అయ్యో.. బుమ్రా

ABN , First Publish Date - 2022-09-30T09:28:38+05:30 IST

టీ20 ప్రపంచకప్‌నకు ముందు టీమిండియాకు దెబ్బమీద దెబ్బ పడుతూనే ఉంది.

అయ్యో.. బుమ్రా

టీ20 ప్రపంచకప్‌నకు దూరం!

వెన్నునొప్పితో ఆరు నెలలు విశ్రాంతి

రేసులో షమి, చాహర్‌

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్‌నకు ముందు టీమిండియాకు దెబ్బమీద దెబ్బ పడుతూనే ఉంది. తాజాగా భారత బౌలింగ్‌ తురుపు ముక్క, స్టార్‌ పేసర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా వెన్నునొప్పి గాయం తిరగబెట్టడంతో ప్రస్తుత దక్షిణాఫ్రికాతో సిరీ్‌సకు దూరమయ్యాడు. అంతేకాదు.. అత్యంత కీలకమైన టీ20 వరల్డ్‌క్‌పలో సైతం ఆడే అవకాశం లేదని సమాచారం. ప్రస్తుతం అతడికి ఆరు నెలల విశ్రాంతి అవసరమని చెబుతున్నారు. అయితే బీసీసీఐ మాత్రం ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించాల్సి ఉంది. పేసర్లకు అనుకూలించే ఆస్ట్రేలియా పిచ్‌లపై బుమ్రా దుమ్ము రేపుతాడనుకున్న అభిమానులకు ఇది నిజంగా నిరాశ కలిగించే వార్తే. ఇప్పటికే కీలక ఆల్‌రౌండర్‌ జడేజా  ప్రపంచకప్‌నకు దూరమైన విషయం తెలిసిందే.


ఈ ఇద్దరి గైర్హాజరీ భారత్‌ అవకాశాలపై ప్రభావం పడనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ‘టీ20 వరల్డ్‌కప్‌ కోసం బుమ్రా ఆసీ్‌సకు వెళ్లడం లేదు. అతడు తీవ్రమైన వెన్నునొప్పితో బాధపడుతున్నాడు. కోలుకునేందుకు కనీసం ఆరు నెలల సమయం పడుతుంది. ప్రస్తుతం తను జాతీయ క్రికెట్‌ అకాడమీలో ఉన్నాడు. జట్టు ప్రధాన బౌలర్‌గా ఉన్న అతడిని ఇలాంటి పరిస్థితిలో ఆడించి రిస్క్‌ తీసుకోలేం. మరోవైపు మెగా టోర్నీకి ముందే జడేజా, బుమ్రా సేవలను కోల్పోవడం జట్టుకు గట్టి దెబ్బే. ఇలా జరుగుతుందని ఎవరూ ఊహించలేదు’ అని బీసీసీఐ సీనియర్‌ అధికారి తెలిపాడు. 2019లో తొలిసారిగా బుమ్రా వెన్నునొప్పికి గురై మూడు నెలల విశ్రాంతి తీసుకున్నాడు. ఇక, దక్షిణాఫ్రికాతో సిరీ్‌సకు బుమ్రా స్థానంలో సిరాజ్‌ను తీసుకునే చాన్సుంది.


నెట్‌ ప్రాక్టీస్‌లోనే నొప్పి: 

ఈ ఏడాది బుమ్రా ఐపీఎల్‌ మినహాయించి జాతీయ జట్టు తరఫున ఐదు టెస్టులు,    ఐదు వన్డేలు, ఐదు టీ20లు మాత్రమే ఆడాడు. ఇంగ్లండ్‌తో టెస్టు సిరీస్‌ అయ్యాక విండీస్‌ టూర్‌కు, ఆసియాక్‌పనకు కూడా దూరంగానే ఉన్నాడు.  అయితే ఆసీ్‌సతో 2 మ్యాచ్‌లు ఆడినా పెద్దగా ప్రభావం చూపలేదు. ఆఖరి టీ20లోనైతే 50 పరుగులిచ్చుకున్నాడు. అలాగే దక్షిణాఫ్రికాతో తొలి మ్యాచ్‌కు ముందు మంగళవారం ప్రాక్టీస్‌ సెషన్‌లో వెన్నునొప్పిపై బుమ్రా ఫిర్యాదు చేశాడు. దీంతో ఫిజియో, మెడికల్‌ సిబ్బంది పరీక్షించి సిరీ్‌సకు అతడిని దూరంగా ఉంచాలని సూచించారు. అంతేకాకుండా స్కానింగ్‌ కోసం బుమ్రా బుధవారమే బెంగళూరు వెళ్లాడు. వాటి ఫలితాలింకా రావాలి. మరోవైపు వరల్డ్‌క్‌పలో అతడి ప్రాతినిఽధ్యంపై ఇప్పుడే ఓ నిర్ణయానికి రాకుండా కొద్ది రోజులు వేచి చూడాలని బోర్డు నిర్ణయించుకుంది. ఇక ప్రస్తుత గాయానికి శస్త్ర చికిత్స అవసరం లేకపోయినా.. కోలుకునేందుకు కనీసం 4 నుంచి 6 నెలలు పడుతుందని బోర్డు వర్గాలు పేర్కొన్నాయి. 


టీ20  ప్రపంచకప్‌నకుకు స్టాండ్‌బై పేసర్లుగా షమి, దీపక్‌ చాహర్‌లను ఇదివరకే బీసీసీఐ ప్రకటించింది. బుమ్రా దూరమవడంతో అతడి స్థానంలో ఈ ఇద్దరిలో ఎవరికి చోటు దక్కుతుందో చూడాలి. ఆసీ్‌సతో సిరీ్‌సకు ముందే షమి కొవిడ్‌ బారిన పడి రెండు సిరీ్‌సలకు దూరమయ్యాడు. దీంతో అతడికి మ్యాచ్‌ ప్రాక్టీస్‌ లేకుండా పోయింది. అటు చాహర్‌ సఫారీలతో తొలి టీ20లో అదరగొట్టాడు. పవర్‌ప్లేలో వికెట్‌ తీసే సామర్థ్యంతో పాటు లోయరార్డర్‌లో బ్యాటింగ్‌ కూడా చేయగలడు కాబట్టి చాహర్‌ వైపే మేనేజ్‌మెంట్‌ మొగ్గు చూపవచ్చు. ఐసీసీ అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేకుండా అక్టోబరు 15 వరకు జట్టులో మార్పులు చేసుకునే వెసులుబాటు ఉంది.

Updated Date - 2022-09-30T09:28:38+05:30 IST