చిన్నోడి బౌలింగ్‌కు రోహిత్‌ ఫిదా

ABN , First Publish Date - 2022-10-17T09:51:43+05:30 IST

హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ ఓ చిన్నారి బౌలింగ్‌ చూసి అబ్బురపడ్డాడు. అతడిని పిలిచి మరీ తనకు బౌలింగ్‌ వేయాల్సిందిగా కోరడం ఆసక్తిని రేపింది.

చిన్నోడి బౌలింగ్‌కు రోహిత్‌ ఫిదా

పెర్త్‌: హిట్‌ మ్యాన్‌ రోహిత్‌ శర్మ ఓ చిన్నారి బౌలింగ్‌ చూసి అబ్బురపడ్డాడు. అతడిని పిలిచి మరీ తనకు బౌలింగ్‌ వేయాల్సిందిగా కోరడం ఆసక్తిని రేపింది. టీ20 ప్రపంచకప్‌ సన్నాహకాల్లో భాగంగా ప్రాక్టీస్‌ కోసం భారత జట్టు వాకా మైదానానికి వెళ్లింది. అప్పటికే ఉదయం నుంచి అక్కడ కొంత మంది చిన్నారులు ప్రాక్టీస్‌ చేస్తూ ఉన్నారు. డ్రెస్సింగ్‌ రూం నుంచి ఇదంతా గమనిస్తున్న రోహిత్‌ చూపు మాత్రం దృశీల్‌ చౌహాన్‌ అనే 11 ఏళ్ల చిన్నోడిపై పడింది. అతడి లెఫ్టామ్‌ పేస్‌ స్వింగ్‌ బంతులను చూసి ఆశ్చర్చపోయాడు. వెంటనే అతడిని పిలిచి నెట్స్‌లో తనకు బౌలింగ్‌ చేసేందుకు వెంట తీసుకెళ్లాడు. ఎలాంటి భయమూ లేకుండా అక్కడ అతడు విసిరిన ఇన్‌స్వింగర్లు, యార్కర్లను  రోహిత్‌ సరదాగా ఎదుర్కొన్నాడు. అలాగే ఫొటోలపై ఆటోగ్రాఫ్‌ కూడా ఇచ్చి అతడిని సంతోషంలో ముంచాడు. ఈ సందర్భంగా అతడితో మాట్లాడిన రోహిత్‌ ‘నీవు పెర్త్‌లో ఉంటావు కదా. మరి టీమిండియాకు ఎలా ఆడతావు?’ అని ప్రశ్నించాడు. దీనికి బదులిస్తూ.. తాను మరింతగా రాటుదేలాక భారత్‌కు వెళతానని దృశీల్‌ చెప్పాడు. ఈ వీడియోను బీసీసీఐ ట్వీట్‌ చేసింది.

Updated Date - 2022-10-17T09:51:43+05:30 IST