ఒక్క గోల్‌ వేశాడు.. పతకం తెచ్చిపెట్టాడు

ABN , First Publish Date - 2022-06-03T00:31:01+05:30 IST

హాకీ ఆసియా కప్‌ 2022లో భారత పురుషుల జట్టు అదరగొట్టింది. డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్‌ కాంస్య

ఒక్క గోల్‌ వేశాడు.. పతకం తెచ్చిపెట్టాడు

జకార్తా: హాకీ ఆసియా కప్‌ 2022లో భారత పురుషుల జట్టు అదరగొట్టింది. డిఫెండింగ్‌ చాంపియన్‌గా బరిలోకి దిగిన భారత్‌ కాంస్య పతకం సాధించింది. మూడో స్థానం కోసం జరిగిన పోరులో జపాన్‌ను 1-0 తేడాతో మట్టికరిపించింది. నువ్వానేనా అన్నట్లు సాగిన మ్యాచ్‌ను టీమిండియా దూకుడుగా ఆరంభించింది.


భారత ఆటగాళ్లు తొలి పది నిమిషాలపాటు అద్భుత ప్రదర్శనతో అలరించారు. ఏడో నిమిషంలో ఉత్తమ్‌సింగ్‌ నుంచి పాస్‌ అందుకున్న రాజ్‌కుమార్‌ బంతిని నేరుగా గోల్‌పో‌స్ట్‌లోకి పంపి మ్యాచ్‌లో ఖాతా తెరిచాడు. ఆ ఒక్క గోల్‌తోనే భారత్‌కు అద్వితీయమైన విజయం లభించింది. ఆ తర్వాత మూడు నిమిషాలకే భారత్‌కు వరుసగా రెండు పెనాల్టీ కార్నర్లు లభించినప్పటికీ ఆటగాళ్లు సద్వినియోగం చేసుకోలేకపోయారు.


స్కోరు సమం చేయాలనే పట్టుదలతో జపాన్‌ ఆటగాళ్లు దాడిని తీవ్రతరం చేశారు. కానీ భారత డిఫెన్స్‌ బలంగా నిలబడి వాళ్ల ప్రయత్నాలను తిప్పికొట్టింది. 20వ నిమిషంలో ప్రత్యర్థికి లభించిన రెండు పెనాల్టీ కార్నర్లను భారత డిఫెన్స్‌ సమర్థంగా అడ్డుకుంది. మూడో క్వార్టర్‌లోనూ ప్రత్యర్థి అవకాశాలను వమ్ము చేస్తూ రక్షణ శ్రేణి దృఢంగా నిలబడింది. మరో గోల్‌ చేసే అవకాశం భారత్‌కు తృటిలో తప్పిపోయింది. మరోవైపు ఫైనల్లో దక్షిణ కొరియా 2-1తో మలేసియాను ఓడించి అయిదో సారి టైటిల్‌ సొంతం చేసుకుంది.

Updated Date - 2022-06-03T00:31:01+05:30 IST