పాకిస్థాన్‌కు పరాభవం

ABN , First Publish Date - 2022-10-28T04:38:04+05:30 IST

ఆరు సంవత్సరాలుగా ఒక్క ఐసీసీ టోర్నీ కూడా ఆడని కసి కాబోలు..ఈసారి టీ20 వరల్డ్‌ కప్‌లో జింబాబ్వే అదిరే ఆటతో సంచలనాలు సృష్టిస్తోంది. గురువారం చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన గ్రూప్‌-2 పోరులో ఏకంగా మాజీ చాంపియన్‌ పాకిస్థాన్‌కు షాకిచ్చింది.

పాకిస్థాన్‌కు  పరాభవం

ఒక్క పరుగుతో జింబాబ్వే సంచలన విజయం

తిప్పేసిన స్పిన్నర్‌ రజా

ఆఖరి ఓవర్లో ఇవాన్స్‌ అదుర్స్‌

పెర్త్‌: ఆరు సంవత్సరాలుగా ఒక్క ఐసీసీ టోర్నీ కూడా ఆడని కసి కాబోలు..ఈసారి టీ20 వరల్డ్‌ కప్‌లో జింబాబ్వే అదిరే ఆటతో సంచలనాలు సృష్టిస్తోంది. గురువారం చివరి బంతి వరకు ఉత్కంఠ భరితంగా జరిగిన గ్రూప్‌-2 పోరులో ఏకంగా మాజీ చాంపియన్‌ పాకిస్థాన్‌కు షాకిచ్చింది. చేసింది స్వల్ప స్కోరే అయినా బౌలర్లు అమోఘంగా ముఖ్యంగా చివరి ఓవర్‌ను పేసర్‌ బ్రాడ్‌ ఇవాన్స్‌ అద్భుతంగా వేయడంతో ఒక్క పరుగుతో జింబాబ్వే సంచలన విజయం సాధించింది. టాస్‌ నెగ్గి తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో 130/8 స్కోరు మాత్రమే చేసింది.. సీన్‌ విలియమ్స్‌ (31) టాప్‌ స్కోరర్‌కాగా..కెప్టెన్‌ ఇర్విన్‌ (19), బ్రాడ్‌ ఇవాన్స్‌ (19), మెధెవెరె (17) మోస్తరుగా ఆడారు. మహ్మద్‌ వసీమ్‌ నాలుగు, స్పిన్నర్‌ షాదాబ్‌ ఖాన్‌ మూడు వికెట్లు తీశారు. అనంతరం పాకిస్థాన్‌ 20 ఓవర్లలో 129/8 స్కోరుకే పరిమితమైంది. షాన్‌ మసూద్‌ (44), మహ్మద్‌ నవాజ్‌ (22), షాదాబ్‌ ఖాన్‌ (17) మాత్రమే రాణించారు. ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సికిందర్‌ రజా మూడు, బ్రాడ్‌ ఇవాన్స్‌ రెండు వికెట్లు పడగొట్టారు.

ఇవాన్స్‌ ఒత్తిడి అదిమిపట్టి..:

చివరి ఓవర్లో 11 పరుగులు కావాల్సిన దశలో..ఇవాన్స్‌ వేసిన తొలి బంతికి నవాజ్‌ మూడు రన్స్‌ చేయగా..వసీమ్‌ బౌండరీ బాదడంతో పాక్‌ అభిమానుల సంతోషానికి అవధుల్లేకుండా పోయింది. ఇక మూడో బంతికి వసీమ్‌ సింగిల్‌ తీయగా, నాలుగో బంతికి పరుగేమీ రాకపోవడంతో ఉత్కంఠ తారస్థాయి చేరింది. కానీ టెన్షన్‌ను అదిమిపెట్టిన ఇవాన్స్‌ లెంగ్త్‌ బంతితో నవాజ్‌ను అవుట్‌ చేశాడు. ఇక చివరి బంతికి గెల్చేందుకు 3, టై చేసేందుకు 2 పరుగులు కావాలి. స్టేడియం అంతా నిశ్శబ్దం. ఇవాన్స్‌ విసిరిన బంతిని లాంగాన్‌ వైపు కొట్టిన షాహీన్‌ ఒక పరుగు పూర్తిచేశాడు. ఈలోగా రజా ఫీల్డ్‌ చేసి విసిరిన బంతిని కీపర్‌ చికబ్వా అందుకొని వికెట్లను గిరాటేయడంతో అఫ్రీది రెండో పరుగు చేయకుండానే రనౌట య్యాడు. అంతే.. జింబాబ్వే జట్టు చిరస్మరణీయ విజయంతో సింహనాదం చేసింది. అంతకుముందు ఓపెనర్లు ఇర్విన్‌, మెధెవెరె తొలి వికెట్‌కు 42 పరుగులతో జిం బాబ్వేకు శుభారంభం ఇచ్చారు. ఆపై విలియమ్స్‌, రజా నాలుగో వికెట్‌కు 31రన్స్‌ చేసి ఆదుకున్నారు.

ప్రమాదంలో పాక్‌ సెమీస్‌ ఆశలు

వరుసగా రెండో ఓటమితో పాక్‌ జట్టు సెమీస్‌ అవకాశాలు ప్రమాదంలో పడ్డాయి. నెదర్లాండ్స్‌, సౌతాఫ్రికా, బంగ్లాదేశ్‌తో మిగిలిన మూడు మ్యాచ్‌లను పాక్‌ నెగ్గినా..ఇతర జట్ల ఫలితాలూ అనుకూలించాలి. పాక్‌ సెమీఫైనల్‌ చేరాలంటే ముఖ్యంగా సౌతాఫ్రికాను భారత్‌ చిత్తు చేయాల్సి ఉంటుంది.

సంక్షిప్తస్కోర్లు:

జింబాబ్వే:

20 ఓవర్లలో 130/8 (సీన్‌ విలియమ్స్‌ 31, ఇవాన్స్‌ 19, ఇర్విన్‌ 19, వసీమ్‌ 4/24, షాదాబ్‌ 3/23)

పాకిస్థాన్‌:

20 ఓవర్లలో 129/8 (మసూద్‌ 44, నవాజ్‌ 22, షాదాబ్‌ 17, రజా 3/25, ఇవాన్స్‌ 2/25).

Updated Date - 2022-10-28T04:38:05+05:30 IST