Serena Williams: సెరెనా విలియమ్స్ సంచలన ప్రకటన
ABN , First Publish Date - 2022-08-10T01:29:44+05:30 IST
అమెరికన్ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలోనే టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పనున్నట్టు

న్యూఢిల్లీ: అమెరికన్ టెన్నిస్ స్టార్ సెరెనా విలియమ్స్ సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలోనే టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పనున్నట్టు హింట్ ఇచ్చింది. 1999లో తొలిసారి యూఎస్ ఓపెన్‌ను గెలుచుకున్నప్పటి నుంచి టెన్నిస్‌కు ఐకాన్‌గా మారి 23 గ్రాండ్‌స్లామ్ చాంపియన్‌షిప్‌లను గెలుచుకున్న సెరెనా.. ఓ మ్యాగజైన్‌తో మాట్లాడుతూ రిటైర్మెంట్ ఆలోచనలో ఉన్నట్టు పేర్కొంది.
వచ్చే నెలలో ఓ టోర్నీ ఆడేసి టెన్నిస్‌కు గుడ్‌బై చెప్పాలనుకుంటున్నట్టు తెలిపింది. దశాబ్దాలపాటు టెన్నిస్‌ను ఏలిన విలియమ్స్ ‘రిటైర్మెంట్’ అనే పదం తనకు నచ్చదని పేర్కొంది. దానికి బదులుగా ‘పరిణామం’ అనే పదాన్ని ఉపయోగించేందుకు ప్రాధాన్యం ఇస్తానని పేర్కొంది. తాను టెన్నిస్‌కు దూరంగా ముఖ్యమైన ఇతర విషయాలవైపు దృష్టిసారిస్తున్నట్టు తెలిపింది. కుటుంబంపై దృష్టి సారించాలని నిర్ణయించుకున్నట్టు వివరించింది.
అయితే, టెన్నిస్ నుంచి కచ్చితంగా ఎప్పుడు తప్పుకుంటానన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అయితే, యూఎస్ ఓపెన్ తన చివరి టోర్నమెంట్ అవుతుందని ఇన్‌స్టాగ్రామ్‌లో చేసిన పోస్టు ద్వారా రిటైర్మెంట్ ఆలోచనలో ఉన్నట్టు చెప్పకనే చెప్పింది. అంతేకాదు, ‘కౌంట్‌డౌన్ మొదలైంది’ అని కూడా రాసుకొచ్చింది. ‘రాబోయే కొన్ని వారాల్లో ఆనందాన్ని పొందబోతున్నాను’ అని చెప్పడం ద్వారా రిటైర్మెంట్కు మానసికంగా సిద్ధమైందని తెలుస్తోంది.
తాను, తన భర్త అలెక్సీస్ ఒహానియన్ కలిసి మరో బిడ్డకు జన్మనివ్వాలని అనుకుంటున్నట్టు 40 ఏళ్ల విలియమ్స్ పేర్కొంది. తాను అథ్లెట్‌గా, గర్భవతిగా ఉండాలని అనుకోవడం లేదని స్పష్టం చేసింది. విలియమ్స్ 2017లో చివరి గ్రాండ్‌స్లామ్‌ను గెలుచుకున్నప్పుడు గర్భవతిగా ఉంది. జూన్‌లో వింబుల్డన్ నుంచి తొలి రౌండ్లోనే తప్పుకుంది. కాగా, విలియమ్స్ ప్రైజ్ మనీ రూపంలో దాదాపు 100 మిలియన్ డాలర్లు గెలుచుకుంది.