ఓటమితో ఆరంభం

ABN , First Publish Date - 2022-10-07T09:12:50+05:30 IST

శిఖర్‌ ధవన్‌ నేతృత్వంలోని ద్వితీయ శ్రేణి జట్టు మూడు వన్డేల సిరీ్‌సను ఓటమితో ఆరంభించింది.

ఓటమితో ఆరంభం

తొలి వన్డేలో భారత్‌కు చుక్కెదురు

పోరాడిన సంజూ.. దక్షిణాఫ్రికా బోణీ 


లఖ్‌నవూ: శిఖర్‌ ధవన్‌ నేతృత్వంలోని ద్వితీయ శ్రేణి జట్టు మూడు వన్డేల సిరీ్‌సను ఓటమితో ఆరంభించింది. చివర్లో సంజూ శాంసన్‌ (63 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సర్లతో 86 నాటౌట్‌) మెరుపులు మెరిపించినా ఫలితం లేకపోయింది. మరోవైపు ఈ ఫార్మాట్‌లోనూ భారత్‌కు డెత్‌ ఓవర్లు సమస్యగా మారాయి. దీనికి తోడు ఫీల్డింగ్‌ వైఫల్యం కూడా దెబ్బతీసింది. ఫలితంగా గురువారం జరిగిన ఈ మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా 9 పరుగులతో గెలిచి సిరీ్‌సలో 1-0 ఆధిక్యం సాధించింది. ఆదివారం రెండో వన్డే జరుగుతుంది. 


ఈ మ్యాచ్‌ వర్షం కారణంగా రెండున్నర గంటలు ఆలస్యం కావడంతో 40 ఓవర్ల చొప్పున ఆడించారు. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన దక్షిణాఫ్రికా 40 ఓవర్లలో 4 వికెట్లకు 249 పరుగులు చేసింది. డేవిడ్‌ మిల్లర్‌ (63 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 75 నాటౌట్‌), క్లాసెన్‌ (65 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సర్లతో 74 నాటౌట్‌) అర్ధసెంచరీలతో ఆదుకున్నారు. డికాక్‌ (48) ఫర్వాలేదనిపించాడు. శార్దూల్‌ ఠాకూర్‌కు రెండు వికెట్లు దక్కాయి. ఆ తర్వాత ఛేదనలో భారత్‌ 40 ఓవర్లలో 8 వికెట్లకు 240 పరుగులు చేసి ఓడింది. శ్రేయాస్‌ అయ్యర్‌ (37 బంతుల్లో 8 ఫోర్లతో 50), శార్దూల్‌ ఠాకూర్‌ (31 బంతుల్లో 5 ఫోర్లతో 33) మాత్రమే రాణించారు. ఎన్‌గిడికి మూడు, రబాడకు రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా క్లాసెన్‌ నిలిచాడు.


ఆరంభంలోనే తడబాటు:

ఛేదనలో భారత్‌ ఇన్నింగ్స్‌ మరీ కష్టంగా సాగింది. ఓటమి తేడా తొమ్మిది పరుగులే అయినా 51/4 స్కోరు దగ్గరే జట్టు ఆటతీరు గతి తప్పింది. శ్రేయాస్‌, శాంసన్‌, శార్దూల్‌ పోరాడినా ఛేదన అప్పటికే క్లిష్టంగా మారడంతో చేసేదేమీ లేకపోయింది. పేసర్లు రబాడ, పార్నెల్‌ బుల్లెట్‌లాంటి బంతులతో వరుసగా మూడు ఓవర్లను మెయిడిన్‌గా వేసి ఓపెనర్లు గిల్‌ (3), ధవన్‌ (4)లను అవుట్‌ చేశారు. ఆ తర్వాత కాసేపు అరంగేట్రం బ్యాటర్‌ రుతురాజ్‌ (19), ఇషాన్‌ (20) అతి జాగ్రత్తగా ఆడారు. చివరకు ఓపిక నశించిన రుతురాజ్‌ క్రీజు వదిలి ఆడే ప్రయత్నంతో షంసీకి దొరికిపోగా.. తర్వాతి ఓవర్‌లోనే ఇషాన్‌ను కేశవ్‌ అవుట్‌ చేశాడు. కానీ శ్రేయాస్‌ బరిలోకి దిగడంతో సీన్‌ మారిపోయింది. ముఖ్యంగా స్పిన్నర్‌ షంసీ ఓవర్‌లో హ్యాట్రిక్‌ ఫోర్లతో మురిపించాడు.


33 బంతుల్లోనే ఫిఫ్టీ పూర్తి చేసిన అయ్యర్‌ అదే స్కోరు వద్ద ఎన్‌గిడి షార్ట్‌ పిచ్‌ బంతికి రబాడకు సులువైన క్యాచ్‌ ఇవ్వడంతో సూపర్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. అయ్యర్‌ అవుటయ్యాక శాంసన్‌-శార్దూల్‌ జోడీ కాస్త వేగంగా పరుగులు సాధించింది. 35వ ఓవర్‌లో సిక్సర్‌ బాదిన సంజూ.. తర్వాతి ఓవర్‌లో రెండు ఫోర్లతో ఎదురుదాడికి దిగాడు. ఈక్రమంలో వన్డేల్లో రెండో హాఫ్‌ సెంచరీ పూర్తి చేశాడు. అయితే చివరి మూడు ఓవర్లలో 59 పరుగులు చేయాల్సి ఉండగా.. 37వ ఓవర్‌లో ఠాకూర్‌ మూడు ఫోర్లతో 14 రన్స్‌ అందించి ఆసక్తి పెంచాడు. కానీ ఊపు మీద కనిపించిన ఠాకూర్‌తో పాటు కుల్దీప్‌ (0)లను 38వ ఓవర్‌లో ఎన్‌గిడి వరుస బంతుల్లో పెవిలియన్‌కు చేర్చి భారత్‌ ఆశలను ఆవిరి చేశాడు. అయితే 39వ ఓవర్‌లో శాంసన్‌ ఒక్క బంతిని కూడా ఎదుర్కోలేకపోయాడు. ఇక ఆఖరి ఓవర్‌లో 30 పరుగుల కోసం శాంసన్‌ 6,4,4,4 బాదినా 20 పరుగులే రావడంతో ఓటమి తప్పలేదు.


శతక భాగస్వామ్యంతో..:

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన సఫారీ జట్టును ఆరంభంలో భారత పేసర్లు కట్టడి చేశారు. అయితే డేవిడ్‌ మిల్లర్‌, క్లాసెన్‌ మాత్రం చివర్లో పరుగుల వరద పారించారు. అంతకుముందు ఓపెనర్‌ మలాన్‌ (22)తో కలిసి డికాక్‌ తొలి వికెట్‌కు 49 పరుగులు జోడించాడు. వరుస ఓవర్లలో మలాన్‌, బవుమా (8)లను శార్దూల్‌ పెవిలియన్‌కు చేర్చాడు. ఆ వెంటనే మార్‌క్రమ్‌ (0)ను ఓ అద్భుత బంతితో కుల్దీప్‌ బౌల్డ్‌ చేశాడు. అయితే డికాక్‌తో జత కట్టిన క్లాసెన్‌ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. అటు ఓపిగ్గా ఆడుతున్న డికాక్‌ను బిష్ణోయ్‌ ఎల్బీగా అవుట్‌ చేశాడు. ఇక 23వ ఓవర్‌లో క్రీజులోకి అడుగుపెట్టిన మిల్లర్‌ తన సూపర్‌ ఫామ్‌ను కొనసాగించాడు.


వచ్చీరావడంతోనే బ్యాట్‌ ఝుళిపిస్తూ బౌండరీలతో జోష్‌ తెచ్చాడు. ఇద్దరూ పోటాపోటీగా ఆడి 36వ ఓవర్‌లో అర్ధసెంచరీలు పూర్తి చేసుకున్నారు. అలాగే జట్టు స్కోరు కూడా 200 దాటింది. 38వ ఓవర్‌లో క్లాసెన్‌ క్యాచ్‌ను సిరాజ్‌, మిల్లర్‌ క్యాచ్‌ను బిష్ణోయ్‌ వదిలేశారు. అదే ఓవర్‌లో మిల్లర్‌ 4,6 బాది 16 పరుగులు రాబట్టాడు. డెత్‌ ఓవర్లలో పేసర్‌ అవేశ్‌ ధారాళంగా పరుగులిచ్చుకున్నాడు. దీంతో చివరి ఐదు ఓవర్లలో మిల్లర్‌-క్లాసెన్‌ 53 పరుగులు సాధించారు.


స్కోరు బోర్డు

దక్షిణాఫ్రికా:

మలాన్‌ (సి) శ్రేయాస్‌ (బి) శార్దూల్‌ 22, డికాక్‌ (ఎల్బీ) బిష్ణోయ్‌ 48, బవుమా (బి) శార్దూల్‌ 8, మార్‌క్రమ్‌ (బి) కుల్దీప్‌ 0, క్లాసెన్‌ (నాటౌట్‌) 74, మిల్లర్‌ (నాటౌట్‌) 75, ఎక్స్‌ట్రాలు 22, మొత్తం :40 ఓవర్లలో 4 వికెట్లకు 249; వికెట్లపతనం: 1-49, 2-70, 3-71, 4-110; బౌలింగ్‌: సిరాజ్‌ 8-0-49-0, అవేశ్‌ ఖాన్‌ 8-0-51-0, శార్దూల్‌ ఠాకూర్‌ 8-1-35-2, రవి బిష్ణోయ్‌ 8-0-69-1, కుల్దీప్‌ యాదవ్‌ 8-0-39-1. 


భారత్‌:

ధవన్‌ (బి) పార్నెల్‌ 4, గిల్‌ (బి) రబాడ 3, రుతురాజ్‌ (స్టంప్డ్‌) డికాక్‌ (బి) షంసీ 19, ఇషాన్‌ (సి) మలాన్‌ (బి) మహరాజ్‌  20, శ్రేయాస్‌ అయ్యర్‌ (సి) రబాడ (బి) ఎన్‌గిడి 50, సంజూ శాంసన్‌ (నాటౌట్‌) 86, శార్దూల్‌ (సి) మహరాజ్‌ (బి) ఎన్‌గిడి 33, కుల్దీప్‌ (సి) బవుమా (బి) ఎన్‌గిడి 0, అవేశ్‌ (సి) బవుమా (బి) రబాడ 3, బిష్ణోయ్‌ (నాటౌట్‌) 4, ఎక్స్‌ట్రాలు18, మొత్తం: 40 ఓవర్లలో 8 వికెట్లకు 240; వికెట్లపతనం: 1-8, 2-8, 3-48, 4-51, 5-118, 6-211, 7-211, 8-215; బౌలింగ్‌: రబాడ 8-2-36-2, పార్నెల్‌ 8-1-38-1, కేశవ్‌ మహరాజ్‌ 8-1-23-1, ఎన్‌గిడి 8-0-52-3, షంసీ 8-0-89-1.

Read more