దూసుకెళ్తున్న హంపి, హరి
ABN , First Publish Date - 2022-08-04T08:54:17+05:30 IST
చెస్ ఒలింపియాడ్‌లో భారత అగ్రశ్రేణి జట్ల హవా కొనసాగుతోంది. బుధవారం జరిగిన ఆరోరౌండ్ పోటీల్లో తెలుగు గ్రాండ్‌మాస్టర్లు హంపి, హరికృష్ణ అద్భుత విజయాలు...
టాప్‌లో భారత మహిళల జట్టు
చెస్ ఒలింపియాడ్
చెన్నై (ఆంధ్రజ్యోతి): చెస్ ఒలింపియాడ్‌లో భారత అగ్రశ్రేణి జట్ల హవా కొనసాగుతోంది. బుధవారం జరిగిన ఆరోరౌండ్ పోటీల్లో తెలుగు గ్రాండ్‌మాస్టర్లు హంపి, హరికృష్ణ అద్భుత విజయాలు సాధించారు. మొత్తంగా ఆరురౌండ్లు ముగిసేసరికి హంపి నేతృత్వంలోని భారత మహిళల జట్టు 12 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. జార్జియాతో తలపడిన భారత్ 3-1తో నెగ్గింది. హంపి.. జాగ్నిడ్జి నానాపై నెగ్గి జట్టుకు శుభారంభం అందించింది. హారిక, వైశాలి తమ గేమ్‌లను డ్రా చేసుకోగా, ఆఖరి మ్యాచ్‌లో తానియా గెలిచింది. భారత్-2 టీమ్ 2-2తో చెక్ రిపబ్లిక్‌తో పోరును డ్రా చేసుకుంది. ఆస్ట్రేలియాతో తలపడిన భారత్-3 టీమ్ 3-1తో విజయం సాధించింది.పురుషుల కేటగిరీలో హరికృష్ణ సారథ్యంలోని భారత జట్టు 2-2తో ఉజ్బెకిస్థాన్‌తో పోరును డ్రా చేసుకుంది. అబ్దుసత్తోరోవ్‌పై హరి నెగ్గగా, విదిత్, అర్జున్ గేమ్‌లు డ్రాగా ముగిశాయి. శశికిరణ్ ఓడిపోయాడు. భారత్-2 టీమ్‌లో గుకేష్ ఒక్కడే గెలవడంతో ఆ జట్టు 1.5-2.5తో అర్మేనియా చేతిలో ఓడింది. ఇక.. జీఎంలు పురానిక్, అభిజిత్, సేతురామన్ తమ గేమ్‌లు నెగ్గడంతో భారత్-3 టీమ్ 3.5-0.5తో లిథువేనియాపై గెలిచింది.