పతక మోత

ABN , First Publish Date - 2022-08-04T09:00:21+05:30 IST

కామన్వెల్త్‌ క్రీడల్లో ఆరోరోజు భారత క్రీడాకారులు మూడు పతకాలు కొల్లగొట్టారు. బుధవారం పోటీల్లో మహిళల జూడోలో తులికా మాన్‌ రజతంతో మెరవగా...

పతక మోత

కామన్వెల్త్‌ క్రీడలు


జూడోలో తులికాకు రజతం

లిఫ్టింగ్‌, స్క్వాష్‌లో కాంస్యాలు

బాక్సింగ్‌లో  సెమీస్‌కు ముగ్గురు

బ్యాడ్మింటన్‌ మిక్స్‌డ్‌ టీమ్‌లో  రెండో స్థానం


కామన్వెల్త్‌ క్రీడల్లో ఆరోరోజు భారత క్రీడాకారులు మూడు పతకాలు కొల్లగొట్టారు. బుధవారం పోటీల్లో మహిళల జూడోలో తులికా మాన్‌ రజతంతో మెరవగా.. వెయిట్‌లిఫ్టింగ్‌ లో లవ్‌ప్రీత్‌ సింగ్‌,  స్క్వాష్‌ సింగిల్స్‌లో సౌరవ్‌ ఘోషల్‌ కాంస్య పతకాలు సాధించారు. కాగా.. బ్యాడ్మింటన్‌ మిక్స్‌డ్‌ టీం ఈవెంట్‌లో భారత షట్లర్లు నిరాశ పరిచారు.. డిఫెండింగ్‌ చాంపియన్లయిన మనోళ్లు ఫైనల్లో మలేసియా చేతిలో ఓడి రజతంతో సరిపెట్టుకున్నారు.. బాక్సింగ్‌లో తెలుగు తేజాలు నిఖత్‌ జరీన్‌, హుసాముద్దీన్‌, హరియాణా అమ్మాయి నీతూ గంఘాస్‌ సెమీఫైనల్‌కు దూసుకెళ్లి పతకాలు ఖాయం చేసుకున్నారు. 


బర్మింగ్‌హామ్‌: కామన్వెల్త్‌ గేమ్స్‌లో గత ఐదు రోజులుగా పతకాల పంట పండించిన భారత క్రీడాకారులు ఆరోరోజూ తమ జోరును ప్రదర్శించారు. బుధవారం పోటీల్లో మూడు పతకాలు సాధించారు. జూడోలో తులికా మన్‌ రజతం.. వెయిట్‌లిఫ్టింగ్‌లో లవ్‌ప్రీత్‌ సింగ్‌, స్క్వాష్‌లో సౌరవ్‌ ఘోషల్‌ కాంస్య పతకాలు అందుకున్నారు.     


లవ్‌ప్రీత్‌.. రెండు రికార్డులు

వెయిట్‌లిఫ్టింగ్‌ పురుషుల 109 కి. విభాగంలో అమృత్‌సర్‌కు చెందిన 24 ఏళ్ల లవ్‌ప్రీత్‌సింగ్‌ 355 కిలోల వ్యక్తిగత అత్యుత్తమ టోటల్‌తో కాంస్య పతకం అందుకున్నాడు. స్నాచ్‌లో 163కి. ఎత్తిన అతడు క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో 192 కి. లిఫ్ట్‌ చేశాడు. క్లీన్‌ అండ్‌ జెర్క్‌లో లవ్‌ప్రీత్‌ కొత్త జాతీయ రికార్డు నెలకొల్పడం విశేషం. కామెరూన్‌, సమోవా లిఫ్టర్లు స్వర్ణ, రజతాలు గెలుపొందారు. ఇక ఈసారి క్రీడల వెయిట్‌లిఫ్టింగ్‌లో ఇప్పటివరకు మూడు స్వర్ణాలు సహా మనోళ్లు మొత్తం ఎనిమిది పతకాలు నెగ్గారు. మహిళల 87 కి.లలో పూర్ణిమా పాండే (103+125= 228 కి.) ఆరో స్థానంలో నిలిచింది. ఇంగ్లండ్‌, సమోవా, ఆస్ట్రేలియా లిఫ్టర్లు స్వర్ణ, రజత, కాంస్యాలు కైవసం చేసుకున్నారు. 


వావ్‌.. మాన్‌!
జూడోలో మరో పతకం లభించింది. మహిళల 78 కిలోల విభాగంలో తులికా మాన్‌ రజతంతో మెరిసింది. హోరాహోరీగా జరిగిన ఫైనల్లో ప్రత్యర్థి సారా అడ్లింగ్టన్‌ (స్కాట్లాండ్‌) చేతిలో తులికా ఓడింది. అంతకుముందు సిడ్నీ ఆండ్రూస్‌ (న్యూజిలాండ్‌)తో సెమీ్‌సలో ఆరంభంలో వెనుకంజలో నిలిచిన మాన్‌ ఆపై అద్భుతంగా పుంజుకొని ఇప్పన్‌తో ప్రత్యర్థిని మట్టికరిపించింది. 23 ఏళ్ల తులిక నాలుగుసార్లు జాతీయ చాంపియన్‌. మాన్‌ రజతంతో కలిపి జూడోలో భారత్‌కు ఇప్పటివరకు మూడు పతకాలు లభించాయి. ఇంతకుముందు మహిళల 48కి.లో సుశీలాదేవి రజతం, పురుషుల 60కిలలో విజయ్‌కుమార్‌ యాదవ్‌ కాంస్య పతకం గెలుపొందిన సంగతి తెలిసిందే. ఇక పురుషుల 100 కి. రెపిచేజ్‌లో దీపక్‌ దేశ్వాల్‌..టకావయా (ఫిజీ) చేతిలో ఓడిపోయాడు. 

బ్యాడ్మింటన్‌ ఫైనల్లో ఓటమి
బ్యాడ్మింటన్‌ మిక్స్‌డ్‌ టీం విభాగంలో డిఫెండింగ్‌ చాంపియన్‌ భారత్‌ రజతంతో సరిపెట్టుకుంది. ఫైనల్లో మన జట్టు 1-3తో  మలేసియా చేతిలో ఓడింది. మహిళల సింగిల్స్‌లో సింధు ఒక్కతే గెలవగా, పురుషుల సింగిల్స్‌లో కిడాంబి శ్రీకాంత్‌, పురుషుల డబుల్స్‌లో సాత్విక్‌, చిరాగ్‌ జోడీ, మహిళల డబుల్స్‌లో గాయత్రీ గోపీచంద్‌, ట్రీసా జోలీ జంట పరాజయం పాలయ్యారు. 

Updated Date - 2022-08-04T09:00:21+05:30 IST