ఐర్లాండ్‌ 108/4

ABN , First Publish Date - 2022-06-27T09:56:44+05:30 IST

22 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయిన ఐర్లాండ్‌ను హ్యారీ టెక్టర్‌ (33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 64 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు.

ఐర్లాండ్‌ 108/4

రాణించిన టెక్టర్‌

భారత్‌తో తొలి టీ20

డబ్లిన్‌: 22 పరుగులకు మూడు వికెట్లు కోల్పోయిన ఐర్లాండ్‌ను హ్యారీ టెక్టర్‌ (33 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 64 నాటౌట్‌) మెరుపు ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు. దీంతో ఆదివారం భారత్‌తో జరిగిన తొలి టీ20లో ఐర్లాండ్‌ నిర్ణీత 12 ఓవర్లలో 4 వికెట్లకు 108 పరుగులు చేసింది. పలుమార్లు వర్షం అంతరాయం కలిగించడంతో భారత కాలమానం ప్రకారం రాత్రి 11.23కు మ్యాచ్‌ ఆరంభమైంది. అలాగే ఓవర్లను కూడా తగ్గించారు. ఈ మ్యాచ్‌ ద్వారా భారత పేసర్‌ ఉమ్రాన్‌ మాలిక్‌ అంతర్జాతీయ క్రికెట్‌లో అరంగేట్రం చేయడం విశేషం. 


ఆరంభంలో తడబడినా..:

ఇక టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఐర్లాండ్‌ స్వింగ్‌ బంతులను ఎదుర్కోలేక తొలి నాలుగు ఓవర్లలోనే మూడు వికెట్లు కోల్పోయింది. పేసర్‌ భువీ తొలి ఓవర్‌లోనే కెప్టెన్‌ బల్బర్నీని డకౌట్‌ చేయగా తర్వాతి ఓవర్‌లో స్టిర్లింగ్‌ (4)ను హార్దిక్‌ పెవిలియన్‌కు చేర్చాడు. ఇక నాలుగో ఓవర్‌లో డెలానీ (8)ని అవేశ్‌ ఖాన్‌ అవుట్‌ చేయడంతో ఐర్లాండ్‌ 22/3 స్కోరుతో దయనీయంగా కనిపించింది. కానీ ఈ దశలో టెక్టర్‌ కళ్లు చెదిరే షాట్లతో స్కోరును కదం తొక్కించాడు. ఉమ్రాన్‌ తొలి ఓవర్‌లో రెండు ఫోర్లు, ఓ సిక్స్‌తో 14 రన్స్‌ రాబట్టగా.. హార్దిక్‌ ఓవర్‌లో రెండు వరుస సిక్సర్లతో స్కోరును చక్కదిద్దాడు. అయితే తొమ్మిదో ఓవర్‌లో టక్కర్‌ (18)ను చాహల్‌ వెనక్కి పంపడంతో నాలుగో వికెట్‌కు 50 పరుగుల కీలక భాగస్వామ్యం ముగిసింది. అటు టెక్టర్‌ మాత్రం తన జోరును ఆపలేదు. పదో ఓవర్‌లో 4,6తో రెచ్చిపోయాడు. కానీ 11వ ఓవర్‌లో చాహల్‌ నాలుగు రన్స్‌ ఇవ్వగా.. 29 బంతుల్లోనే అర్ధసెంచరీ చేసిన టెక్టర్‌ ఆఖరి ఓవర్‌లో 4,6తో 17 రన్స్‌ రాబట్టడంతో స్కోరు వంద దాటింది.


స్కోరుబోర్డు:

ఐర్లాండ్‌:

స్టిర్లింగ్‌ (సి) హుడా (బి) హార్దిక్‌ 4, బాల్‌బిర్నీ (బి) భువనేశ్వర్‌ 0, డెల్నీ (సి) దినేశ్‌ (బి) అవేశ్‌ 8, టెక్టర్‌ (నాటౌట్‌) 64, టకెర్‌ (సి) అక్షర్‌ (బి) చాహల్‌ 18, డాక్రెల్‌ (నాటౌట్‌) 4, ఎక్స్‌ట్రాలు 10, మొత్తం: 12 ఓవర్లలో 108/4, వికెట్లపతనం: 1/1, 2/6, 3/22, 4/72 బౌలింగ్‌: భువనేశ్వర్‌ 3-1-16-1, హార్దిక్‌ 2-0-26-1, అవేశ్‌ఖాన్‌ 2-0-22-1, అక్షర్‌ 1-0-12-0, ఉమ్రాన్‌ మాలిక్‌ 1-0-14-0, చాహల్‌ 3-0-11-1

Updated Date - 2022-06-27T09:56:44+05:30 IST