మన నీరజ్‌ ‘డైమండ్‌’

ABN , First Publish Date - 2022-09-10T06:07:50+05:30 IST

రికార్డుల వీరుడు, భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా మరో ఘనత సాధించాడు. ఈ ఒలింపిక్‌ చాంపియన్‌ ప్రతిష్ఠాత్మక డైమండ్‌ లీగ్‌

మన నీరజ్‌ ‘డైమండ్‌’

 ప్రతిష్ఠాత్మక టైటిల్‌తో కొత్త చరిత్ర

జ్యూరిచ్‌: రికార్డుల వీరుడు, భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా మరో ఘనత సాధించాడు. ఈ ఒలింపిక్‌ చాంపియన్‌ ప్రతిష్ఠాత్మక డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌లో విజేతగా నిలిచి సంచలనం సృష్టించాడు. భారత కాలమానం ప్రకారం గురువారం అర్ధరాత్రి జరిగిన ఫైనల్స్‌లో నీరజ్‌.. ఈటెను అత్యుత్తమంగా 88.44 మీటర్లు విసిరి టైటిల్‌ నెగ్గాడు. మొత్తం ఆరుగురు పోటీపడ్డ ఈ ఫైనల్స్‌లో 24 ఏళ్ల నీరజ్‌ రెండో ప్రయత్నంలో జావెలిన్‌ను అందరికంటే ఎక్కువ దూరం విసిరి చాంపియన్‌షి్‌పను దక్కించుకున్నాడు. ఈ టైటిల్‌ సాధించిన తొలి భారత అథ్లెట్‌గా నీరజ్‌ చరిత్రకెక్కాడు. నీరజ్‌కు ప్రధాన పోటీదారైన ఒలింపిక్‌ రజత పతక విజేత యాకోబ్‌ వ్లాడిచ్‌ (చెక్‌ రిపబ్లిక్‌) 86.94 మీటర్ల ప్రదర్శనతో రెండోస్థానానికి పరిమితమయ్యాడు. జర్మనీ అథ్లెట్‌ జులియన్‌ వెబెర్‌ (83.73 మీ.) మూడోస్థానంతో సరిపెట్టుకున్నాడు. ఈ విజయంతో నీరజ్‌కు ట్రోఫీతో పాటు రూ. 39.33 లక్షలు ప్రైజ్‌మనీగా లభించింది. ‘ఎప్పటినుంచో కలగంటున్న ఈ ప్రతిష్ఠాత్మక టైటిల్‌ను నెగ్గా. అదీ నా కుటుంబం సమక్షంలో ట్రోఫీ అందుకోవడం మరింత సంతోషంగా ఉంది.  ఇప్పుడు మేమంతా కలిసి హాలిడే ట్రిప్‌ కోసం పారిస్‌ వెళ్తున్నాం’ అని నీరజ్‌ వ్యాఖ్యానించాడు. 


జాతీయ క్రీడలకు నీరజ్‌ దూరం?

డైమండ్‌ లీగ్‌ ఫైనల్స్‌ టైటిల్‌ నెగ్గి జోరుమీదున్న నీరజ్‌ చోప్రా ఈనెల 29 నుంచి జరిగే జాతీయ క్రీడలకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గాయం కారణంగా ఆ మధ్య కామన్వెల్త్‌ క్రీడల్లో పాల్గొనలేకపోయిన చోప్రా.. గజ్జల్లో సమస్య నుంచి ఇటీవలే కోలుకున్నందున, తాను జాతీయ క్రీడల్లో ఆడకపోవచ్చని తెలిపాడు. కాగా, టాప్‌ అథ్లెట్లంతా కచ్చితంగా జాతీయ క్రీడల్లో పోటీపడాల్సిందేనంటూ ఐఓఏ ఆదేశించిన సంగతి తెలిసిందే. అయితే, నీరజ్‌ అంశంలో ఐఓఏ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. 

Updated Date - 2022-09-10T06:07:50+05:30 IST