FIFA World Cup: మెస్సీ మాయచేస్తాడా? ఎంబపె ఎగరేసుకుపోతాడా?

ABN , First Publish Date - 2022-12-18T16:51:05+05:30 IST

ప్రపంచవ్యాప్తంగా సాకర్ అభిమానులు దాదాపు నెల రోజులపాటు ఉర్రూతలూగించిన ఫిఫా ప్రపంచకప్

FIFA World Cup: మెస్సీ మాయచేస్తాడా? ఎంబపె ఎగరేసుకుపోతాడా?
Fifa world cup

ఖతర్: ప్రపంచవ్యాప్తంగా సాకర్ అభిమానులు దాదాపు నెల రోజులపాటు ఉర్రూతలూగించిన ఫిఫా ప్రపంచకప్ (Fifa World Cup) ఆఖరి అంకానికి చేరుకుంది. నేటి రాత్రి 8.30 గంటలకు అర్జెంటినా-ఫ్రాన్స్ జట్లు లుసైల్ స్టేడియంలో టైటిల్ కోసం తలపడతాయి. ఈ మ్యాచ్‌ కోసం ప్రపంచవ్యాప్తంగా కోట్లాదిమంది ఎదురుచూస్తున్నారు. 63 మ్యాచ్‌ల తర్వాత అర్జెంటినా, ఫ్రాన్స్ జట్లు ఫైనల్‌కు చేరుకున్నాయి. ఈ రెండు జట్లు ఇప్పటి వరకు రెండుసార్లు ప్రపంచ విజేతలుగా నిలిచాయి. ఈసారి ఎవరు గెలిచినా ముచ్చటగా మూడోది అవుతుంది. రెండు జట్లలోనూ దిగ్గజ ఆటగాళ్లు ఉన్నారు. అర్జెంటినాలో ఆల్‌టైం గ్రేట్ మెస్సీ (Lionel Messi) ఉంటే, ఫ్రాన్స్ జట్టులో కైలియన్ ఎంబపె (Kylian Mbappe) అనే అనే యోధుడు ఉన్నాడు. దీంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగనుంది.

అర్జెంటినా (Argentina) సూపర్ స్టార్ మెస్సీ వయసు 35 సంవత్సరాలు. ఇదే అతడికి చివరి ప్రపంచకప్. కాబట్టి దేశానికి ప్రపంచకప్ అందించి గర్వంగా నిష్క్రమించాలని యోచిస్తున్నాడు. మరోవైపు, డిఫెండింగ్ చాంపియన్స్ అయిన 23 ఏళ్ల ఎంబపె సారథ్యంలోని ఫ్రాన్స్ జట్టు రెండోసారి కూడా కప్పును కొట్టుకుపోవాలని చూస్తోంది. ప్రపంచకప్‌లో ఐదు గోల్స్‌తో మెస్సీతో కలిసి ఉమ్మడిగా ఎంబపె రికార్డు పంచుకుంటున్నాడు. 19 ఏళ్ల వయసులోనే ప్రపంచకప్‌ను అందుకున్న ఎంబపె.. రెండోసారి కూడా కప్పును కొల్లగొట్టి పీలే సరసన చేరాలని భావిస్తున్నాడు.

గోల్డెన్ బూట్‌ రేసులో నలుగురు

గోల్డెన్ బూట్ విన్నర్ ఎవరో కూడా నేటి మ్యాచ్‌తో తేలిపోనుంది. టాప్ ఆటగాడికి ఈ బూట్ దక్కుతుంది. మెస్సీ, ఎంబపె, అర్జెంటినా ఆటగాడు జులియన్ అల్వారెజ్, ఫ్రాన్స్ ఆటగాడు ఒలివీర్ గిరౌడ్‌లు నాలుగేసి గోల్స్‌తో రేసులో ఉన్నారు. గత ఏడు టోర్నీలలో ఫ్రాన్స్ నాలుగుసార్లు ఫైనల్‌కు చేరింది. 1962లో బ్రెజిల్ బ్యాక్ టు బ్యాక్ ప్రపంచకప్‌లు సాధించింది. ఇప్పుడు వరుసగా రెండోసారి కప్పు కొట్టి బ్రెజిల్ సరసన చేరాలని ఫ్రాన్స్ ఉవ్విళ్లూరుతోంది.

1998లో ప్రపంచకప్ సాధించిన ఫ్రాన్స్ జట్టులో ఆటగాడైన డిడీర్ డెస్‌చాంప్స్ ప్రస్తుతం ఆ జట్టు కోచ్‌గా ఉన్నాడు. 54 ఏళ్ల డిడీర్ ఫ్రాన్స్‌కు వరుసగా రెండోసారి ప్రపంచకప్ అందించాలని గట్టి పట్టుదలగా ఉన్నాడు. అదే జరిగితే ఇటలీ కోచ్ విటోరియో పోజో సరసన చోటు సంపాదించుకుంటాడు. కోచ్‌గా పోజో 1934, 1938లో ఇటలీకి వరుసగా రెండుసార్లు ప్రపంచకప్‌లు అందించాడు.

36 ఏళ్ల నిరీక్షణ తీరుతుందా?

ఫ్రాన్స్‌ (France)ను చిత్తుచేసి ప్రపంచకప్‌ను సాధించడం ద్వారా 36 ఏళ్ల నిరీక్షణకు తెరదించాలని అర్జెంటినా యోచిస్తోంది. 1986లో మెక్సికోలో జరిగిన ప్రపంచకప్‌లో జర్మనీని ఓడించడం ద్వారా అర్జెంటినా కప్‌ను సొంతం చేసుకుంది. అప్పట్లో మారడోనా అర్జెంటినా ఐకాన్‌గా నిలిస్తే, ఇప్పుడు మెస్సీ పేరు మార్మోగిపోతోంది. మెస్సీ రికార్డు స్థాయిలో 26వ ప్రపంచకప్ మ్యాచ్ ఆడబోతున్నాడు. దేశానికి కప్పు అందించి మారడోనా సరసన చేరాలని భావిస్తున్నాడు.

Updated Date - 2022-12-18T17:11:31+05:30 IST