TCSA : 30న తెలంగాణ క్రాస్బో షూటింగ్ అసోసియేషన్ ప్రారంభం
ABN , First Publish Date - 2022-07-28T22:55:05+05:30 IST
ఈ నెల 30న తెలంగాణ క్రాస్బో షూటింగ్ అసోసియేషన్ (Telangana CrossBow Shooting Assosiation) ప్రారంభంకానుంది.

హైదరాబాద్ : ఈ నెల 30న తెలంగాణ క్రాస్బో షూటింగ్ అసోసియేషన్ (Telangana CrossBow Shooting Assosiation) (TCSA) ప్రారంభంకానుంది. హైదరాబాద్(Hyderabad)లోని లాల్‌బహుదుర్ శాస్త్రీ స్టేడియం వేదికగా శనివారం ఉదయం 10 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్(Minister Srinivas Goud) ముఖ్యఅతిథిగా హాజరుకానున్నారు. ప్రత్యేక గౌరవ అతిథులుగా సందీప్ కుమార్ సుల్తానియా(యూత్ అడ్వాన్స్మెంట్ టూరిజం, కల్చర్ డిపార్ట్మెంట్ సెక్రటరీ), ఏ. వెంకటేశ్వర్ రెడ్డి(స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ చైర్మన్), రజత్ విజ్(ఇండియన్ క్రాస్బో షూటింగ్ అసోసియేషన్ ఫౌండర్, ప్రెసిడెంట్), సీవీ ఆనంద్( హైదరాబాద్ సిటీ కమిషనర్) విచ్చేయనున్నారు. గౌరవ అతిథులుగా హినా విజ్, వీవీ లక్ష్మీనారాయణ, ఎంఎన్ రావు, జీ. అనూహ్య రెడ్డి, కుమారి ఈషా సింగ్, వేదాంతం నరసింహ మూర్తి, మేజర్ పద్మజ హాజరుకానున్నారు. ప్రత్యేక వీఐపీ అతిథులుగా ఎస్వీ సూర్య ప్రకాష్ రావు, ఇండియా వెల్ది, అనురాధ చౌదరి, జీఐ రాజు, ఉషా రాణి, అచ్యుత్ రావు, గుండవజ్జుల జ్యోతిర్మయి, హనుమంత్ రావు, ఇగునె జార్జి, మంజుల, డా.మ్యాక్స్‌వెల్ ట్రెవొర్, ఫవాజ్ ముక్రీ, పీవీ రమణ రావు, జయసుధ ఆరంభ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ విషయాన్ని తెలంగాణ క్రాస్బో షూటింగ్ అసోసియేషన్ స్థాపకురాలు, ప్రెసిడెంట్ ఎం లక్ష్మి చైతన్య ప్రకటించారు.
క్రాస్బౌ ప్రత్యేకత ఇదీ..
భారత జాతీయ క్రీడల్లో క్రాస్బౌ ఒకటి. చైనా, యూరప్ దేశాల్లో 6వ శతాబ్దం నుంచి కొనసాగుతోంది. క్రాస్బౌ షూటింగ్ అనేది ఆర్చరీకి సమకాలీన వెర్షన్, అంతర్జాతీయ క్రీడగా కూడా గుర్తింపు పొందింది. క్రీస్తుపూర్వం 6వ శతాబ్దానికి ముందు చైనా మొదటి ‘క్రాస్బౌ’ను తయారు చేసింది. ఇది రైఫిల్, బోల కలయికగా ఉంటుంది. వరల్డ్ క్రాస్బౌ ఫెడరేషన్ ఈ గేమ్‌ను ఆసియా దేశాల్లో వ్యాప్తింపజేయడం ప్రారంభించింది. క్రీడను ఒలింపిక్స్‌లోకి ప్రవేశించేలా చేయడమే దీనివెనుకున్న ఉద్దేశ్యం. ఇక భారత దేశ విషయానికి వస్తే.. రజత్ విజ్, హీనా విజ్‌లు తమ మద్దతుతో భారతదేశంలో క్రాస్బౌ క్రీడను ప్రారంభించారు. లక్ష్మీ చైతన్య తన ఉత్సాహభరితమైన బోర్డు సభ్యుల మద్దతుతో తెలంగాణలో ఈ క్రీడను ప్రారంభించబోతున్నారు. ఆమె టీసీఎస్ఏ వ్యవస్థాపకురాలు, ప్రస్తుతం అధ్యక్షురాలు. జాతీయ క్రాస్బౌ షూటింగ్లో తెలంగాణ నుంచి బంగారు పతకాన్ని సాధించిన తొలి మహిళా క్రీడాకారిణి కూడా ఆమె. జాతీయ స్థాయిలో పతకం సాధించడంలో తన కుటుంబం ఎల్లప్పుడూ ఎంతో సపోర్ట్ చేసిందని ఆమె అన్నారు.
ప్రసిద్ధిగాంచిన రజత్ విజ్ ఐసీఎస్ఏ జాతీయ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. వరల్డ్ క్రాస్బౌ షూటింగ్ అసోసియేషన్ (WCSA) ఆసియా డెవలప్మెంట్ ఆఫీసర్ అయిన తొలి ఇండియన్ కూడా రజత్ కావడం గమనార్హం. ప్రస్తుతం శ్రీలంక, నేపాల్, మలేషియా, ఇండోనేషియా, థాయిలాండ్, చైనా వంటి ఆసియా ప్రాంతంలో క్రాస్బో షూటింగ్ క్రీడలను అభివృద్ధికి కృషిచేస్తున్నరాు. రజత్ 2013 నుంచి 2016 వరకు 4 ఏళ్లపాటు వరల్డ్ ఛాంపియన్‌గా నిలిచారు. హీనా ఐసీఎస్ఏ ఉపాధ్యక్షురాలిగా ఉన్నారు. దేశంలో క్రాస్బౌ క్రీడలకు సంబంధించి ఆమె గుర్తింపుపొందారు. 7వ ప్రపంచ క్రాస్బౌ షూటింగ్ ఛాంపియన్షిప్- 2015 గెలిచి వరల్డ్ క్రాస్బౌ ఛాంపియన్‌గా నిలిచిన మొదటి భారతీయ మహిళగా గుర్తింపు పొందారు. తెలంగాణలో మొదటిసారిగా ప్రారంభమయ్యే ఈ క్రీడను ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సహకారం అందిస్తుందని మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్, శాట్ చైర్మన్ ఏ వెంకటేశ్వర్ రెడ్డి తెలియచేశారు.