బట్లర్, హెట్మెయిర్ వీరబాదుడు.. చివరి ఓవర్లలో పరుగులు పిండేసుకున్న రాజస్థాన్

ABN , First Publish Date - 2022-04-06T03:13:28+05:30 IST

బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ బ్యాటర్లు జోస్ బట్లర్, షిమ్రన్ హెట్మెయిర్ శివాలెత్తారు. బ్యాట్‌తో

బట్లర్, హెట్మెయిర్ వీరబాదుడు..  చివరి ఓవర్లలో పరుగులు పిండేసుకున్న రాజస్థాన్

ముంబై: బెంగళూరుతో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ బ్యాటర్లు జోస్ బట్లర్, షిమ్రన్ హెట్మెయిర్ శివాలెత్తారు. బ్యాట్‌తో వీరంగమేశారు. ఫలితంగా 17 ఓవర్లకు 118/3గా ఉన్న స్కోరు 20 ఓవర్లు ముగిసేసరికి 169/3 పెరిగింది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన రాజస్థాన్ బ్యాటింగ్ నిదానంగా సాగింది. బెంగళూరు బౌలర్లు కట్టుదిట్టగా బౌలింగ్ చేయడంతో పరుగులు రావడం కష్టమైంది. యశస్వి జైశ్వాల్ (4) మరోమారు నిరాశపరచగా, పడిక్కల్ 29 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 37 పరుగులు చేసి పరవాలేదనిపించాడు. కెప్టెన్ సంజు శాంసన్ (8) దారుణంగా నిరాశపరిచాడు. 


పరుగులు రావడం గగనమైన వేళ జోస్ బట్లర్, షిమ్రన్ హెట్మెయిర్ క్రీజులో కుదురుకునేందుకే ప్రాధాన్యమిచ్చారు. మరోవైపు, బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పరుగులు రావడం గగనమైంది. 15 ఓవర్లు పూర్తయ్యేసరికి రాజస్థాన్ మూడు వికెట్ల నష్టానికి 103 పరుగులు మాత్రమే చేసింది. 16వ ఓవర్‌లో 4 పరుగులు మాత్రమే రావడంతో రాజస్థాన్ స్కోరు 130 దాటేలా కనిపించలేదు. అయితే, 17 ఓవర్ నుంచి ఆట స్వరూపం మారిపోయింది.


సిరాజ్ వేసిన ఆ ఓవర్‌లో హెట్మెయిర్ సిక్స్ బాది జోరు పెంచాడు. ఆ ఓవర్‌లో 11 పరుగులు వచ్చాయి. 18వ ఓవర్‌లో 9 పరుగులు వచ్చాయి. ఇక 19వ ఓవర్ నుంచి ఇటు హెట్మెయిర్, అటు బట్లర్ ఇద్దరూ కలిసి బౌలర్లను ఆడేసుకున్నారు. ఆ ఓవర్‌లో రెండు సిక్సర్లు, ఫోర్ పడడంతో 19 పరుగులొచ్చాయి. ఇక, చివరి ఓవర్‌లో మూడు సిక్సర్లు పడడంతో రాజస్థాన్ స్కోరు ఒక్కసారిగా 169 పరుగులకు చేరింది.  బట్లర్ 47 బంతుల్లో 6 సిక్సర్లతో 70, హెట్మెయిర్ 31 బంతుల్లో 4 ఫోర్లు, రెండు సిక్సర్లతో 42 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచారు. బెంగళూరు బౌలర్లలో విల్లీ, హసరంగ, హర్షల్ పటేల్ చెరో వికెట్ తీసుకున్నారు.

Updated Date - 2022-04-06T03:13:28+05:30 IST