హంపికి రజతం

ABN , First Publish Date - 2022-12-31T02:43:26+05:30 IST

తెలుగు గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి మరోసారి ప్రపంచ వేదికపై సత్తా చాటింది.

హంపికి రజతం

ప్రపంచ బ్లిట్జ్‌ చెస్‌

అల్మాటి (కజకిస్థాన్‌): తెలుగు గ్రాండ్‌మాస్టర్‌ కోనేరు హంపి మరోసారి ప్రపంచ వేదికపై సత్తా చాటింది. ఫిడే ప్రపంచ బ్లిట్జ్‌ చెస్‌ చాంపియన్‌షిప్‌లో పతకంతో మెరిసింది. శుక్రవారం ముగిసిన ఈ మెగా టోర్నీ మహిళల విభాగంలో హంపి రన్నరప్‌గా నిలిచి రజతం సాధించింది. ప్రపంచ బ్లిట్జ్‌లో భారత్‌కిదే తొలి పతకం. అలాగే ర్యాపిడ్‌లో (2019), బ్లిట్జ్‌లో పతకం సాధించిన తొలి భారత క్రీడాకారిణి కూడా హంపినే. కజకిస్థాన్‌కు చెందిన బిబిసార బలబయేవా టాప్‌లో నిలిచి స్వర్ణం అందుకుంది. మొత్తం 17 రౌండ్లకు గాను 12.5 పాయింట్లతో రెండోస్థానం దక్కించుకున్న హంపి.. విజేత బిబిసార బలబయేవా (13 పాయింట్లు) కన్నా అరపాయింట్‌ వెనకంజలో నిలిచి స్వర్ణం చేజార్చుకుంది. హారిక 13వ స్థానానికి పరిమితమైంది. ఇక, ఓపెన్‌ విభాగంలో కార్ల్‌సన్‌ (16) విజేతగా నిలవగా.. తెలుగు గ్రాండ్‌మాస్టర్లు హరికృష్ణ (13) 17వ, అర్జున్‌ ఇరిగేసి (12) 42వ స్థానాలతో సరిపెట్టుకున్నారు.

Updated Date - 2022-12-31T02:43:34+05:30 IST