మొహాలీ పీడకల వెంటాడుతోంది: Shoaib Akhtar

ABN , First Publish Date - 2022-06-12T01:27:10+05:30 IST

2011 ఐసీపీ ప్రపంచకప్‌లో భాగంగా మార్చి 30న మొహాలీలో జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో మహేంద్రసింగ్ ధోనీ

మొహాలీ పీడకల వెంటాడుతోంది: Shoaib Akhtar

న్యూఢిల్లీ: 2011 ఐసీపీ ప్రపంచకప్‌లో భాగంగా మార్చి 30న మొహాలీలో జరిగిన రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో మహేంద్రసింగ్ ధోనీ సారథ్యంలోని భారత జట్టు చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై 29 పరుగుల తేడాతో విజయం సాధించి ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా 9 వికెట్ల నష్టానికి 260 పరుగులు చేసింది.


261 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో బొక్కబోర్లా పడిన పాక్ ఇంటిముఖం పట్టింది. అన్‌ఫిట్ అని తేలడంతో చివరి నాలుగు మ్యాచుల్లో షోయబ్ అక్తర్ ఆడలేకపోయాడు. ఈ ఘటన జరిగి పదేళ్లు అవుతున్నా ఆ ఓటమి తనను ఇంకా వెంటాడుతూనే ఉందని అక్తర్ తాజాగా చెప్పుకొచ్చాడు. అప్పట్లో మేనేజ్‌మెంట్ రిస్క్ తీసుకుని తనను ఆడించి ఉంటే ఫలితం వేరేలా ఉండేదని పేర్కొన్నాడు. 


‘స్పోర్ట్స్‌కీడా’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అక్తర్ ఈ వ్యాఖ్యలు చేశాడు. 2011 ప్రపంచకప్ సెమీఫైనల్ నాటి మొహాలీ జ్ఞాపకం తనను ఇంకా వెంటాడుతోందని ఆవేదన వ్యక్తం చేశాడు. వారు (పాకిస్థాన్ జట్టు మేనేజ్‌మెంట్) తనను ఆడించి ఉండాల్సిందని అన్నాడు. ఇది పూర్తిగా మేనేజ్‌మెంట్ తప్పిదమేనని పేర్కొన్నాడు. వాఖండేలో పాకిస్థాన్ జెండా ఎగరాలని, తమ జట్టు ఫైనల్ ఆడాలని కోరుకున్నానన్నాడు. అప్పటికే భారత జట్టు ఒత్తిడిలో ఉన్న విషయం తనకు తెలుసని అన్నాడు. దేశం, మీడియా తమవైపే చూస్తోందని, దానర్థం తాము అండర్‌డాగ్స్‌మని పేర్కొన్నాడు. కాబట్టి తాము ఒత్తిడిలోకి జారుకోకూడదని తాను అనుకున్నానన్నాడు. 


ఆ మ్యాచ్‌లో తాను ఆడి ఉంటే ఓపెనింగ్ బ్యాటర్లు వీరేంద్ర సెహ్వాగ్, సచిన్ టెండూల్కర్‌ను పెవిలియన్ పంపి పాకిస్థాన్‌ను పై చేయిలో ఉంచేవాడనని వివరించాడు. వారు తనను అన్‌ఫిట్ అన్నారని, కానీ వామప్‌లో తాను 8 ఓవర్లు వేశానని అక్తర్ గుర్తు చేసుకున్నాడు. ఆ మ్యాచ్‌లో తాను ఆడి ఉంటే నిస్సందేహంగా సచిన్, సెహ్వాగ్‌ను త్వరగా అవుట్ చేసి ఉండేవాడినని అన్నాడు. ఓటమి తనను నిజంగా చాలా బాధ కలిగించిందని అక్తర్ చెప్పుకొచ్చాడు.   

Read more