Reliance Jio: క్రికెట్ అభిమానులకు భారీ షాకిచ్చిన జియో

ABN , First Publish Date - 2022-10-15T03:00:41+05:30 IST

హాట్‌స్టార్ వీఐపీ, హాట్‌స్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్లతో ప్లాన్లు అందిస్తూ వచ్చిన దేశంలోని అగ్రగామి టెలికం సంస్థ రిలయన్స్

Reliance Jio: క్రికెట్ అభిమానులకు భారీ షాకిచ్చిన జియో

ముంబై: హాట్‌స్టార్ వీఐపీ, హాట్‌స్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్లతో ప్లాన్లు అందిస్తూ వచ్చిన దేశంలోని అగ్రగామి టెలికం సంస్థ రిలయన్స్ జియో (Reliance Jio) సంచలన నిర్ణయం తీసుకుంది. క్రికెట్ అభిమానులకు భారీ షాకిస్తూ  డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ అందించే ప్రీపెయిడ్ బండిల్డ్ ప్లాన్లను తొలగించింది. జియో (Reliance Jio) ఉన్నట్టుండి తీసుకున్న ఈ నిర్ణయం అభిమానులను షాక్‌కు గురిచేసింది. జియో (Jio) తొలగించిన ప్లాన్లలో రూ. 499, రూ. 601, రూ. 799, రూ. 1,099, రూ. 333, రూ. 419, రూ. 583, రూ. 783, రూ. 1,199 ప్లాన్లను తొలగించింది. ఇకపై ఈ ప్లాన్లు రీచార్జ్ ప్లాట్‌ఫామ్‌లో కనిపించవు. ఇక్కడ ఊరటనిచ్చే అంశం ఏంటంటే.. ఇప్పటికే ఈ ప్లాన్లతో రీచార్జ్ చేయించుకున్న వారు మాత్రం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ను ప్లాన్ కాలపరిమితి పూర్తయ్యే వీక్షించొచ్చు.


అయితే, రూ. 1,499 ప్లాన్, రూ. 4,199 ప్లాన్లు మాత్రం అందుబాటులో ఉన్నాయి. వీటిలో బండిల్డ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. అయితే, ఈ ప్లాన్లు ఎంతకాలం ఉంటుందన్న విషయంలో స్పష్టత లేదు. ఈ రెండు ప్లాన్లు బండిల్డ్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. అయితే, మొబైల్ సబ్‌స్క్రిప్షన్ మాత్రం 720P రిజల్యూషన్‌కు పరిమితమవుతుంది. రూ. 1,499 ప్లాన్‌ రోజుకు 2జీబీ డేటా 84 రోజుల కాలపరిమితో లభిస్తుంది. రూ. 4,199 ప్లాన్‌లో రోజుకు 3జీబీ డేటా రూ. 365 రోజుల కాలపరిమితితో లభిస్తుంది. ఈ రెండింటిలోనూ అపరిమిత కాల్స్, రోజుకు 100 ఎస్సెమ్మెస్‌లు వంటి ప్రయోజనాలు ఉంటాయి. 


డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ బండిల్డ్ ప్లాన్లను జియో ఎందుకు తొలగించింది?

రీచార్జ్ ప్లాన్లతో డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌ సబ్‌స్క్రిప్షన్‌ను తొలగించడం వెనక ఉన్న కారణాన్ని కూడా జియో (Jio) వెల్లడించలేదు. అయితే, డిస్నీప్లస్ హాట్‌స్టార్‌కు వచ్చే ఏడాది ఐపీఎల్‌ను స్ట్రీమింగ్ చేసే హక్కులు లేవు. ఈ హక్కులను వయాకామ్ 18 సొంతం చేసుకుంది. ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు చెందిన సంస్థే కావడం గమనార్హం. అయితే, ఐసీసీ టీ20 ప్రపంచకప్‌ను మాత్రం డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ స్ట్రీమింగ్ చేస్తుంది. కాకపోతే కొత్తగా ఇందుకోసం రీచార్జ్ చేసుకోవాలనుకుంటే మాత్రం కుదరదు. ఆదివారం నుంచి టీ20 ప్రపంచకప్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో జియో (Jio) తీసుకున్న ఈ నిర్ణయం అభిమానులను షాక్‌కు గురిచేసింది.

Updated Date - 2022-10-15T03:00:41+05:30 IST