ఉప్పల్‌లో ఊపేశారు

ABN , First Publish Date - 2022-09-26T10:08:15+05:30 IST

ఉప్పల్‌లో ఊపేశారు

ఉప్పల్‌లో ఊపేశారు

చెలరేగిన సూర్యకుమార్‌, కోహ్లీ 

భారత్‌దే సిరీస్‌ 

 చివరి టీ20లో ఆసీస్‌పై విజయం


మూడు టీ20ల సిరీస్‌కు అదిరిపోయే ముగింపు.. టిక్కెట్ల కోసం అష్టకష్టాలు పడి ఎలాగో స్టేడియంలోకి వెళ్లిన ప్రేక్షకులతో పాటు టీవీల్లో తిలకించిన వీక్షకులకు కూడా ఈ పోరు ఉర్రూతలూగించింది. మొదట కామెరూన్‌ గ్రీన్‌ వీర బాదుడుకు ఆసీస్‌ స్కోరు పట్టపగ్గాల్లేకుండా సాగినా.. మధ్యలో స్పిన్నర్లు చాహల్‌, అక్షర్‌ ముకుతాడు వేశారు. అయినా డెత్‌ ఓవర్లలో డేవిడ్‌ హిట్టింగ్‌తో గట్టి స్కోరే అందుకుంది. ఇక భారత్‌ ఇన్నింగ్స్‌ ఆదిలోనే ఓపెనర్లు అవుట్‌ కావడంతో ఒక్కసారిగా స్తబ్ధత నెలకొంది. కానీ సూర్యకుమార్‌, విరాట్‌ కోహ్లీ వహ్వా అనే రీతిలో చెలరేగారు. ప్రతీ బౌలర్‌ను చెండాడుతూ సునాయాసంగా ఛేదన వైపు సాగారు. ఆఖరి ఓవర్‌లో కాస్త హైడ్రామా నెలకొన్నా హార్దిక్‌ ఫోర్‌తో ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చి అభిమానులను మురిపించాడు. 


హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి క్రీడాప్రతినిధి): ఆస్ట్రేలియాతో జరిగిన మూడో టీ20లో భారత్‌ ఆరు వికెట్ల తేడాతో గెలిచింది. ఆదివారం ఉప్పల్‌లో జరిగిన ఈ ఉత్కంఠభరిత మ్యాచ్‌లో సూర్యకుమార్‌ యాదవ్‌ (36 బంతుల్లో 5 ఫోర్లు, 5 సిక్సర్లతో 69), విరాట్‌ కోహ్లీ (48 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 63) కీలక అర్ధసెంచరీలతో ఆదుకున్నారు. దీంతో నిర్ణాయక మ్యాచ్‌లో గెలిచిన భారత్‌ 2-1తో సిరీస్‌ దక్కించుకుంది. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్‌ 20 ఓవర్లలో 7 వికెట్లకు 186 పరుగులు చేసింది. టిమ్‌ డేవిడ్‌ (27 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 54), కామెరూన్‌ గ్రీన్‌ (21 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 52) తుఫాన్‌ ఇన్నింగ్స్‌తో అలరించారు. అక్షర్‌కు మూడు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో భారత్‌ 19.5 ఓవర్లలో 4 వికెట్లకు 187 పరుగులు చేసి నెగ్గింది. హార్దిక్‌ (25 నాటౌట్‌) ఆకట్టుకున్నాడు. సామ్స్‌కు 2 వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా సూర్యకుమార్‌, మ్యాన్‌ ఆఫ్‌ ద సిరీ్‌సగా అక్షర్‌ పటేల్‌ నిలిచారు.


సూర్య, విరాట్‌ శతక భాగస్వామ్యంతో..: భారీ ఛేదన కోసం బరిలోకి దిగిన భారత్‌కు ఆదిలోనే ఝలక్‌ తగిలింది. తొలి  ఓవర్‌లోనే ఓపెనర్‌ రాహుల్‌ (1) వికెట్‌ను కోల్పోగా.. వేగంగా ఆడే క్రమంలో రోహిత్‌ (17) ఓ పుల్‌ షాట్‌ ఆడి సామ్స్‌కు క్యాచ్‌ ఇచ్చాడు. దీంతో 30/2 స్కోరుతో జట్టు ఇబ్బందిపడిన దశలో సూర్యకుమార్‌, కోహ్లీ కదం తొక్కడంతో భారత్‌ జోరు తగ్గకుండా సాగింది. ఆరో ఓవర్‌లో కోహ్లీ 6,4తో పవర్‌ప్లేలో జట్టు 50 పరుగులు సాధించింది. అయితే మధ్య ఓవర్లలోనూ రన్‌రేట్‌ ఏమాత్రం తగ్గకుండా ఈ జోడీ ఆడడం ఫలితాన్నిచ్చింది. సూర్య 8వ ఓవర్‌లో రెండు ఫోర్లతో టచ్‌లోకి వచ్చి మరిక తగ్గలేదు. మరుసటి ఓవర్‌లోనే కోహ్లీ సిక్సర్‌, సూర్య ఫోర్‌తో 14 రన్స్‌ చేరాయి. ఇక 13వ ఓవర్‌లో సూర్య రెండు భారీ సిక్సర్లతో 29 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. ఆ తర్వాత కూడా మరో 4,6తో చెలరేగినా హాజెల్‌వుడ్‌కు చిక్కాడు. దీంతో మూడో వికెట్‌కు 104 పరుగుల భాగస్వామ్యం ముగిసింది. సూర్య నిష్క్రమణతో స్కోరు నెమ్మదించింది. అటు కోహ్లీ 37 బంతుల్లో హాఫ్‌ సెంచరీ చేశాడు. 


చివర్లో ఉత్కంఠ: 18, 19 ఓవర్లలో మొత్తం 21 పరుగులు రావడంతో ఆఖరి ఓవర్‌లో సమీకరణం 11 పరుగులకు చేరింది. ఇది సులువుగానే అనిపించినా ఉత్కంఠ తప్పలేదు. ఎందుకంటే.. తొలి బంతిని సిక్సర్‌గా మలిచిన కోహ్లీ రెండో బంతికే అవుట్‌ కావడంతో ఒక్కసారిగా స్టేడియంలో నిశ్శబ్దం నెలకొంది. దీనికి తోడు ఆ తర్వాత రెండు బంతుల్లో ఒక్క పరుగే వచ్చింది. ఇక రెండు బంతుల్లో 4 రన్స్‌ అవసర పడగా.. ఏం జరుగుతుందోననిపించింది. కానీ వైడ్‌గా వెళుతున్న ఐదో బంతికి హార్దిక్‌ బ్యాట్‌ ఎడ్జ్‌ తాకించడంతో షార్ట్‌ థర్డ్‌మ్యాన్‌ దిశగా ఫోర్‌ వచ్చింది. ఆ వెంటనే స్టేడియంలో సంబరాలు మిన్నంటాయి.  


గ్రీన్‌ ధనాధన్‌: 12, 11, 17, 16.. ఓపెనర్‌ కామెరూన్‌ గ్రీన్‌ బాదుడుకు తొలి నాలుగు ఓవర్లలో ఆస్ట్రేలియా సాధించిన పరుగులివి. ప్రతీ బంతిని బలంగా బాదాలనే కసితో అతడు క్రీజులో కదం తొక్కాడు. ఈ సమయంలో తను ఏకంగా 8 ఫోర్లు, 3 సిక్సర్లు బాదాడు. అటు మరో ఓపెనర్‌ ఫించ్‌ (5) నాలుగో ఓవర్‌లో అక్షర్‌ చేతిలో అవుటైనా.. గ్రీన్‌ హ్యాట్రిక్‌ ఫోర్లతో చెలరేగాడు. ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌లోనే గ్రీన్‌ సిక్స్‌, ఫోర్‌తో పరుగుల వరదకు తెర లేపాడు. ఈ జోరుతో అతడు 19 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసుకున్నాడు. కానీ ఐదో ఓవర్‌లో బ్యాక్‌వర్డ్‌ పాయింట్‌లో రాహుల్‌కు క్యాచ్‌ ఇవ్వడంతో గ్రీన్‌ ఊచకోతకు బ్రేక్‌ పడింది. భువీ ఈ వికెట్‌ తీశాడు. 


స్పిన్నర్ల తడాఖా: పవర్‌ప్లేలో 66 పరుగులతో జోరు మీద  కనిపించిన ఆసీస్‌ ఆట తర్వాత నెమ్మదించింది. స్పిన్నర్‌ చాహల్‌, అక్షర్‌ల అద్భుత బంతులకు పరుగుల కోసం చెమటోడ్చడంతో పాటు వికెట్లను కూడా వేగంగా కోల్పోయింది. అక్షర్‌ ఓవర్‌లో వరుసగా ఐదు డాట్‌ బాల్స్‌ను ఆడిన మ్యాక్స్‌వెల్‌ (6) రనౌట్‌ కాగా, కాసేపటికే చాహల్‌ గూగ్లీకి స్మిత్‌ (9) వెనుదిరిగాడు. ఈ దశలో డేవిడ్‌తో కలిసి ఇన్‌గ్లి్‌స (24) ఆదుకునే ప్రయత్నం చేసి ఐదో వికెట్‌కు 31 పరుగులు జోడించాడు. కానీ 14వ ఓవర్‌లో అక్షర్‌ ఆసీ్‌సకు గట్టి షాక్‌ ఇచ్చాడు. కుదురుగా ఆడుతున్న ఇన్‌గ్లి్‌సతో పాటు ప్రమాదకర మాథ్యూ వేడ్‌ (1)ను అవుట్‌ చేయడంతో భారత్‌ శిబిరంలో సంబరం నెలకొంది. 

డెత్‌ ఓవర్లలో అదే తీరు..: 15 ఓవర్లు ముగిసేసరికి ఆసీస్‌ స్కోరు కేవలం 123/6. కానీ డేవిడ్‌, సామ్స్‌ ధాటికి డెత్‌ ఓవర్లలో పేసర్లు భువీ, బుమ్రా చేతులెత్తేశారు. 16వ ఓవర్‌లో డేవిడ్‌ 6,4తో 11 రన్స్‌ సాధించి స్కోరులో కదలిక తెచ్చాడు. ఇక భువీ వేసిన 18వ ఓవర్‌లో డేవిడ్‌ వరుసగా 6,6,4తో 21 రన్స్‌ రాబట్టడంతో స్కోరు 160 దాటేసింది. 19వ ఓవర్‌లో సామ్స్‌ 6,4తో బుమ్రా 18 రన్స్‌ ఇచ్చుకున్నాడు. ఆఖరి ఓవర్‌లో డేవిడ్‌ సిక్సర్‌తో 25 బంతుల్లో కెరీర్‌లో తొలి ఫిఫ్టీ పూర్తి చేసినా హర్షల్‌ చేతిలో అవుటయ్యాడు. ఈ ఓవర్‌లో అతడు ఏడు పరుగులే ఇవ్వగా.. అప్పటికే ఏడో వికెట్‌కు 34 బంతుల్లోనే 68 పరుగులు రావడంతో ఆసీస్‌ సవాల్‌ విసిరే స్కోరును సాధించింది.


 స్కోరుబోర్డు

ఆస్ట్రేలియా: గ్రీన్‌ (సి) రాహుల్‌ (బి) భువనేశ్వర్‌ 52, ఫించ్‌ (సి) హార్దిక్‌ (బి) అక్షర్‌ 7, స్మిత్‌ (స్టంప్డ్‌) కార్తీక్‌ (బి) చాహల్‌ 9, మ్యాక్స్‌వెల్‌ (రనౌట్‌/అక్షర్‌) 6, ఇన్‌గ్లిస్‌ (సి) రోహిత్‌ (బి) అక్షర్‌ 24, డేవిడ్‌ (సి) రోహిత్‌ (బి) హర్షల్‌ 54, వేడ్‌ (సి అండ్‌ బి) అక్షర్‌ 1, సామ్స్‌ (నాటౌట్‌) 28, కమిన్స్‌ (నాటౌట్‌) 0, ఎక్స్‌ట్రాలు 5, మొత్తం 20 ఓవర్లలో 186/7 వికెట్లపతనం : 1/44, 2/62, 3/75, 4/84, 5/115, 6/117, 7/185 బౌలింగ్‌: భువనేశ్వర్‌ 3-0-39-1, అక్షర్‌ 4-0-33-3, బుమ్రా 4-0-50-0, హార్దిక్‌ 3-0-23-0, చాహల్‌ 4-0-22-1, హర్షల్‌ 2-0-18-1


భారత్‌: రాహల్‌ (సి) వేడ్‌ (బి) సామ్స్‌ 1, రోహిత్‌ (సి) సామ్స్‌ (బి) కమిన్స్‌ 17, కోహ్లీ (సి) ఫించ్‌ (బి) సామ్స్‌ 63, సూర్యకుమార్‌ (సి) ఫించ్‌ (బి) హాజెల్‌వుడ్‌ 69, హార్దిక్‌ (నాటౌట్‌) 25, కార్తీక్‌ (నాటౌట్‌) 1, ఎక్స్‌ట్రాలు 11, మొత్తం 19.5 ఓవర్లలో 187/4 వికెట్లపతనం : 1/5, 2/30, 3/134, 4/182 బౌలింగ్‌: సామ్స్‌ 3.5-0-33-2, హాజెల్‌వుడ్‌ 4-0-40-1, జంపా 4-0-44-0, కమిన్స్‌ 4-0-40-1, గ్రీన్‌ 3-0-14-0, మ్యాక్స్‌వెల్‌ 1-0-11-0.


 మ్యాచ్‌ హైలైట్స్‌


హార్దిక్‌ బౌలింగ్‌లో స్టీవ్‌ స్మిత్‌ ఇచ్చిన ఒక స్ట్రయిట్‌ ఫార్వర్డ్‌ క్యాచ్‌ని అక్షర్‌ వదిలేశాడు. అయితే ఈ 

అవకాశాన్ని ఉపయోగించుకోని స్మిత్‌ 9 పరుగులకే అవుటయ్యాడు.


కామెరూన్‌ గ్రీన్‌ (19 బంతుల్లో) భారత్‌పై టీ20ల్లో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీ నమోదు చేశాడు. అంతకుముందు ఈ రికార్డు వెస్టిండీస్‌ ఆటగాడు జాన్సన్‌ చార్లెస్‌ (20 బంతుల్లో) పేరిట ఉంది.


నాగ్‌పూర్‌ మ్యాచ్‌లో ఆడిన రిషభ్‌ పంత్‌ను ఈ మ్యాచ్‌కు తప్పించారు. అతని స్థానంలో భువనేశ్వర్‌ను తీసుకోగా, ఆసీస్‌ జట్టులో అబాట్‌కు బదులుగా ఇన్‌గ్లిస్‌ వచ్చాడు. 2014 నుంచి ఐపీఎల్‌లో హైదరాబాద్‌ జట్టుకు ఆడుతున్న భువీ 3 ఓవర్లలో 39 పరుగులు సమర్పించుకుని స్థానిక అభిమానులను నిరాశపరచాడు.


భారత బౌలర్లలో భువనేశ్వర్‌ (ఓవర్‌కు 13), బుమ్రా (ఓవర్‌కు 12.5) అట్టర్‌ఫ్లాప్‌ అయ్యారు. 18, 19 ఓవర్లలో (21 రన్స్‌+18 రన్స్‌) వీరిద్దరి బౌలింగ్‌లో ఆసీస్‌ బ్యాటర్లు పండుగ చేసుకున్నారు. 20వ ఓవర్లో హర్షల్‌ 7 పరుగులే ఇవ్వడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.


 స్టేడియం ఫుల్‌


దాదాపు మూడేళ్ల తర్వాత తొలిసారి అంతర్జాతీయ మ్యాచ్‌కు హైదరాబాద్‌ ఆతిథ్యమివ్వడంతో ఉప్పల్‌ స్టేడియం కిక్కిరిసిపోయింది. అభిమానులు భారీసంఖ్యలో మైదానానికి తరలి వచ్చారు. సిరీస్‌ నిర్ణాయకమైన ఈ కీలక మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించేందుకు 35వేల 354 మంది స్టేడియానికి వచ్చినట్టు హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) వెల్లడించింది.  


రూ. 850 టిక్కెట్‌.. 

11 వేలు


 పోలీసులకు చిక్కిన బ్లాక్‌ దందా ముఠా

ఉప్పల్‌ మ్యాచ్‌ సందర్భంగా కొంతమంది కేటుగాళ్లు బ్లాక్‌ దందాకు తెరలేపారు. రూ. 850 టిక్కెట్లను రూ.11 వేలకు అమ్ముతూ పోలీసులకు చిక్కారు. మ్యాచ్‌కు ముందు స్టేడియం వద్దకు చేరుకున్న రాచకొండ ఎస్‌వోటి పోలీసులు టిక్కెట్లు కొనుగోలు కోసం వచ్చినవాళ్లలా నటిస్తూ బ్లాక్‌లో టిక్కెట్లు అమ్ముతున్న కేటుగాళ్ల ముఠాను పట్టుకొన్నారు. వారి వద్ద నుంచి కొన్ని టిక్కెట్లు, మూడు సెల్‌ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

Read more