ఆర్సీబీ కెప్టెన్సీని అందుకే వదిలేశా: బయటపెట్టిన కోహ్లీ

ABN , First Publish Date - 2022-02-24T22:41:23+05:30 IST

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఏళ్ల తరబడి సారథ్యం వహించిన

ఆర్సీబీ కెప్టెన్సీని అందుకే వదిలేశా: బయటపెట్టిన కోహ్లీ

బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఏళ్ల తరబడి సారథ్యం వహించిన విరాట్ కోహ్లీ గత సీజన్‌లో ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచాడు. టీమిండియా వన్డే కెప్టెన్సీ నుంచి కోహ్లీని తొలగించడానికి ముందు భారత జట్టు టీ20 కెప్టెన్సీ నుంచి కూడా తప్పకున్నాడు.


దక్షిణాఫ్రికా పర్యటనలో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 1-2తో కోల్పోయిన తర్వాత టెస్టు కెప్టెన్సీకి కూడా కోహ్లీ రాంరాం చెప్పేశాడు. దీంతో ఇప్పుడు ఇటు ఇండియా జాతీయ జట్టుతోపాటు అటు బెంగళూరు జట్టులోనూ సాధారణ ఆటగాడిగా మారిపోయాడు. 


ఆర్సీబీ కెప్టెన్సీ నుంచి తప్పుకోవడంపై తాజాగా కోహ్లీ మాట్లాడుతూ.. క్రికెటర్లు తీసుకునే నిర్ణయాలు బయటివాళ్లు అర్థం చేసుకోవడం కష్టమని అన్నాడు. తన నిర్ణయం చుట్టూ అల్లుకున్న ఊహాగానాలను కొట్టిపడేశాడు. తాను ఎంత చేయగలనో అంతే చేస్తానని, అంతకుమించిన వాటిని పట్టుకుని ఊగిసలాడే వ్యక్తిని కాదని అన్నాడు. తాను ఇంకా ఎక్కువ చేయగలనని తనకు తెలిసినప్పటికీ దానిని తాను ఆస్వాదించనట్టయితే ఆ పని చేయబోనని కోహ్లీ స్పష్టం చేశాడు.


ప్రజలు మీ పరిస్థితిలో ఉంటే తప్ప మీరు తీసుకునే నిర్ణయాలను అర్థం చేసుకోవడం చాలా కష్టమని, ఎందుకంటే వారి అంచనాలు, అభిప్రాయాలు వారికి ఉంటాయని చెప్పుకొచ్చాడు. నిజానికి ఈ విషయంలో షాక్ కావడానికి ఏమీ ఉండదని అన్నాడు. తనకు కొంత స్పేస్ కావాలని, తన పనిభారాన్ని నిర్వహించుకోవాలనుకుంటున్నానని కాబట్టి అక్కడితే ఆ కథ ముగిసిందని కోహ్లీ వివరించాడు.  

Updated Date - 2022-02-24T22:41:23+05:30 IST