్స్‌ ఆరంభించే అవకాశం కూడా ఉంది. నిజానికి మేం ప్రత్యేకంగా మూడో ఓపెనర్‌ను జట్టులోకి తీసుకోలేదు. టీ20 ప్రపంచక్‌పలో మాత్రం ఎలాంటి ప్రయోగాలూ చేయదలుచుకోలేదు. నేను, రాహుల్‌ ఓపెనర్లుగా బరిలోకి దిగుతాం. కేఎల్‌ ఆటపై మేం పూర్తి స్పష్టతతో ఉన్నాం. అతడో అద్భుత ఆటగాడు’ అని రోహిత్‌ వివరించాడు. అలాగే కరోనా బారిన పడిన పేసర్‌ షమి స్థానంలో ఉమేశ్‌ యాదవ్‌ను జట్టులోకి తీసుకున్న విషయం తెలిసిందే. ప్రసిద్ధ్‌ గాయంతో బాధపడుతుండగా.. సిరాజ్‌ కౌంటీల్లో ఆడుతున్నాడని, అవేశ్‌ ఇంకా అనారోగ్యం నుంచి కోలుకోకపోవడంతో ఉమేశ్‌ను ఎంపిక చేసినట్టు తెలిపాడు. 


జోరుగా ప్రాక్టీస్‌

ఆస్ట్రేలియాతో మూడు టీ20ల సిరీస్‌ కోసం భారత జట్టు శనివారం రాత్రి మొహాలీ చేరుకుంది. అనంతరం ఆదివారం పీసీఏ స్టేడియంలో జట్టు నెట్‌ సెషన్‌లో పాల్గొంది. అందరికన్నా ముందే వచ్చిన కోహ్లీ 45 నిమిషాలపాటు మైదానంలో చెమటోడ్చాడు. పేస్‌, స్పిన్‌ బౌలింగ్‌లో భారీ షాట్లను ప్రాక్టీస్‌ చేస్తూ కనిపించాడు. జట్టు వ్యూహానికి తగ్గట్టుగా ఆసియాక్‌పలో కోహ్లీ ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించి ఆకట్టుకున్నాడు.


మొహాలీ స్టాండ్స్‌కు యువీ, భజ్జీ పేర్లు

భారత మాజీ ఆటగాళ్లు యువరాజ్‌ సింగ్‌, హర్భజన్‌ సింగ్‌లకు అరుదైన గౌరవం దక్కనుంది. స్థానిక స్టేడియంలోని సౌత్‌ పెవిలియన్‌కు భజ్జీ, నార్త్‌ పెవిలియన్‌కు యువీ పేర్లను పెడుతున్నట్టు పంజాబ్‌ క్రికెట్‌ సంఘం (పీసీఏ) పేర్కొంది. మంగళవారం మ్యాచ్‌కు ముందు వీటిని ఆవిష్కరించనున్నారు. 

Read more