ప్రమాదంలో పంత్‌ కెరీర్‌?

ABN , First Publish Date - 2022-12-31T02:46:40+05:30 IST

భారత వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌కు రోడ్డు ప్రమాదంలో ప్రాణాపాయం తప్పింది. కానీ...

ప్రమాదంలో పంత్‌ కెరీర్‌?

న్యూఢిల్లీ: భారత వికెట్‌ కీపర్‌ రిషభ్‌ పంత్‌కు రోడ్డు ప్రమాదంలో ప్రాణాపాయం తప్పింది. కానీ ఈ క్రమంలో అతను తీవ్ర గాయాలకు గురికావడం మాత్రం అతడి కెరీర్‌ను ప్రమాదంలో పడేయవచ్చనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అటు డాక్టర్లు మాత్రం పంత్‌ పూర్తిగా కోలుకునేందుకు 2 నుంచి 6 నెలల సమయం పట్టవచ్చని చెబుతున్నారు. నుదురు చిట్లడం, వీపుపై గాయాలు త్వరగానే నయమయ్యే అవకాశం ఉన్నా.. ప్రధానంగా కుడి మోకాలి లిగమెంట్‌ స్థానభ్రంశం చెందడం ప్రమాదకరంగా మారింది. ఇలాంటి గాయాలు ఎక్కువగా మైదానంలో క్రీడాకారులకు జరుగుతుంటాయి. కానీ ఇక్కడ పంత్‌కు యాక్సిడెంట్‌ రూపంలో జరిగింది. వాస్తవానికి లిగమెంట్‌ మోకాలిని గట్టిగా పట్టుకుని, కదలికల సమయంలో మద్దతునిస్తుంటుంది. కానీ స్నాయువు దెబ్బతిన్నట్టయితే మోకాలి కీలు పట్టు కోల్పోతుంది. ఇలాంటి పరిస్థితిలో నిలబడేందుకు, నడవడానికి కూడా ఇబ్బంది పడుతుంటారు. ఈ గాయం వైద్య చికిత్సతో నయం కాకపోతే సర్జరీకి వెళ్లాల్సి ఉంటుంది. ఆ తర్వాతైనా కోలుకునేందుకు చాలా సమయమే పట్టవచ్చు. ప్రస్తుతం పంత్‌ జట్టు ప్రధాన వికెట్‌ కీపర్‌గా వ్యవహరిస్తున్నాడు. కీపింగ్‌ చేసే సమయంలో మోకాలిపైనే ఎక్కువ ఒత్తిడి పడుతుంటుంది. అందుకే ఒకవేళ ప్రస్తుతానికి నయమైనా.. భవిష్యత్‌లోనూ తిరగబెట్టే అవకాశాలు లేకపోలేదు. మరోవైపు పంత్‌ ఏప్రిల్‌లో జరిగే ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌)కు దూరమయ్యే చాన్స్‌ ఉంది. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్‌ జట్టు కొత్త కెప్టెన్‌ను వెతుక్కోవాల్సిందే. ప్రధానంగా ఈ రేసులో డేవిడ్‌ వార్నర్‌, పృథ్వీ షా, మిచెల్‌ మార్ష్‌ పేర్లు వినిపిస్తున్నాయి. ఇదిలావుండగా గతంలో దక్షిణాఫ్రికా కీపర్‌ మార్క్‌ బౌచర్‌ కంటి గాయంతో, ఇంగ్లండ్‌ బ్యాటర్‌ సైమన్‌ జోన్స్‌ మోకాలి గాయంతోనే కెరీర్‌కు వీడ్కోలు చెప్పాల్సి వచ్చింది.

Updated Date - 2022-12-31T02:47:56+05:30 IST