Lakshya Sen: లక్ష్యసేన్ కూడా పసిడి పట్టేశాడు
ABN , First Publish Date - 2022-08-08T23:00:12+05:30 IST
కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు మరో పసిడి దక్కింది. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో తెలుగుతేజం పీవీ సింధు

బర్మింగ్‌హామ్: కామన్వెల్త్ గేమ్స్‌లో భారత్‌కు మరో పసిడి దక్కింది. మహిళల బ్యాడ్మింటన్ సింగిల్స్‌లో తెలుగుతేజం పీవీ సింధు (PV Sindhu) స్వర్ణం కొల్లగొట్టిన కాసేపటికే మరో స్టార్ ప్లేయర్ లక్ష్యసేన్ (Lakshya Sen) పసిడి కొల్లగొట్టాడు. ఫలితంగా 20 స్వర్ణాలతో న్యూజిలాండ్‌ను వెనక్కి నెట్టేసిన భారత్.. నాలుగో స్థానానికి ఎగబాకింది.
మలేషియాకు టిజే యోంగ్‌తో జరిగిన స్వర్ణ పతక పోరులో తొలి సెట్‌ను 19-21తో ఓడిపోయిన సేన్.. ఆ తర్వాత అద్భుతంగా పుంజుకున్నాడు. రెండో సెట్లోనూ తొలుత 8-9తో వెనకబడినప్పటికీ ఆ తర్వాత దూకుడు ప్రదర్శించి ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేశాడు. ఆ తర్వాత ప్రత్యర్థికి ఒక్క పాయింట్ కూడా ఇవ్వకుండా 21-9తో చేజిక్కించుకున్నాడు. మూడో సెట్లోనూ అదే జోరు కొనసాగించి 21-16తో స్టన్నింగ్ విక్టరీ సాధించి దేశానికి మరో స్వర్ణం అందించాడు.
ప్రపంచ చాంపియన్‌షిప్ కాంస్య పతక విజేత అయిన 20 ఏళ్ల లక్ష్యసేన్ తాజా విజయంతో కామన్వెల్త్ గేమ్స్‌లో స్వర్ణం గెలిచిన ప్రకాశ్ పదుకొనే (1978), పారుపల్లి కశ్యప్ (2014), సయ్యద్ మోదీ (1982) సరసన చేరాడు. లక్ష్యసేన్ అందించిన తాజా పతకంతో భారత్ 20 స్వర్ణాలు సహా 57 పతకాలతో నాలుగో స్థానంలో దూసుకెళ్లింది. 66 స్వర్ణాలు సహా 177 పతకాలు కొల్లగొట్టిన ఆస్ట్రేలియా ఈ జాబితాలో అగ్రస్థానంలో కొనసాగుతోంది.